–దళారుల వ్యవస్థతో కోట్ల దందా
–రీసర్వే డిటి భీమేష్ కు ప్రత్యక్ష పాత్ర
–ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు : సీపీఐ
విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు కేంద్రబిందువుగా మారిందని, తహసీల్దార్ రామేశ్వర్ రెడ్డి నేతృత్వంలో దళారుల వ్యవస్థ ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వే నిర్వహిస్తుందన్నారు. అయితే రీ-సర్వే పేరుతో హలిగేరి, చిన్నహోతూరు, తంగరడోన గ్రామాల్లో భూమి వివాదాల్ని ఆసరాగా చేసుకుని అగ్రిమెంట్ భూములకు పాసుబుక్కులు ఇప్పిస్తామని రైతుల నుంచి లక్షల రూపాయలు వసూలను రెవిన్యూ అధికారులు వసూలు చేశారని ఆరోపించారు. గతంలో కౌతాళంలో కలిసి పనిచేసిన రామేశ్వర్ రెడ్డి, ఆర్ఐ భీమేష్‌లు పథకం ప్రకారం ఆస్పరి బదిలీ తీసుకుని అవినీతికి తెరలేపారని విమర్శించారు. భూముల రికార్డుల తారుమారు, దస్తావేజుల అక్రమ తయారీ రోజువారీ వ్యవహారంగా మారిందన్నారు. ప్రతి పనికి రేటు నిర్ణయించే డీటీ భీమేష్ కు అక్రమాల్లో ప్రత్యక్ష పాత్ర ఉందన్నారు. తహసీల్దార్ బంధువు మధుసూదన్ రెడ్డిని ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించి అక్రమ ఆదాయం పొందుతున్నారని, ఈ అవినీతి కారణంగా మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా దళారుల ఆధిపత్యంలో ఉందని కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ రామేశ్వర్ రెడ్డి, డీటీ భీమేష్‌లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, తహసీల్దార్‌ను విధుల నుంచి తొలగించాలని,కార్యాలయ రికార్డులు స్వాధీనం చేసుకుని ఏసీబీ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని, ఆధారాలతో సహా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ దృష్టికి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు ఈశ్వర్, శ్రీనివాసులు, వంశీ, బి. ఓబులేష్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.


