Friday, May 9, 2025
Home Blog Page 3

మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. సీఐడీ విచారణకు సజ్జల, అవినాష్ హాజరు

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన విచారణకు మరో నేత దేవినేని అవినాష్‌తో కలిసి హాజరయ్యారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటనకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

విచారణకు వస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి వాహనాన్ని పోలీసులు కోర్టు రోడ్డు వద్దనే నిలిపివేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి సీఐడీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. సజ్జలకు సంఘీభావంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐడీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌ల వాంగ్మూలాలను సీఐడీ అధికారులు నమోదు చేసినట్లు సమాచారం.

భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో..బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ వాయిదా

భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నిర్వహించడం సరికాదని నిర్ణయించింది. ఐపీఎల్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్‌ లీగ్‌ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్‌లున్నాయి. లఖ్‌నవూ, హైదరాబాద్, అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి, జైపుర్‌ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

గురువారం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భద్రతాకారణాలరీత్యా అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. పరిస్థితిని బట్టి టోర్నమెంట్‌ భవిష్యత్తుపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటాం. అన్నింటికన్నా ఆటగాళ్ల భద్రత ముఖ్యం అని పేర్కొన్నారు.

స‌రిహ‌ద్దుల్లో పాక్‌ కాల్పులు.. తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ ఆప‌రేష‌న్‌ను సహించ‌లేని దాయాది పాకిస్థాన్ జ‌రిపిన కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందారు. మృతిచెందిన జ‌వాన్‌ను ముర‌ళీ నాయ‌క్‌గా గుర్తించారు. వీర జవాన్‌ది ఏపీలోని స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌ల ప‌రిధిలోని క‌ల్లి తండా. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు వెంబ‌డి పాక్ కాల్పులు జ‌ర‌ప‌గా మ‌న సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ముర‌ళీ నాయ‌క్ చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం. శ‌నివారం స్వ‌గ్రామానికి వీర జ‌వాన్ పార్థివ దేహం రానున్న‌ట్లు తెలుస్తోంది.కాగా, వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ సోమందేప‌ల్లి మండ‌లం నాగినాయ‌ని చెరువుతండాలో పెరిగాడు. సోమందేప‌ల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌లో చ‌దివాడు. జ‌వాన్ మృతితో ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. దీంతో స్వ‌గ్రామం క‌ల్లితండాలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

జడ్ ప్లస్ సెక్యూరిటీని పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తన భద్రతను భారీగా తగ్గించారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఆయన నిన్న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. తనకు ఉన్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకుని, నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం జడ్ ప్లస్ భద్రతను తిరిగి కల్పించాలని జగన్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. తన నివాసం, కార్యాలయం వద్ద పటిష్టమైన భద్రతతో పాటు, జామర్లు, పూర్తిస్థాయిలో పనిచేసే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం వాహనం సమకూర్చలేని పక్షంలో, తన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనకున్న ముప్పు దృష్ట్యా తక్షణమే సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీ బలగాలతో తగిన భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, నోటీసు గానీ ఇవ్వకుండా తన భద్రతను భారీగా తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం తనకు కేటాయించిన భద్రత నామమాత్రంగా ఉందని, బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా పని చేయడం లేదని జగన్ తెలిపారు. అధికార కూటమికి చెందిన నేతల నుంచి తనకు భౌతికంగా హాని తలపెడతామంటూ బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. పలు పర్యటనల్లో ప్రభుత్వం కనీస భద్రత కూడా కల్పించలేదని, గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు ఒక్క కానిస్టేబుల్‌ను కూడా నియమించలేదని గుర్తుచేశారు. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలోనూ హెలిప్యాడ్ వద్ద భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయని, దీనిపై పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారని తెలిపారు.

పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్

స్వదేశీ ఆకాశ్ క్షిపణి సత్తా..
భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత లక్ష్యాలపై పాక్ చేసే కుయుక్తులను భగ్నం చేయడంలో ఈ మేడ్ ఇన్ ఇండియా ఆయుధం కీలక పాత్ర పోషిస్తోందని ఏఎన్ఐ వార్తా సంస్థకు అధికారులు తెలిపారు.

భారత సాయుధ దళాలు మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను పాకిస్తాన్ దాడులను నిరోధించడానికి విజయవంతంగా ఉపయోగిస్తున్నాయని రక్షణ శాఖ అధికారులు ఏఎన్ఐకి వివరించారు. భారత సైన్యం మరియు భారత వైమానిక దళం రెండూ ఈ క్షిపణి వ్యవస్థలను పాకిస్తాన్ సరిహద్దు పొడవునా మోహరించినట్లు వారు పేర్కొన్నారు.

