Home Blog Page 1470

సేవల్లో చరిత్ర లిఖించిన అడ్డూరు నాయుడు బాబు చిరస్మరణీయుడు …

– ఏ.పి. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు

విశాలాంద్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : సేవల్లో చరిత్ర లెక్కించిన స్వర్గీయ నాగిరెడ్డి వెంకటరమణ (అడ్డూరు నాయుడు బాబు) చిరస్మరణీయుడు అని ఏ.పీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. కీర్తిశేషులు నాయుడు బాబు నాల్గవ వర్ధంతి సందర్భంగా మంగళవారం అడ్డూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అయ్యన్న పాల్గొని ఆయన కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి నాయుడు బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అయ్యన్న చేతులు మీదగా బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ చోడవరం మండలం అడ్డూరు గ్రామానికి వన్నెతెచ్చిన దివంగత నాగిరెడ్డి వెంకటరమణ, అడ్డూరు నాయుడు బాబుగా ఎనలేని కీర్తి పొందారన్నారు. మండల అధ్యక్షుడి స్థాయి నుండి ప్రజా నాయకుడిగా ఎన్నో పదవులు అందిపుచ్చుకుని ప్రజలకు నిస్వార్థ సేవలందించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి జి కుమార్, స్థానిక నాయకులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నన్ను హత్య చేసేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి: షేక్ హసీనా

బంగ్లాదేశ్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. హిందువులు, మైనార్టీలపై అక్కడ జరుగుతున్న దాడులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న అనిశ్చితికి తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కారణమని ఆమె అన్నారు. మూక హత్యలకు కారణమయ్యానంటూ తనపై కేసులు పెడుతున్నారని… వాస్తవానికి విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళనలకు కుట్ర పన్నింది యూనస్ అని చెప్పారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉపాధ్యాయులు, పోలీసులు ఇలా అందరిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అల్లర్ల వెనకున్న మాస్టర్ మైండ్ యూనసేనని చెప్పారు.

తన తండ్రి మాదిరే తనను కూడా హత్య చేసేందుకు ఎన్నో కుట్రలు జరిగాయని హసీనా తెలిపారు. వాటిని ఎదుర్కోవడానికి తనకు అరగంట సమయం కూడా పట్టదని… తన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారని చెప్పారు. అధికారం కోసం తాను అక్కడే ఉంటే మారణహోమం జరిగేదని అన్నారు. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే తాను దేశం విడిచి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆందోళనకారులపై కాల్పులు జరపవద్దని తన భద్రతా సిబ్బందికి చెప్పానని తెలిపారు.

షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యక్రమం న్యూయార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

సీసీ కెమెరాల నిర్వహణ నిర్లక్ష్యంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, కారాగారాల్లో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ, సాంకేతిక లోపాల కారణంగా చాలా వరకు సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో పురోగతి లేకపోవడంతో న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ కె. మహేశ్వరరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న విచారణ నిర్వహించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,001 పోలీస్ స్టేషన్‌ల్లో పది వేలు, 81 జైళ్లలో 1,752 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ .. ఏర్పాటు చేసిన వాటిలో ఎన్ని పని చేస్తున్నాయి? పని చేయని వాటిని సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డీజీపీ, జైళ్ల శాఖ డీజీలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.

తడిచిన ధాన్యం కొనుగోలు చేయండి : సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజల్ తుపాను ప్రభావం ఇంకా తొలగిపోలేదని, మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫెంజల్ తుపాను నేపథ్యంలో చేపట్టిన సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు సమీక్ష నిర్వహించారు. వర్షాల ప్రభావం తగ్గే వరకూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు కురిసిన జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన అంచనాల ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 53 మండలాల పరిధిలో తుఫాన్ ప్రభావం ఉందని, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలను తరలించినట్లు వెల్లడించారు.ఈ సమీక్షలో ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్‌లో10 అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడంపై కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించడంతో పాటు, ఆ నిర్ణయాలను కేబినెట్‌లో చర్చ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పలు పాలసీలకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఐటీ అండ్ గ్లోబల్ కేపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0 అంటే ఆర్‌టీజీని పునర్వ్యవస్థీకరించే అంశంపై వెర్షన్ 4.0 అమలుపై మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది. దాంతో పాటు ఏపీ టెక్స్‌టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీ 4.0, ఏపీ టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీలకు ఈరోజు కేబినెట్‌లో ఆమోద ముద్ర పడనుంది. ఇప్పటికే ఒలంపిక్స్, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ఇచ్చే ప్రోత్సకాలను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పోర్ట్స్‌ పాలసీపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15 ను ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది. ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ ఆక్ట్‌లో సవరణల బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పనుంది. దీంతో పాటు 41 వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపైనే కేబినెట్‌లో సీరియస్‌గా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు

