విల్నియస్: డీహెచ్‌ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737 రవాణా విమానం సోమవారం లిథువే నియా రాజధాని విల్నియస్ విమానాశ్రయ సమీపంలోని ఇళ్లపై కుప్ప కూలింది. ఈ విమానం విమానాశ్రయంలో దిగడానికి కొద్ది నిమిషాల ముందు సమీపంలోని లిప్‌కల్నిస్ అనే ప్రాంతంపై పడిపోయింది. లిథువేనియా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 6గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. అగ్నిమాపక, సహాయక సిబ్బంది వేగంగా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానం జర్మనీలోని లీప్‌జిగ్ నుంచి బయల్దేరింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విమానాన్ని డీహెచ్‌ఎల్ కోసం స్విఫ్ట్ ఎయిర్ లైన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతానికి విమానా శ్రయంలోని మిగిలిన విమానాలను కూడా నిలిపివేశారు. మరోవైపు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం మాత్రం ఈ విమానం కూలిన ఇళ్లల్లోని ప్రజలు సురక్షితంగానే ఉన్నారని తెలిపింది.
రష్యా దళాల అదుపులో బ్రిటన్ జాతీయుడు
కీవ్: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రరూపు దాల్చుతున్న సమయంలో ఉక్రెయిన్ తరఫున యుద్ధం చేస్తున్న ఓ బ్రిటన్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా బలగాలు వెల్లడిరచాయి. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ స్కాట్ రైస్ ఆండర్సన్ అనే వ్యక్తి సైనిక దుస్తులు ధరించి, ఉక్రెయిన్ తరఫున యుద్ధంలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడిరచారు. గతంలో అతడు బ్రిటిష్ సైన్యంలో పని చేసినట్లుగా గుర్తించామన్నారు. అతడికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. కాగా ఈ ఆరోపణలపై బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం స్పందిస్తూ తమ దేశానికి చెందిన పౌరుడిని రష్యా అధికారులు నిర్బంధించారని…ఈ సమయంలో బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. కాగా.. వేయి రోజులు పూర్తవుతున్నా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం భీకరంగానే సాగుతోంది. ఈక్రమంలోనే దీర్ఘశ్రేణి క్షిపణులను మాస్కోపై ప్రయోగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు అనుమతి ఇవ్వడంతో అమెరికా తయారుచేసిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ శత్రుదేశంపై ప్రయోగించింది. కాగా ఉత్తరకొరియా సైన్యం రష్యాకు సైనికులు, ఆయుధాలను సరఫరా చేస్తున్న నేపథ్యంలోనే బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఇతర దేశాలు కల్పించుకుంటే మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించారు. అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం చేసేలా ఓ దస్త్రంపై సంతకం చేశారు. దీంతోపాటు ఉక్రెయిన్‌కు సహాయ సహకారాలందించే దేశాలను యుద్ధంలో తమ ప్రత్యర్థులుగానే భావిస్తామని ప్రకటించారు.
లౌకిక, సామ్యవాద పదాలు తొలగించం
పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
న్యూదిల్లీ : రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సోమవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలు జోడిస్తూ 1976లో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పదాలు తొలగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తదితరులు ఈ పిటిషన్లు వేశారు. ఆ సవరణపై పార్ల మెంట్‌లో చర్చే జరగలేదని వారు వాదించారు. ఎమర్జెన్సీ (1975-77) సమ యంలో చేసిన ఈ సవరణల చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీంకోర్టు నవంబర్ 22న తీర్పు రిజర్వ్ చేసి… తాజాగా ఆ పిటిషన్లు కొట్టివేసింది. ఈ పదాలకు వివిధ వివరణ లున్నాయని, వేర్వేరుగా అన్వయించుకుం టున్నారని గత విచారణల్లో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడిరది. ‘సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని అర్థం. సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. మీరు దీనిని మరో రకంగా చూడకూడదు. అప్పుడు వేరే అర్థం కూడా వస్తుంది. ఇక లౌకికవాదం అనే పదం కూడా అంతే’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.
