విశాలాంధ్ర-రాజాం (.విజయనగరం జిల్లా) : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజాం పట్టణంలో అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయిప్రశాంత్, మాట్లాడుతూ, పేదరికం కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ, విలువలతో కూడిన విద్యను అభ్యసించి శ్రమిస్తే విజయం మనల్ని వరిస్తుందని నిరూపించిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగారని, పేపర్ బాయ్ గా జీవితాన్ని ప్రారంభించి దేశం గర్వించేలా అత్యంత గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి దేశ రక్షణ కోసం ఎంతో శ్రమించి, దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతిగా ఎదిగి, ఎంత మాత్రం అహంకారం లేకుండా అత్యంత వినయంతో ఎల్లవేళలా విద్యార్థిగా నేర్చుకుంటూ గురువుగా తన జీవిత చివరి క్షణం వరకు విద్యార్థులకు జ్ఞాన బోధ చేస్తూ కోట్ల మందికి ఆదర్శంగా నిలిచి చిట్టచివర విద్యార్థులతో ప్రసంగిస్తూ శరీరాన్ని విడిచిపెట్టినప్పటికి, ఎప్పటికీ చిరంజీవిగా దేశ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కలాం గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరూ తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డ్ గ్రహీత పెంకి చైతన్య కుమార్, గట్టి పాపారావు, ఉల్లాకుల నీలకంటేశ్వర యాదవ్, గోకవలస కృష్ణమూర్తి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