భారత లక్ష్యాలపై పాకిస్థాన్ చేసే దాడులను తిప్పికొట్టడంలో మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను భారత సాయుధ దళాలు సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. భారత సైన్యం, వాయుసేన రెండూ పాక్ సరిహద్దు వెంబడి ఈ క్షిపణి వ్యవస్థను కలిగి ఉన్నాయిఁ అని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తక్షణమే స్పందించి, శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసేందుకు ఈ వ్యవస్థలు నిరంతరం సన్నద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం, భారత రక్షణ రంగ స్వావలంబనను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

ఉగ్రవాదుల చొరబాటుయత్నం.. ఏడుగురి కాల్చివేత..

భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో భారీ చొరబాటుయత్నాన్ని బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున సాంబ సెక్టార్ లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సర్వేలెన్స్ కెమెరాల ద్వారా ఈ విషయం గుర్తించిన బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. బీఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో పాక్ సైనిక పోస్ట్ ధ్వంసమైందని తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్యపై బీఎస్ఎఫ్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. కాగా, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి సర్వేలెన్స్ కెమెరా ఫుటేజీని భద్రతా బలగాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

మ‌ళ్లీ చండీగఢ్ , జ‌మ్మూలో సైర‌న్ల మోత

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో.. సరిహద్దు జిల్లాలపై పాక్‌ వైపు నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని చండీగఢ్‌లో నేటి తెల్ల‌వారు జామున మరోసారి సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దాడులు జరిగే అవకాశం ఉందంటూ.. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఈ హెచ్చరిక జారీ చేసింది.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసిన తరుణంలో చండీగఢ్‌ డిప్యూటీ కమిషనర్‌ కూడా ఓ హెచ్చరిక జారీ చేశారు.. జమ్ములోనూ ఈ ఉదయం సైరన్లు మోగాయి. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, సుర‌క్షిత ప్రాంతాల‌లో త‌ల‌దాచుకోవాల‌ని కోరింది..

సరిహద్దు దేశాలలో శాంతి నెలకొనాలి

భారత్ పాక్ యుద్ధంపై చైనా రియాక్షన్

భారత్- పాక్ మధ్య యుద్ధంపై చైనా తాజాగా స్పందించింది. ఈ పరిణామంతో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. సరిహద్దు దేశాలలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజంతో పనిచేస్తామని పేర్కొంది. ఈమేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్.. అంతర్జాతీయ సాయం కోసం విజ్ఞప్తి

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. శత్రువు దాడుల వల్ల భారీ నష్టాలు వాటిల్లాయని, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయని పేర్కొంటూ, మరిన్ని రుణాలు అందించాలని పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ భాగస్వాములను అభ్యర్థించింది. ఉద్రిక్తతలు తగ్గించడానికి సహాయం చేయాలని కూడా కోరింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం, ఎక్స్ వేదికగా ఈ విజ్ఞప్తిని చేసింది. శత్రువు వల్ల కలిగిన భారీ నష్టాల నేపథ్యంలో మరిన్ని రుణాల కోసం అంతర్జాతీయ భాగస్వాములకు పాకిస్థాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. పెరుగుతున్న యుద్ధ వాతావరణం, స్టాక్ మార్కెట్ పతనం మధ్య, ఉద్రిక్తతలు తగ్గించడానికి అంతర్జాతీయ భాగస్వాములు సహాయం చేయాలని మేము కోరుతున్నాంఁ అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.

హై అల‌ర్ట్‌లోనే ఢిల్లీ.. ప్ర‌భుత్వ ఉద్యోగుల సెల‌వులు ర‌ద్దు

ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత దాయాది పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ధితో భార‌త్‌పై డ్రోన్‌, క్షిప‌ణి దాడుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిత‌క్త‌ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల సెల‌వులు ర‌ద్దు అయ్యాయి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఎదుర్కొనేలా వైద్య‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగాల సంసిద్ధ‌త‌ను స‌మీక్షిస్తున్నారు. ఁపోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. సున్నిత‌మైన ప్రాంతాల‌లో అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తున్నాం. రాత్రిపూట నిఘా ముమ్మ‌రం చేశాంఁ అని అధికారులు తెలిపారు. ఇక‌, ఈ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే దేశంలో 24 విమాన‌శ్ర‌యాలు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే దేశ రాజ‌ధానికి రాక‌పోక‌లు కొన‌సాగించే ప‌లు విమానాలను క్యాన్సిల్ చేశారు. ఇండియా గేట్ వ‌ద్ద ట్రాఫిక్‌ను నియంత్రించ‌డంతో పాటు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల‌ని స్థానికుల‌ను అధికారులు ఆదేశించారు.