విశాలాంధ్ర, ఉరవకొండ( అనంతపురం జిల్లా) : 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఉరవకొండ గ్రంథాలయంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్ప, ప్రభుత్వ సెంట్రల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. బాలుల దినోత్సవం పురస్కరించుకొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర చాలా కీలకమని, అటువంటి గ్రంథాలయ వ్యవస్థకు మరలా పూర్వ వైభవం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం పుస్తకాలు చదువుతున్న వారి సంఖ్య తగ్గిందని ఇది మరింత పెరగాలని అన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు అందుబాటులో వున్న గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, పుస్తక పఠనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మారుతి ప్రసాద్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.