0

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కేసు నమోదు అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆయనపై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు హరీశ్ రావుపై 120బి, 386, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్ ఫోర్స్లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు. ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.

విశాఖలో విషాదం .. భవనం పైనుండి దూకి ప్రేమజంట ఆత్మహత్య

విశాఖపట్నంలోని గాజువాక పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత గాజువాకలోని ఓ ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలవారు అమలాపురం నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో దుర్గారావు, సుష్మిత మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు ఇద్దరు ఓ అపార్ట్‌మెంట్ పైనుండి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాలనీ వాసులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్

బంగ్లాదేశ్ లో హిందువులు, మైనార్టీలపై దాడులు జరుగుతుండటంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్ కు చెందిన టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని కోరుతూ అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. బంగ్లాదేశ్ లోని సుప్రీంకోర్టు న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా భారత టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఈ పిటిషన్ పై బంగ్లాదేశ్ హైకోర్టు వచ్చే వారం విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.

సంభల్‌, అజ్మీర్‌ కల్లోలంచంద్రచూడ్‌ చలవే

ఈ దేశంలో కింది కోర్టుల జడ్జీలు ఇచ్చే తీర్పులు గందరగోళంగా ఉంటున్నాయి. సంభల్‌ రగడ వ్యవహారంలో స్థానిక కోర్టు జడ్జి ఆదిత్య సింగ్‌ ఆ కేసు విచారణకు స్వీకరించడం ప్రశ్నార్థకంగా మారింది. సంభల్‌లో ప్రస్తుతం ఉన్న మసీదు కింద హరిహర మందిరం ఉందా లేదా అని తేల్చుకోవడానికి సర్వే నిర్వహించాలని ఆ న్యాయమూర్తి పురాతత్వశాఖకు నోటీసు జారీ చేశారు. అత్యున్నత కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నవారు చట్టాలకు భాష్యం చెప్పడంలో అనుసరించే పాక్షిక దృక్పథం, మరికొన్నిసార్లు ఒక మతంపై పక్షపాతంతో కూడిన ఆదేశాలు జారీ చేయడం అంతకన్నా ప్రమాదకరంగా మారుతున్నాయి. సంభల్‌ సివిల్‌ జడ్జి సర్వే చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన తరవాత అక్కడ నవంబర్‌ 24న కలహాలు చెలరేగాయి. ఈ కలహాల్లో అయిదుగురు మరణించారు. మొగల్‌ చక్రవర్తి బాబర్‌ 1529లో హరిహర దేవాలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించారని ఈ కేసులో అర్జీ పెట్టుకున్నవారు వాదిస్తున్నారు. ఇలాంటి వాదనలు చేసేవారు దేశంలో అనేక చోట్ల లెక్కలేనంత మంది ఉండొచ్చు. చరిత్రను తిరగ తోడడం మొదలు