చంద్రబాబు, జగన్‌పై రామకృష్ణ విమర్శ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలకు వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల నిర్వహణ తీరే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. గతంలో అభ్యర్థుల నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ నాయకులు ఏకగ్రీవం చేయించుకున్నారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏకంగా ఓట్లు వేయకుండా ప్రజలను అడ్డుకోవడం దుర్మార్గచర్య అని ఆయన మండిపడ్డారు. విజయవాడ దాసరి భవన్ వద్ద శుక్రవారం విలేకరులతో రామకృష్ణ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 75 శాతం స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకున్నారని గుర్తుచేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా జెడ్పీటీసీ ఉపఎన్నికల ప్రక్రియ కొనసాగిందని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలుకు అవకాశం కల్పించినప్పటికీ… ఓట్లు మాత్రం వేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. దీని ద్వారా ప్రజాస్వామ్యంతో చంద్రబాబు, జగన్ రాజకీయ క్రీడ కొనసాగించారని ధ్వజమెత్తారు. ఎవరు అధికారంలో ఉన్నా చట్టాన్ని తమ చేతిల్లోకి తీసుకొని…ఎన్నికలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ గొప్పగా మాట్లాడారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరిచారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య రక్షణపై వాదనలు వినిపించారని, కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని పక్కన పెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచి… కాలితో తొక్కే చర్యలకు నాడు జగన్, నేడు చంద్రబాబు పాల్పడుతున్నారని రామకృష్ణ ఘాటుగా విమర్శించారు.
స్వాతంత్య్ర స్ఫూర్తికి మోదీ వ్యాఖ్యలు అవమానకరం
దేశ ప్రజల త్యాగం, వీరమరణం, పోరాట గాథలకు ప్రతీక అయిన స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తికి భంగకరమని రామకృష్ణ విమర్చించారు. ఎర్రకోట వేదికగా మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశ కలిగించాయని, స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాన్ని గుర్తు చేయకుండా… అనేకసార్లు నిషేధానికి గురైన… విభజనవాద స్వభావం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీవో’గా కీర్తించడం చరిత్రను వక్రీకరించే ప్రయత్నమని రామకృష్ణ విమర్శించారు. ఇది స్వాతంత్య్ర సంగ్రామ వీరుల త్యాగాలను అవమానించే చర్య అని రామకృష్ణ వ్యాఖ్యానించారు. దేశ ఐక్యత, సోదరభావం, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించాల్సిన స్వాతంత్య్ర దినోత్సవం వేదికను, ఒకే వర్గాన్ని ప్రోత్సహించే రాజకీయ వేదికగా మార్చడం అంగీకరించరానిదన్నారు. ప్రధాని వ్యక్తిగత అభిప్రాయాలను ఈ రోజు వ్యక్తీకరించడం దేశాన్ని విభజించే ప్రయత్నం మాత్రమే అవుతుందన్నారు. ప్రజలందరూ స్వాతంత్య్ర దినోత్సవం అసలు ఆత్మను త్యాగం, సమానత్వం, సోదరత్వం, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. చరిత్రను వక్రీకరించే, త్యాగవీరుల గౌరవాన్ని తగ్గించే చర్యలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని బీజేపీ పాలకులను హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే
- Advertisement -


