బస్టాండ్ ఆవరణలో నిరసన చేపట్టిన ఏఐకేఎస్ నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు : వేరుశనగ విత్తనాల పంపిణీ పై సమగ్ర విచారణ చేపట్టాలంటూ శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ వేరుశనగ పంట సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. కానీ రైతులకు తూతూమంత్రంగా పంపిణీ చేసి మిగిలిన వాటిని బ్లాక్ మార్కెట్ కు తరలించారని ఆరోపించారు. జిల్లాలోని 20 మండలాలకు 3000 వేల క్వింటాళ్లు మంజూరు అయినట్లు తెలిపారు. వాటిని సక్రమంగా పంపిణీ చేయకుండా కేవలం 10 శాతం మాత్రమే పంపిణీ చేసి మిగిలిన వాటిని వ్యవసాయ అధికారులు బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు విమర్శించారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేశారు. అలాగే మండలంలో నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను ఎక్కువగా విక్రయిస్తున్నారని, దుకాణాలను తనిఖీ చేయాలని మీడియా ముఖంగా విన్నవించినా మండల వ్యవసాయ అధికారి ఏలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వ్యవసాయ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, తిక్కన్న, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నాయకులు గిడ్డయ్య, బసవరాజు, నరసింహులు, రాజు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.


