Homeజిల్లాలుఅనంతపురంఓటు చోరీకి వ్యతిరేకంగా అనంతపురంలో అఖిలపక్షం భారీ నిరసన..

ఓటు చోరీకి వ్యతిరేకంగా అనంతపురంలో అఖిలపక్షం భారీ నిరసన..

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం కార్పొరేషన్‌: ఓటు చోరీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం అనంతపురం నగరంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని కృష్ణకళామందిర్‌ నుంచి టవర్‌క్లాక్‌ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. జ్ఞానేష్‌కుమార్‌ మాస్కులు ధరించిన కొందరికి బేడీలు వేసి ర్యాలీలో తీసుకెళ్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్‌, జాఫర్‌, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సహాయ కార్యదర్శి రాజారెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబులు, జిల్లా నాయకులు నాగేంద్రకుమార్‌, రామిరెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు లక్ష్మినారాయణ, వైసీపీ నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మైనార్టీ రాష్ట్ర నాయకుడు దాదాగాంధీ తదితరులు మాట్లాడారు.

ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపును ఆపాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను లక్షిత ఓటర్ల పేర్లను తొలగించే సాధనంగా వినియోగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

సుమారు 13 కోట్ల మంది ఓటర్ల ఓటు హక్కును కుట్రపూరితంగా హరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో జ్ఞానేష్‌కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలన్నీ బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరారు. ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చి వారి ఓటు హక్కును పునరుద్ధరించాలని అన్నారు.ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని జగదీష్‌ ఆరోపించారు. ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘమే ఆ హక్కుకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేశవరెడ్డి, పద్మావతి, నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శి రమణ, వి.కె.కృష్ణుడు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్‌, సీపీఐ నాయకులు లింగమయ్య, నాగరాజు, సీఐటీయూ నాయకుడు ముర్తుజా, వైసీపీ నాయకుడు అమర్‌నాథ్‌, కాంగ్రెస్‌ నాయకులు వాసు, జాకీర్‌హుసేన్‌, ఎంయూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, ఆవాజ్‌ నాయకుడు వలి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు