Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్పీపీపీ పేరుతో మరో మోసం

పీపీపీ పేరుతో మరో మోసం

- Advertisement -


వైద్య విద్య ప్రైవేటీకరణ సామాన్యులకు శాపం....

590, 847జీవోలను తక్షణమే రద్దు చేయాలి…
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్‌

బోగిమంటల్లో జీవో కాపీలను దగ్ధం…
విశాలాంధ్ర`విశాలాంధ్ర: వైద్య విద్యను పీపీపీ పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు సీఎం చంద్రబాబు మరో మోసానికి తెరలేపడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున విజయవాడలోని దాసరిభవన్‌ వద్ద 590,847 జీవోల కాపీలను బోగిమంటల్లో దగ్ధం చేసి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు ముఖ్యఅతిథిగా హాజరైన జి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలను ప్రైవేట్‌ పరం చేసేందుకు ముద్దుగా పిపిపి అని మూడు రకాల పీలు పెట్టి మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి కావలసినటువంటి అన్ని ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన, ప్రజా సంఘాలందరూ మేధావులంతా ముక్తకంఠతో వ్యతిరేకిస్తున్న ప్రభుత్వానికి చలనం లేకుండాపోయిందన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెట్టే ఈ విధానంతో మొత్తం ప్రభుత్వ వైద్య రంగం బాగుపడుతోందని చెప్పడం సిగ్గుచేటన్నారు. పైగా కార్యకలాపాలు మొత్తం ప్రభుత్వమే నిర్వహిస్తోందని సమర్థించుకుంటూ లోపాయికారికంగా అన్ని ఒప్పందాలు జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రజలను మభ్య పెట్టడం ఏమాత్రం కూడా సరైనది కాదని హితవుపలికారు. జారీ చేసిన జీవోల్లో ఏం సూచిస్తున్నాయని అంశాన్ని ప్రజలకు తెలియజేయకుండా చంద్రబాబునాయుడు మరో మోసం చేయడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 847 జీవో ప్రకారము రెండు సంవత్సరాల పాటు మెడికల్‌ కళాశాల్లో పనిచేస్తున్న వైద్యులకు , స్టాఫ్‌ ,నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అందరికీ కూడా జీతాలు, ఇవ్వడమే కాకుండా వివిధ రూపంలో ప్రభుత్వమే డబ్బులు ఖర్చు చేస్తోందని చెబుతున్నారని, మరో ప్రక్క నిధులు లేవని చెప్పడం సిగ్గుచేటని సీపీఐ భావిస్తోందని అన్నారు. పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ కావాలని కలలు కంటున్న ప్రతిఒక్కరికి వైద్య అందుబాటులో ఉండాలని కోరారు. సామాజిక అంతరాలు పెరగకుండా మెడికల్‌ విద్యలో ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో ఉండేవిధంగా ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను బోగిమంటల్లో వేసి దగ్గం చేయాలని రాష్ట్ర పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగుతోందని తెలిపారు. అనంతరం నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్పుడు కూటమి నాయకులకే చెల్లుతోందని అన్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్‌ నిర్వహించిన యువగళంలో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే వైసీపి విడుదల చేసినటువంటి 107 , 108 జీవోలను రద్దు చేస్తామని, ప్రభుత్వమే వైద్య విద్యను కొనసాగిస్తోందని చెప్పి యువకులకు హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల అవుతున్న కోట్లాదిరూపాయిలు విలువ చేసే ఆస్ధిని ప్రైవేట్‌ వ్యక్తులకు దారాదత్తం చేసే విధానం సరికాదన్నారు. కూటమి నాయకులందరికి ఆధ్యుడైన వెంకయ్య నాయుడు ఏం చెప్పారు? వైద్య విద్య , విద్యా రంగం రెండు కూడా ప్రభుత్వమే నిర్వహించాలని చెబితే మీరు దానికి భిన్నంగా ఈ రోజున వైద్య విద్యని ప్రైవేట్‌ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. జీవో 590, 847 రెండిటిని కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. .విజయవాడలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు ముగ్గురు ఎమ్మేల్యేలు, పార్లమెంట్‌ సభ్యులు కృషి చేయాలని కోరారు. నగరంలో 16 డివిజన్‌ల్లో కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని వారందరికీ నామమాత్రపు ధరతో రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఆ దిశగా పేద ప్రజలను ఆదుకుని , నగర సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్‌ కి రావాల్సిన నిధులు సక్రమంగా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం సహకరించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు,కార్యదర్శి వర్గ సభ్యులు మూలి సాంబశివరావు, తాడి పైడయ్య,పంచదార్ల దుర్గాంబ,అప్పరబోతు రాము, కొట్టు రమణ రావు,కార్యవర్గ సభ్యులు తూనం వీరయ్య, ఎస్‌ కే నజీర్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర,నగర కార్యదర్శి లంక గోవిందరాజులు తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు