. అధికారం కోసం ఏమైనా చేయగలదు
. 65 లక్షల ఓట్లు తొలగిస్తే నోరు విప్పలేదు
. కాంగ్రెస్ స్వాతంత్య్ర వేడుకల్లో మల్లికార్జున ఖడ్గే
న్యూదిల్లీ: అనైతిక బీజేపీ… అధికారం కోసం ఏమైనా చేయగలదని, ఎన్నికల్లో మోసాలు జరిగినట్లు దేశ నలుమూలల నుంచి నివేదికలు అందుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే అన్నారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్ నెపంతో 65 లక్షల మంది ఓటర్లు పెద్ద సంఖ్యలో తొలగించాలని, బతికున్న వారిని చనిపోయినట్లు చూపారని, బీజేపీ కనీసం అభ్యంతరం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో శుక్రవారంస్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఖడ్గే ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తమ పోరాటం ఎన్నికల్లో గెలుపు కోసం కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమని వక్కాణించారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్, ఎన్నికల మోసాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఏయే కారాణాలతో ఎవరెవరి ఓట్లు తొలగించారో చెప్పడానికి ఎన్నికల సంఘం వెల్లడిరచకపోవడం దాని వివక్షపూరిత వైఖరికి నిదర్శనమని ఖడ్గే అన్నారు. ప్రజల వాణి విని, ఓటర్ల జాబితా బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు ఆదేశించడం హర్షణీయమమన్నారు. 65 లక్షల ఓట్లు తొలగిస్తే పాలక పక్షం కిక్కుమనలేదు, దీనిని బట్టి ఇదంతా ఎవరి కోసం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలన్నింటిని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగిస్తోందని, ప్రత్యర్థులపై అస్త్రాలుగా ప్రయోగిస్తోందని, ఈ పద్ధతికి సుప్రీం కోర్టు అద్దంపట్టిందన్నారు. నాన్ అలైన్‌మెంట్ విధానం ద్వారా పొందిన ప్రత్యేక స్థానాన్ని భారత్ నేడు కోల్పోయిందని, ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరంగా ఉండే భారత్‌కు ఇరుగుపొరుగు దేశాలు కానీ దూర దేశాలు కానీ మద్దతుగా నిలవని పరిస్థితి ప్రస్తుతమున్నదని ఖడ్గే ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయంగా ఎన్నికలు జరగడమే ప్రజాస్వామ్యానికి మూలమన్నారు. అంబేద్కర్ 1949, జూన్ 15న రాజ్యాంగ సభలో మాట్లాడుతూ కేవలం పక్షపాతం వైఖరితో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరిని తొలగించరాదని స్పష్టంచేశారని ఖడ్గే గుర్తుచేశారు. 1947, ఆగస్టు 15న సిద్ధించిన స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో కాంగ్రెస్ పాత్ర ఏమిటో ప్రపంచానికి తెలుసన్నారు. స్వాతంత్య్ర పోరాట కథే తమ పార్టీ కథ అని ఖడ్గే చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన రెండన్నరేళ్ల తర్వాత రాజ్యాంగాన్ని అందించామని, దానిని ప్రపంచ దేశాల రాజ్యాంగబద్ధ పత్రాలతో పోల్చే అవకాశమే లేదన్నారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, ముందుచూపుగల నాయకులు శక్తిమంతమైన భారత్‌కు పునాదులు వేశారని ఖడ్గే తెలిపారు. రాజ్యాంగాన్ని అత్యున్నత స్థానంలో ఉంచుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ సమాన హోదా కల్పించారని, పేదలుధనికులు, రాజులుసామాన్యులు, పురుషులుమహిళలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండేలా హామీనిచ్చారన్నారు. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువు’ అంటూ ఖడ్గే నినాదమిచ్చారు.