పెడితే ప్రతి ఆలయం, ప్రతి ప్రార్ధనా మందిరం వివాదాస్పదం కావచ్చు. బాబ్రీ మసీదు వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1991లో 1947 ఆగస్టు 15 కు ముందున్న మందిరాలు, ప్రార్థనా స్థలాల మీద ఎలాంటి వివాదాలు లేవనెత్తడానికి ఆస్కారం లేదని చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం నుంచి అయోధ్య-బాబ్రీ మసీద్‌ వ్యవహారాన్ని మాత్రం మినహాయించారు. ఎందుకంటే అప్పటికే అది న్యాయస్థానాల పరిశీలనలో ఉంది. అయోధ్య వివాదంపై 2019 నవంబర్‌ 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తీర్పుచెప్పిన పీఠంలో ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ సభ్యుడే. తీర్పు రాసింది కూడా ఆయనే. ఆ తీర్పు వల్ల ప్రశాంతత నెలకొని ఉండవచ్చు. చట్టపరంగా అది హాస్యాస్పదమైందని నల్సార్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా పనిచేసిన ఫైజన్‌ ముస్తఫా ఎప్పుడో వ్యాఖ్యానించారు. ప్రసిద్ధ న్యాయనిపుణుడే అంత మాటనడం చిన్న విషయం కాదు. అయోధ్యపై తీర్పులో వివాదాస్పదమైన 2.66 ఎకరాల భూమిని రామ మందిరం నిర్మించే వారికి ఇచ్చేయాలని, ముస్లింలకు ఆ పరిసరాల్లో ఎక్కడైనా అయిదెకరాల భూమి ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పు చట్టానికి అనుగుణమైంది అయితే కాదు. ఇది 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఆ వివాదాస్పద స్థలాన్ని మూడు ముక్కలు చేయాలని ఇచ్చిన తీర్పుకన్నా ఎంత మాత్రం మెరుగైంది కాదు. ప్రస్తుతం మతపరమైన రెండు అంశాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. ఒకటి ఉత్తర ప్రదేశ్‌లోని సంభల్‌పూర్‌లో ప్రస్తుతం ఉన్న మసీదు కింద హరిహర మందిరం ఉందనేది. రెండోది అజ్మీర్‌ దర్గా మొదట శివాలయమట. అజ్మీర్‌లో 800 ఏళ్లుగా ఉన్న మొయినుద్దీన్‌ చిష్తీ దర్గా కింద శివాలయం ఉందన్న వాదిస్తూ దాఖలైన పిటిషన్‌ను రాజస్థాన్‌లోని ఒక కోర్టు విచారణకు అంగీకరించింది. ఇవి రెండు విపరిణామాలకు దారి తీస్తాయి. మొదటిది ప్రతి ప్రార్థనా మందిరాన్ని, ఆలయాన్ని ప్రశ్నార్థకం చేసే కోర్టు పక్షులకు చేతినిండా పని కల్పిస్తుంది. రెండోది 1991లో ఆమోదించిన చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తుంది. శతాబ్దాల కింద నిర్మించిన ప్రతి మందిరం, మసీదుపై వివాదం రేపుతూ తవ్వకాలకు పాల్పడితే ఇక గతాన్ని తవ్వుకోవడంతోనే సరిపోతుంది. అజ్మీర్‌ దర్గాను 800 ఏళ్ల కింద అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాలిస్తున్న సమయంలో నిర్మించారు. ఇప్పుడు అది దర్గా కాదన్న వాదన లేవదీస్తున్నారు. అజ్మీర్‌ దర్గాను ఆ పరిసరాల్లోని వారే కాక దేశమంతటికీ చెందిన ముస్లింలే కాదు హిందువులు కూడా దర్శిస్తారు. భక్తిభావం వెలిబుచ్చుతారు. ప్రతి ప్రధానమంత్రి అజ్మీర్‌ దర్గాకు ‘‘చాదర్‌’’ (ఆ సమాధిపై కప్పే వస్త్రం) పంపుతూనే ఉన్నారు. గత పదేళ్ల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది చాదర్లు పంపారు. కానీ ఆయన పరివారం మాత్రం ప్రతి మసీదును తవ్వి చూడాలని కోర్టులకెక్కుతారు.
