ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం; గంజాయితో సమాజానికి ఎంతో ముప్పు ఉందని డి.ఎస్.పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నందు యుటిఎఫ్ రూపొందించిన “బావి భారత పౌరులను గంజాయి బారి నుండి కాపాడుకుందాం” అనే కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం డిఎస్పి హేమంత్ కుమార్, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న గంజాయితో సమాజానికి తీవ్రమైన ముప్పు వాటిల్లనున్నదని, దాని బారి నుండి విద్యార్థులను, యువతను కాపాడటం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును రక్షించుకుందామంటూ సామాజిక ఉద్యమం పేరుతో యుటిఎఫ్ కరపత్రాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. సమస్యలను, ఒత్తిడిలను అధిగమించలేకపోవడం, పోటీని తట్టుకోలేకపోవడం, కుటుంబాలలో భావోద్రేకాలను పంచుకునే స్వేచ్ఛ లేకపోవడం, ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా వ్యసనం, సైబర్ ప్రభావం వల్ల విద్యార్థులు, యువత ప్రత్యేక ఆనందం పేరుతో గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారన్నారు.
గంజాయి నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా దాని ప్రభావం రోజురోజుకు పెరగడమే కాకుండా ఆనందంగా గడుపుతున్న కుటుంబాల్లో కల్లోలాలను సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. గంజాయి మహమ్మారి ఎంతోమంది యువకుల జీవితాలలో చీకటిని నింపి, వారి జీవితాలను నాశనం చేస్తున్నదన్నారు. గంజాయి వల్ల యువత విచక్షణ కోల్పోవడమే కాకుండా, సహనాన్ని కోల్పోయి సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతున్నారన్నారు విద్యార్థులు, యువత గంజాయి లాంటి మారక ద్రవ్యాల వైపు వెళ్లకుండా చైతన్య పరచడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం యూటీఎఫ్ డివిజన్ నాయకులు ఎం. ఆంజనేయులు ,హెచ్ రామాంజనేయులు, సకల చంద్రశేఖర్, పెద్దకోట్ల సురేష్, కృష్ణ తేజ, రాంప్రసాద్ ,పుల్లయ్య, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంజాయితో సమాజానికి ఎంతో ముప్పు
- Advertisement -
RELATED ARTICLES