సౌర విద్యుత్ కేంద్రంగా ఏపీ
. ప్రతి ఇల్లూ, కార్యాలయంలో ఉత్పత్తి కావాలి
. వినియోగదారుడికి అదనపు ఆదాయ వనరుగా మారాలి
. పీిఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా గరిష్ఠ లబ్ధి
. పైలెట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు: సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఇళ్లూ, కార్యాలయం సౌరశక్తిని ఒడిసిపట్టి విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో స్వావలంబన సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్‌కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. సౌర విద్యుత్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు సత్వరం అమల్లోకి తేవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక వాతారవణ పరిస్థితుల కారణంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తితో తిరుగులేని ఫలితాలు సాధించవచ్చని సీిఎం అన్నారు. సోలార్ విద్యుత్‌తో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి, సోలరైజేషన్ కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రజలు తమ ఇళ్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రతి వినియోగదారుడు తమకు అవసరమైన విద్యుత్‌ను ఉచితంగా పొందడమే కాకుండా, మిగిలిన విద్యుత్‌తో అదనంగా ఆదాయం పొందే పరిస్థితి రావాలన్నారు. దీని కోసం ప్రజలను చైతన్య పరిచి, కేంద్ర కార్యక్రమాలయిన పీిఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలను వారికి చేరువ చేయాలని అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ప్రజల ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి, 100 శాతం సౌర విద్యుత్ గ్రామాలు ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై 100 శాతం సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటు, పూర్తిస్థాయి సోలరైజేషన్‌లో భాగంగా కుప్పాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని చేపట్టే పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో సౌరవిద్యుత్ వినియోగంలోకి తెచ్చే అంశంపైనా అధికారులు సాధ్యాసాధ్యాలను వివరించారు. కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలనూ వివరించారు.
భారీ ఎత్తున కేంద్ర సబ్సిడీ
పీఎం సూర్య ఘర్`ముఫ్త్ బిజిలీ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ ప్రారంభించగా, ఏడాదిలో కోటి గృహాలు ఈ పథకం పరిధిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా, 30 లక్షల ఇళ్లలో ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ అమర్చుకునే గృహ విద్యుత్ వినియోగదారులకు కేంద్రం భారీగా సబ్సిడీ ఇస్తోందని, 1 కిలో వాట్‌కి ఎస్‌ఆర్టీ (సోలార్ రూఫ్ టాప్) కి రూ.50 వేలు ఖర్చు అవుతుండగా, రూ.30 వేలు సబ్సిడీ రానుంది. అలాగే 2 కిలో వాట్లకు వ్యయం రూ.1 లక్ష కాగా సబ్సిడీ రూ.60 వేలు, 3 కిలో వాట్లకు పెట్టుబడి రూ.1 లక్షా 45 వేలు కాగా, రూ.78 వేలు సబ్సిడీ రూపంలో కేంద్రం ఇస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ఈ పథకానికి తమ సమ్మతి తెలుపుతూ ఇప్పటివరకు 6,33,045 మంది గృహ విద్యుత్ వినియోగదారులు నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 50,314 ఇళ్లు సౌర విద్యుత్ అమర్చేందుకు అనుకూలంగా ఉండగా, 50,312 ఇళ్ల యజమానులు తమ అంగీకారం తెలిపారు. దీంతో కుప్పం నియోజవర్గంలో 2 కోట్ల 66 లక్షల 15 వేల 521 చదరపు అడుగుల విస్తీర్ణంలో సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లభిస్తుందని తెలిపారు.
అదానీ ముడుపులపై దద్దిరిల్లిన పార్లమెంటు
చర్చకు మోదీ సర్కారు వెనుకంజ
. వాయిదా తీర్మానాల తిరస్కరణ
. ప్రతిపక్ష ఎంపీల నినాదాల హోరు
. నిమిషాల వ్యవధిలోనే ఉభయసభల వాయిదా
న్యూదిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపూర్‌లో మరోసారి చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు మోదీ సర్కారు భయపడుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజునే అది స్పష్టమైంది. రెండు సభల్లోనూ ఈ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు సభాపతులు అనుమతించలేదు. ఇండియా ఐక్యసంఘటన ఎంపీల నినాదాల నడుమ బుధవారానికి ఉభయ సభలు వాయిదాపడ్డాయి. సోమవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఊహించినట్లుగానే అదానీ అంశం, మణిపూర్ హింస ఉభయసభలను కుదిపేశాయి. ఉభయ సభలు ప్రారంభమవగానే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే మధ్యాహ్నం 12 గంటలకు సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో తొలుత ఇటీవల కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, మనీశ్ తివారీ, మాణిక్కం ఠాగూర్- అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై చర్చించాలని, దీనిపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టగా… స్పీకర్ ఓం బిర్లా వాటిని తిరస్కరిస్తూ… సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు కొనసాగడంతో ఒక రోజంతా వాయిపడ్డాయి. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభ తొలుత 15 నిమిషాలు వాయిదా పడిరది. మళ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష సభ్యుల నిరసన నడుమ బుధవారానికి వాయిదా పడిరది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం లోక్‌సభ, రాజ్యసభ నిర్వహించకపోవడంతో తిరిగి బుధవారం ఉభయసభలు సమావేశం కానున్నాయి. తొలుత పార్లమెంటులో ఏయే అంశాలు చర్చించాలన్నదానిపై కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు సూచనలు చేసింది. ఉదయం పదిన్నర గంటలకు పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ ఎంపీలందరూ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎంపీలు కేసీ వేణుగోపాల్, మనీశ్ తివారీ, మాణిక్కం ఠాగూర్‌లు అదానీ గ్రూప్ అక్రమాల అంశంపై చర్చించాలని, జేపీసీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. భారత వ్యాపార రంగంపై అదానీ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ప్రక్రియల పటిష్టతపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ మౌనం వల్ల దేశ సమగ్రత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనీ, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు మొత్తం 16 బిల్లులు రానున్నాయి.
