Homeఆంధ్రప్రదేశ్కూటమిలో కొట్లాట..రోడ్డుపై బాహాబాహి

కూటమిలో కొట్లాట..రోడ్డుపై బాహాబాహి

- Advertisement -

జనసేన నాయకులు పై తెలుగు తమ్ముళ్లు పిడిగుద్దులు..

ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు ..

విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుల పై పార్టీ కార్యాలయం సాక్షిగా టిడిపి కి చెందిన కొంతమంది యువకులు పిడు గుద్ధులుతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు జనసేన యువ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. గొడవ పూర్వాపరాలకు వెళితే స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు కొవ్వూరు మండలం దొమ్మే రు లో మూడు రోజుల క్రితం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనులకు తమకు సమాచారం ఇవ్వడం లేదని జనసేన నాయకులు ఆగ్రహించినట్లు సమాచారం. జనసేన నాయకులను కొవ్వూరు టిడిపి కార్యాలయానికి పిలిపించినట్లు తెలుస్తోంది. కార్యాలయానికి జనసేన యువ నాయకులు రాగా వారిపై టిడిపి నాయకుల సమక్షంలోనే పార్టీ కార్యాలయ ఆవరణలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు జనసేన యువ నాయకులు చెబుతున్నారు. ఈ సంఘటన లో జనసేన మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగుమళ్ల స్వామి, కొవ్వూరు మండల జనసేన ప్రధాన కార్యదర్శి మైగాపుల బాలకృష్ణలు తీవ్రంగా గాయపడ్డారు. వారిపై దాడి చేయడమే కాక మీరెంత.. మీ పార్టీ ఎంత అని టిడిపికి చెందిన వారు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంత ఘర్షణ జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే టిడిపి కార్యాలయంలో నే ఉన్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. మొదటినుంచి అట్టు ముక్కగా ఉన్న జనసేన టిడిపి ల బంధం ఇప్పుడు బహిర్గతమైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వీధి రౌడీల్లా వెంటాడి కొట్టడం అమానుషం..
టిడిపికార్యాలయం వద్ద ఘర్షణ జరిగిన తర్వాత తాము నడిచి వెళ్ళిపోతుంటే ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్దకు వెళ్ళగానే వెనకాలే వచ్చిన టిడిపి గూండాలు తమను వెంటాడి తిరిగి కొట్టి గాయపరిచారని గాయపడిన జనసేన నాయకులు చెబుతున్నారు. అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేస్తాము, కానీ పార్టీని చచ్చిపోయేంతవరకు వదలమని జనసేన నాయకులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికలలో జనసేన కు కొవ్వూరు నియోజకవర్గం నుంచి సీటు వస్తుందని ఆశించామని, అలాగే రాకపోయినా టిడిపి అభ్యర్థి విజయానికి రాత్రనక, పగలనక కష్టపడ్డామని, తమకు ఇటువంటి చేదు అనుభవం జరుగుతుందని ఊహించలేదన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో దాదాపు 30 వేల ఓట్లున్న జనసేన వర్గం కూటమి గెలుపులో ముఖ్యపాత్ర వహించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నాయకులు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేయగా ఏకంగా ఆయనను ఇన్చార్జి పదవి నుంచి తమ పార్టీ అధిష్టానం తొలగించిందని, ఇప్పుడు తమపై దాడిని ఏ విధంగా సమర్థిస్తారని వారు వాపోయారు.
ఉదయం వరకు కొనసాగిన నిరసన ..బుజ్జగింపు
జనసేన బాధితులు దొమ్మేరు గ్రామంలో టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే కొవ్వూరు ఎమ్మెల్యే అర్ధరాత్రి నుండి ఉదయం వరకు వారిని బుజ్జగించి సమస్యను పరిష్కరిస్తానని సంబంధిత దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా జనసైనికులు నిరసనను విరమించారు.
మంత్రి దుర్గేష్ చెంతకు పంచాయతీ..
టిడిపికి చెందిన వ్యక్తులు తమపై దాడి జరిగిన ఉదంతాన్ని జిల్లా మంత్రి జనసేన కు చెందిన కందుల దుర్గేష్కు పూర్తిగా వివరించామని జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ నేపద్యంలో జనసేన అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై ఏమైనా కేసులు నమోదయ్యయా లేదా అన్న విషయమై కొవ్వూరు సిఐని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్లో లభించలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు