కన్వర్జెన్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : మండలంలోని ప్రతి గ్రామంలో పశువులకు అవసరమైన గడ్డి, అందుబాటులో ఉన్న గడ్డి వివరాలను సేకరించాలని ఎంపీడీవో రవి ప్రసాద్ సూచించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయ శాఖల సిబ్బందితో ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. రైతులకు గడ్డి జొన్న విత్తనాలను అందించి పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం తర్వాత సాగు చేసే పంటలకు అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మామిడి, చీని తోటల్లో అంతర పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బీడు, వాలు భూముల్లో అర్ధచంద్రాకారపు కట్టలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేయాలని సూచించారు. దీంతో భూమిలో నీరు నిలిచి, నేల కొట్టుకుపోకుండా కాపాడవచ్చని తెలిపారు. రైతుల వివరాల పరిశీలన, పంటల నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులు తిమ్మప్ప, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