దూసుకొస్తున్న తుపానుకోస్తాంధ్రకు
ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తరకోస్తాలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా 26, 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం దక్షిణ, ఉత్తర కోస్తాలో ఎక్కువగా ఉండనున్నట్లు వెల్లడిరచింది. వాతావరణ కేంద్రం ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం ట్రింకోమలీకి 600 కిలోమీటర్లు, నాగపట్నానికి 880, పుదుచ్చేరికి 980, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని తెలిపింది. రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం… గడిచిన మూడు గంటల్లోనే 30 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సెకీ ఒప్పందంతోనాకు సంబంధం లేదు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్‌లో నిర్ణయం కోసం అర్థరాత్రి దస్త్రాన్ని పంపి సంతకం చేయమన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కేవలం మంత్రి వర్గం చర్చ కోసం అనుకుని సంతకం చేశానన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాలినేని కౌంటర్ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ స్థాయి ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా ఒంగోలు జిల్లాల్లో ఆర్టీసీ సైట్లను తీసుకున్నవా?, లేదా? అని నిలదీశారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా పని చేస్తూ కందుకూరు, సంత నూతల పాడు నియోజకవర్గాల్లో చెవిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు బయటకు తీయమంటావా? అని నిలదీశారు. చెవిరెడ్డిది చిత్తూరు జిల్లా అయ్యి ఉండి కూడా ఒంగోలులో మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అండతో చేసిన బాగోతాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే కాదని… విజయమ్మ, షర్మిల కూడా అని అన్నారు. ఎవరి మెప్పు కోసం పని చేయడం లేదని, ఈ విషయాన్ని అందరూ గుర్తెరగాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లో మార్పులు.. ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లో కీలక మార్పులు ఉ ఇక పై రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయిన మూడో నెలలో ఒకేసారి ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోతే, రెండో నెలలో రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి అందిస్తారని, అలాగే రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే, మూడో నెలలో ఆ రెండు నెలల మొత్తాన్ని కలిపి మూడు నెలల పెన్షన్ మొత్తం ఒకేసారి అందించబడుతుందని తెలిపారు. మూడు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే, వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి, వారి పెన్షన్ ఆపివేయడం జరుగుతుందని, వారు తిరిగి తమ స్వస్థలనికి వచ్చిన తర్వాత పెన్షన్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకుంటే, వారికి తిరిగి పెన్షన్ అందించబడుతుందని తెలిపారు. కావున పై విషయాలను పెన్షన్ దారులు గమనించాలని తెలిపారు.
ఓటు వజ్రాయుధం లాంటిది.. డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.. కతి జున్ కుప్రా
విశాలాంధ్ర ధర్మవరం : ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డివిజనల్ పరిపాలన అధికారిని కతిజున్ కుప్రా తెలిపారు
ఈ సందర్భంగా పట్టణంలోని రేగాటిపల్లి రోడ్ శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో, కళాశాల విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు అనేది రాష్ట్రంలో మంచి పరిపాలనకు శ్రీకారం చూపుతుందని తెలిపారు. ఓటును సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి కు మార్గదర్శకం సుగమం అవుతుందని తెలిపారు. 2025 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోనుటకు అర్హులు అని తెలిపారు. ఓటు యందు ఫారం-6, ఫారం-6 ఏ, ఫారం-7, ఫారంబి8 వాటిపై కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఓటు హక్కు మీ జన్మ హక్కు అని వారు తెలిపారు. యువతరం ఓట్లు ప్రగతికి మెట్లు అని తెలిపారు. అనంతరం ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు పోలింగ్ బూత్ కేంద్రాలు పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓ లకు సూచనలు తీసుకోవలసిన జాగ్రత్తలను వారువివరించారు. ఈ కార్యక్రమంలో ఈ డి టి ఈశ్వరయ్య, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ రాఘవరెడ్డి, సిబ్బంది రాజ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ హర్షవర్ధన్, అధ్యాపక బృందం, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి భక్తులకు ఉచితంగా అన్నదానం.. గురు స్వామి విజయకుమార్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని చెరువు కట్ట మార్గంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి భజన మందిరంలో అయ్యప్ప మాల ధారణ భక్తాదులకు ఈనెల 22వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత భోజన పంపిణీని నిర్వహిస్తున్నట్లు గురుస్వామి విజయ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు బోధన పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయ్యప్ప మాల ధారణ వేసిన ప్రతి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలని వారు తెలిపారు.

