ఏఐ టూల్స్ నేర్చుకుంటేనే పదోన్నతులు
యాక్సెంచర్ చీఫ్ జూలీ స్వీట్
ఐర్లాండ్: ఏఐ(కత్రమ మేధ) సాంకేతిక పరిజ్ఞానానికి అన్నింటా ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఏఐ పరిజ్ఞానం అత్యవసరం అయింది. దిగ్గజ కన్సల్టింగ్, ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ తన కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. కెరీర్లో వృద్ధి కోసం ఉద్యోగులు ఏఐ టూల్స్‌ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించింది. కార్యకలాపాలను ఏఐతో అనుసంధానం చేయడానికి వచ్చే మూడు సంవత్సరాల్లో 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.27,600 కోట్ల) పెట్టుబడులు పెట్టనుంది. ఏఐ నిపుణుల సంఖ్యను రెట్టింపు చేసి 80,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐను ఎక్కువగా వినియోగిస్తున్న తరుణంలో… తమ ఉద్యోగులు కెరీర్లో ఎదగడానికి ఏఐ నైపుణ్యాలు ప్రాథమిక అవసరమని యాక్సెంచర్ పేర్కొంది. ఏఐను అందిపుచ్చుకోలేని వారు కంపెనీలో కొనసాగలేకపోవచ్చని యాక్సెంచర్ చీఫ్ జూలీ స్వీట్ స్పష్టం చేశారు. కంపెనీలో ఉన్నత స్థానాలకు ఉద్యోగులు ఎదగాలంటే, ఏఐ టూల్స్‌ను తప్పనిసరిగా అందిపుచ్చుకోవాలన్నారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందాలనుకుంటే, యాక్సెంచర్‌ను నిర్వహించడానికి మేము చేసే పనులను, వారు కూడా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబరులో, 865 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆరు నెలల ఆప్టిమైజేషన్ కార్యక్రమాన్ని కంపెనీ తీసుకొచ్చింది. డిజిటల్, ఏఐ సేవల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగులు, కార్యకలాపాలను సర్దుబాటు చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
అన్నింటా ఏఐ నైపుణ్యాలు…
కార్యాలయంలో ఏఐను అనుసంధానించడం, పనిలో సాంకేతిక పరిణామక్రమంలో ఒక భాగమైంది. ప్రస్తుతం ఏఐ టూల్స్ నేర్చుకోవాలనే ఒత్తిడిని, గతంలో ఆఫీసుల్లో కంప్యూటర్లు ముఖ్యమైన భాగమైన రోజులతో జూలీ పోల్చారు. కంప్యూటర్ ఉపయోగించమని ఎవరినైనా అడగడాన్ని, ఒత్తిడి చేస్తున్నారని ఎవరూ అనరని తెలిపారు. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే, మీ కంపెనీని పునర్నిర్మించడానికి మీరు సిద్ధంగా ఉండాలని ఇతర కంపెనీల సీఈఓలకు ఆమె సలహా ఇచ్చారు. ప్రారంభంలో ఉద్యోగులు ఏఐ టూల్స్‌ను అలవాటు చేసుకోవడంలో ఇబ్బందులు పడ్డారని, వీటిని స్వీకరించడానికి సిబ్బంది, కంపెనీ సంప్రదాయ పద్ధతుల్లో మార్పులు అవసరమన్నారు.ప్రస్తుతం యాక్సెంచర్‌లో పప్రపంచవ్యాప్తంగా 7,70,000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్నారు.