1991నాటి నాటి చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీర్పులు చెప్పడంలో, ఆ చట్టాన్ని విడమర్చడంలో కింది కోర్టుల జడ్జీల నుంచి ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన చంద్రచూడ్‌ దాకా చాలా సందర్భాలలో వక్రభాష్యాలే చెప్పారు. గ్యాన్‌ వాపి (జ్ఞాన వాపి) విషయంలో కూడా అదే జరిగింది. 1993 దాకా వివాదాస్పదమైన జ్ఞాన వాపిలో తాము ప్రార్థనలు చేశామని పిటిషన్‌ పెట్టుకున్న వారు వాదించారు. ఆ తరవాతే అక్కడ ఏడాదికొకసారి ప్రార్థించే అవకాశం ఇచ్చారు. పిటిషన్‌ పెట్టుకున్న వారు కేవలం జ్ఞాన వాపిలో ప్రార్థనలు చేయడానికి అవకాశం అడుగుతున్నారు కనక అది 1991 నాటి చట్టానికి విరుద్ధమైన కోరిక కాదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులోనే అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న చంద్రచూడ్‌ సర్వే చేయించడం 1991 నాటి చట్టాన్ని ఉల్లంఘించడం కాదన్నారు. ఆ చట్టం ప్రకారం ఏ ప్రార్థనా మందిర స్వభావాన్ని మార్చకూడదని ఉంది కాని సర్వే చేయించకూడదని లేదని చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. చివరకు సర్వేకు అనుమతించారు. ఈ తీర్పు ఆధారంగానే ఇప్పుడు సంభల్‌ మసీదు కింద హరిహర మందిరం ఉండేది కనక సర్వే చేయించాలని సంభల్‌ స్థానిక జడ్జీ ఆదేశించారు. జ్ఞాన వాపి కేసులో 1991నాటి చట్టాన్ని చంద్రచూడ్‌ సవ్యంగా విడమర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. జ్ఞానవాపి విషయంలో చంద్రచూడ్‌ ఇచ్చిన తీర్పు చివరకు పాముల బుట్టను తెరిచినట్టు అయింది. సర్వే చేయించడం ఉన్న పరిస్థితిని మార్చడం కాదని భాష్యం చెప్పడంతో ఇలాంటి వివాదాలను రేకెత్తించడంపై 1991 నాటి చట్టం విధించిన నిషేధం నీరుగారిపోయింది. జ్ఞానవాపి కేసులో చంద్రచూడ్‌ 1993 దాకా అక్కడ పూజలు చేసుకునే అవకాశం ఉండేది అన్న వాదనకు అనుకూలంగా సర్వేకు ఆదేశం జారీ చేశారు. ఇది 1991నాటి చట్టంలో వాడిన భాష అంతరార్థానికి, చట్టం అసలు ఉద్దేశానికే విరుద్ధం. చంద్రచూడ్‌ అనుసరించిన వైఖరినే కింది కోర్టులు కూడా అనుసరిస్తున్నట్టున్నాయి. ఈ వివాదాలు మసీదులకే పరిమితమై పోలేదు. బౌద్ధారామాలపై హిందూ దేవాలయాలు నిర్మించారన్న వాదనలూ ఉన్నాయి. రామేశ్వర్‌ ధాం, శబరిమల ఆలయాల మీద వివాదాలు అందరికీ తెలిసినవే. 2018లో ఐక్య మాల ఆర్య మహాసభకు చెందిన పి.కె.సజీవ్‌ ‘‘మా దేవాలయం మాకు ఇప్పించి న్యాయం చేయించండి’’ అని అడుగుతున్నారు. మరో వేపు ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ కొన్ని ప్రార్థనా స్థలాల మీది అవి మనవి అన్న భావన ఉండుచ్చు. కానీ ప్రతిరోజూ ఓ కొత్త వివాదం లేవనెత్తడం అనవసరం అంటారు. కానీ అది సంఫ్‌ు పరివారానికి అర్థం కావలసిన రీతిలో అర్థం అవుతుంది. భాష్యకారులైన న్యాయమూర్తుల అండ వారికి ఉంటుంది.

