– డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కు ఈగల్ కమిటీ కృషి
-నన్నయలో ముగిసిన ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవ వేడుకలు
– ఐజి ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ
విశాలాంధ్ర – రాజానగరం : మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై యువతతో పాటు ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలనీ ఐజి ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నందు వర్సిటీ ఉపకులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరిగిన ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవ వేడుకలకు మంగళవారంతో ఘనంగా ముగిసాయి.ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజి ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తొలుత ఈగల్ఎస్పీ కె.నగేష్ బాబు, దక్షణ మండలి డిఎస్పీ భవ్యశ్రీ,నన్నయ వీసీ ప్రసన్నశ్రీ,రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామిలతో కలసి నన్నయ విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈఏజీఎస్ఈ- ఈగల్)ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు.డ్రగ్స్ రహిత ఏపీ కోసం ఈగల్ కృషి చేస్తుందని,సుమారు 40వేల విద్యాసంస్థల్లో ఈగల్ కమిటీలు నియమించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.ఏపీ రాష్ట్రంలో జిల్లాకు ఒక సైబర్ క్రైంపోలీసు స్టేషన్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామ న్నారు. సైబర్ స్పేస్ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.నేటి సాంకేతిక యుగంలో దురాశ, భయం,వ్యామోహం,అవమానం వంటివి సైబర్ నేరాల పెరుగుదలకు కారణాలు అవుతున్నాయని చెప్పారు. ఎక్కువ మంది నేరగాళ్ళు సైబర్ స్పేస్ లో ఉన్నారని యువత అవగాహన కలిగి తల్లిదండ్రులకు, పెద్దలకు సమాజానికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఏ సమాచారం వచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు సమాచారం అందించాల న్నారు. బెట్టింగ్ యాప్స్,లోన్ యాప్స్ బారినపడి ఆత్మహత్యలు చేసుకున్నవారు అనేక మంది ఉన్నారని పలువురు ఉదాహరణలతో వివరించారు.నిరుద్యోగు లకు ఉద్యోగాలు ఇస్తామని ఇతర దేశాలకు తీసుకు వెళ్ళి పాస్పోర్టులు స్వాదీనం చేసుకొని సైబర్ నేరాగా ళ్ళుగా మారుస్తున్నారని వాపోయారు.సత్యాన్ని అనుసరించి జీవించాలని,రాష్ట్రంలోని నేరాలకు అడ్డాగా ఉన్న ఒక గ్రామాన్ని తాను దత్తత తీసుకొని గత దశాబ్దకాలంగా నేరాలు లేకుండా అరికట్టి గ్రామంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, వారంతా మా కుటుంబ సభ్యులు అయ్యారని చెప్పారు.రాజరాజ నరేంద్రుడు, ఆదికవి నన్నయ, కందుకూరి వీరేశలింగం వంటి మహనీయులు నడయాడిన పుణ్య ప్రాంతం రాజమహేంద్రవరం ప్రాంతంలో తాను పుట్టి, పెరిగానని, ఇక్కడే విద్యాభ్యసం పూర్తి చేయడం గర్వంగా ఉంద న్నారు.ఈ ప్రాంతంలో ఉన్న నన్నయలో చదువు తున్న విద్యార్థులు అందరూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.విశ్వవిద్యాలయంలోని విద్యార్థులంతా గ్రంథాలయాన్ని పూర్తిగా ఉపయోగించు కోవాలని, అధ్యాపకుల మార్గదర్శకంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఈగల్ ఎస్పీ కె.నగేష్ బాబు మాట్లాడుతూ భయంతో, అభద్రత భావంతో మనుషులు జీవించకూడదని ఆనందంగా జీవితాన్ని గడపాలన్నారు. మహనీయుల జీవితాలోని ఉదాహరణలను తెలియజేస్తూ జీవితాన్ని ఉన్నతంగా మల్చుకోవాలని సూచించారు. మరో అతిథిగా విచ్చేసిన దక్షణ మండలి డీఎస్పీ భవ్యశ్రీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తాము పట్టుకున్న గంజాయి కేసులో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులే పట్టుబడడం దురదృష్టకరమ న్నారు.చిన్నతనం నుండి చెడు అలవాట్లుకు గురై బైక్స్ దొంగతనాలు, గంజాయి రవాణా వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. యువత అప్రమత్తంగా ఉండాలని డ్రగ్స్, సైబర్ నేరాలకు సంబంధించిన ఎటువంటి సమాచారమైన తమకు తెలియజేయాలని సూచించారు.సభకు అధ్యక్షత వహించిన నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం కేవలం వ్యక్తిగత విషాదం కాదని,ఇది కలలను,కుటుంబాల భవిష్యత్తు లను క్షీణింపజేసే సామాజిక అంటువ్యాధి అని అభివర్ణించారు. మీ విద్య కోసం త్యాగం చేసిన తల్లిదండ్రుల గురించి, మిమ్మల్ని గౌరవించే తోబుట్టువు ల గురించి ఆలోచించాలన్నారు. మాదకద్రవ్యాలు బాధను చంపవని, అవి కలలను చంపుతాయనీ వివరించారు.గత వారం రోజులగా తమ వర్సిటీ నందు జరిగిన యాంటీ రాకింగ్ వీక్ ప్రోగ్రామ్స్ విజయవంతంగా జరిగాయని,ఈ కార్యక్రమాల్లో ప్రముఖుల ఉపన్యాసాలు విద్యార్థులకు అవగాహనను మరియు స్ఫూర్తిని కలిగించాయన్నారు.”నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్” అనే నినాదంతో జీవితంలో ముందుకు సాగాలనీ పిలుపునిచ్చారు.తరువాత ఐ.జి. రవికృష్ణ సైబర్ నేరాలు, డ్రగ్స్ వంటి అంశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థులతో డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటామని, వాటి జోలికి పోమని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఈగల్ ఆంధ్రప్రదేశ్ రూపొందించిన డ్రగ్స్, సైబర్ నేరాల అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అతిథులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి, ఈగల్ డిఎస్పీ పి.సూర్య మోహన్ రావు, న్యాయాధికారి నందెపు నాగేంద్రరావు, స్టూడెంట్ ఆఫర్స్ డీన్ ఆచార్య ఎన్.ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


