బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అధికారుల వైఫల్యంతో భక్తుల అవస్థలు
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- శ్రీ కుళ్లాయిస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ ఏర్పాట్లపై వివరాలు తెలుసుకునేందుకు విశాలాంధ్ర రిపోర్టర్ ఆలయ కార్యాలయానికి ఉదయం 10.15 వెళ్లగా కార్యాలయానికి తాళం వేసి ఉండటం గమనార్హం. అనంతరం దాదాపు 30 నిమిషాల తర్వాత ఆలయ ఈవోను ఫోన్లో సంప్రదించి ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై సమాచారం కోరగా, ఏం మాట్లాడాలి?.. రాసుకుంటున్నారు కదా.. రాసుకోండిఁ అంటూ నిర్లక్ష్యంగా స్పందించారు.ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరయ్యే నేపథ్యంలో తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఈవో నుంచి సరైన సమాధానం లభించలేదు. ప్రజలకు, మీడియాకు అవసరమైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ఉన్న అధికారిణి ఈ విధంగా స్పందించడం పట్ల భక్తులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ కమిటీ, అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. నెల రోజుల ముందే ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆలయ అధికారులను అప్రమత్తం చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించలేదు. ఫలితంగా ఉత్సవాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో ఎప్పుడూ లేనివిధంగా భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో గూగూడు ప్రాంతం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. రద్దీని అంచనా వేయడంలోనూ, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలోనూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తులకు సరిపుడ స్నానపు గదులు ఎక్కువ ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. ఎండ తీవ్రత మధ్య చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించలేదని భక్తులు మండిపడ్డారు. అధికారులు చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఆలయంలో కనీసం గుక్కెడు మంచినీరు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. తాగునీరు, పారిశుధ్యం, విశ్రాంతి సదుపాయాలు వంటి ప్రాథమిక ఏర్పాట్లు లేక భక్తులు అవస్థలు పడ్డారు. ప్రజాప్రతినిధులు పదేపదే సూచనలు చేసినప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఇదిలా ఉండగా, ఏడాది క్రితం ఆలయానికి చెందిన పచ్చ హుండీ మాయమైన ఘటన ఇప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. హుండీ లెక్కింపునకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ అవి ఎక్కడ ఉన్నాయి, ఎందుకు బయటపెట్టడం లేదనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఆలయ వ్యవహారాల్లో పారదర్శకత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తుల సౌకర్యాలపై ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకుండా రాసుకోండి అని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భక్తుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత కాగా, వాటికి సమాధానం చెప్పడం, సమస్యలను పరిష్కరించడం అధికారుల బాధ్యత కాదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.సమస్యల గురించి రాయడం తప్పా?.. భక్తుల ఇబ్బందులపై ప్రశ్నించడం తప్పా?.. ఆలయానికి వచ్చే కోట్లాది ఆదాయం ఎక్కడ ఖర్చవుతోంది?.. భక్తులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు?ఁ అంటూ మహిళలు, వృద్ధులు, భక్తులు అధికారులను నిలదీస్తున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.