పెచ్చరిల్లిన మతహింస

0

ఇది బీజేపీ దుష్టపాలన ఫలితం

. ప్రతిఘటనకు అభ్యుదయశక్తుల ఐక్యత అనివార్యం
. 10న నిరసనలు, డిమాండ్స్‌ డే
. జాతీయ సమితి తీర్మానాలు వెల్లడిరచిన డి.రాజా

న్యూదిల్లీ : బీజేపీ దుష్టపరిపాలన ఫలితమే దేశంలో మతహింస పెచ్చరిల్లడానికి కారణమని భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) నిశితంగా విమర్శించింది. దేశంలో, ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న మత ఉద్రిక్తతలను ప్రతిఘటించేందుకు ప్రగతిశీల, అభ్యుదయశక్తులు అనివార్యంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నవంబరు 28, 29, 30 తేదీలలో న్యూదిల్లీ సీపీిఐ కేంద్ర కార్యాలయం అజయ్‌భవన్‌లో పార్టీ జాతీయసమితి సమావేశాలు జరిగాయి. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ప్రకాశ్‌ బాబు అధ్యక్షతన మూడురోజులు జరిగిన సమావేశంలో చేసిన తీర్మానాలను పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సోమవారం పత్రికాగోష్టిలో విడుదల చేశారు. దేశ రాజకీయ, ఆర్థిక పరిణామాలతోపాటు వచ్చే ఏడాది జరిగే సీపీఐ జాతీయ మహాసభలకు సంబంధించిన మార్గదర్శకాలపై డి.రాజా సమావేశాల్లో నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ఈ నివేదికపై వివరణాత్మక చర్చ జరిగింది. ఉత్తరప్రదేశ్‌ సంభల్‌లో తలెత్తిన మతహింస గురించి ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దిల్లీలో నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం
దిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నిర్మాణ కార్యకలాపాలపై ఆ నగరంలో నిషేధం విధించారు. ఈ కారణంగా నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారు ఉద్యోగాలు, వేతన నష్టాలకు గురవుతున్నారు. అందువల్ల నిర్మాణ కార్మికులకు తగిన ఆర్థిక సహాయం చేయాలని పార్టీ జాతీయ సమితి డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసింది. మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాల్లో ఎలాంటి మార్పూలేదు. ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 60,000 మందికిపైగా ప్రజలు శరణార్థ శిబిరాల్లో తలదాచుకున్నారు. మణిపూర్‌లో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తున్నది. అందువల్ల మణిపూర్‌ ప్రభుత్వం రాజీనామా చేయాలని సమావేశం తీర్మానించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) పథకం అమలులో ఎన్నో లొసుగులు, లోపాలు ఉన్నాయి. ఈ పథకం కింద ఉన్న అర్హులైనవారిజాబితా నుండి లక్షలాదిమంది కార్మికుల పేర్లు తొలగించారు. ఆధార్‌కార్టుల్లో తలెత్తిన సమస్యల వల్ల వేలాదిమంది కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు. ఈ లొసుగులన్నింటినీ సరిద్దాలి. ఈ పథకం కింద కార్మికులకు రోజుకు ఒక్కొక్కరికీ రూ.700 వంతున ఏడాదికి కనీసం 200 రోజులు పని ఇవ్వాలని సమావేశం తీర్మానం చేసింది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై మతహింస
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల చెలరేగుతున్న హింసాత్మక ఘటనల పట్ల సీపీఐ జాతీయ సమితి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేషం రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వే ఈ విధమైన చర్యలు కేవలం లౌకిక సూత్రాలతోపాటు సమానత్వం, న్యాయాలను ఉల్లంఘించడం మాత్రమేకాదు… బంగ్లాదేశ్‌ భిన్నమత సమాజ సహజీవన స్థిరత్వానికీ, మతసామరస్యతకూ పెద్ద బెడదగా మారుతుంది. అందువల్ల బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఆసరాగా చేసుకుని మనదేశంలో నిరసనల ముసుగులో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు మతోన్మాదశక్తులు లేదా అధికారపార్టీ చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా అన్ని ప్రగతిశీల, అభ్యుదయ, లౌకికవాద శక్తులు వ్యతిరేకించాలని సమావేశం మరో తీర్మానంలో పిలుపు ఇచ్చింది. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఏవిధమైన మతఘర్షణలు జరగకుండా చూడాలని, అప్రమత్తంగా వ్యవహరించి వాటిని నివారించాలని సమావేశం కోరింది. అదేవిధంగా, దేశంలో ప్రాజెక్టుల నిర్మాణాల కారణంగా నష్టపోయే ప్రజలకు పునరావాసం కల్పించాలని, ఉత్తరాఖండ్‌లో క్రూర జంతువుల బారినపడి తీవ్రంగా నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని సమావేశం తీర్మానాలు చేసింది.
సీపీఐ శతాబ్ది సంవత్సర వేడుకలు
భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) శతాబ్ది సంవత్సర వేడుకల లోగోను డి.రాజా జాతీయ సమితి సమావేశాలలో ఆవిష్కరించారు. వంద సంవత్సరాల క్రితం పార్టీ వ్యవస్థాపక మహాసభలు జరిగిన ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో తిరిగి అదేరోజున అంటే ఈనెల 26వ తేదీన సమావేశం నిర్వహించాలని జాతీయ సమితి నిర్ణయించింది.
కాన్పూర్‌ సమావేశం ద్వారా పార్టీ శతాబ్ది సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 2025 డిసెంబరు 26వ తేదీన సీపీఐ శతాబ్ది సంవత్సర వేడుకల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ, బహిరంగసభ నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.