వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం కాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో భాగంగా పార్టీని బలోపేతం చేసే అంశంతో పాటు, కూటమి ప్రభుత్వంపై ప్రజా పోరాటం ఎలా చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. పార్టీకి సంబంధించిన కమిటీల ఏర్పాటు గురించి చర్చించనున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, కార్యదర్శులు హాజరుకానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకన్లపాటు కంపించింది. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రిక్టార్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు సమాచారం. మేడారంలో సెప్టెంబర్ 4న లక్ష వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. పెనుగంచిప్రోలు, గంపలగూడెం, పాత తిరువూరులో ఉదయం 7:40 గంటలకు కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది. రెడ్డిగూడెం, నందిగామ, కంచికచర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోనూ భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్లపాటు ఇళ్లు, భవనాలు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. భయాందోళనతో రోడ్లుపైకి పరుగులు పెట్టారని వాపోతున్నారు.
తూ.గో.జిల్లా దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో భూమి కంపించినట్లు సమాచారం. రాజమండ్రి తాడితోట, మోరంపూడి ప్రాంతాల్లో సెకన్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు అంటున్నారు. అల్లూరి జిల్లా చింతూరు డివిజన్‌లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఉదయం ఏడు గంటల సమయంలో సెకన్లపాటు భూమి కంపించింది. ప్రకంపనల ధాటికి ఇళ్లల్లోని వస్తువులు సైతం కిందపడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్పల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకన్లపాటు భూమి కంపించిందని సమాచారం. బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిస్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెప్పారు.గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించిందని సమాచారం. బోరబండ, రహమత్ నగర్, కార్మిక నగర్, యూసుఫ్‌గూడాలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే సికింద్రాబాద్, బేగంపేట, హిమాయత్ నగర్, రాజేంద్రనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లోనూ సెకన్లపాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ స్వల్పంగా కంపించిందని సమాచారం. నల్గొండ పట్టణం, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం పాతర్లపాడు, నూతనకల్, హుజూర్ నగర్ ప్రాంతాల్లో సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.
అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని సమాచారం. ఉదయం 7:28 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. దీని దెబ్బకు కుర్చీలో కూర్చున వారు సైతం కిందపడిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా ఇళ్లు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగురు తీశారు. కరీంనగర్ విద్యానగర్‌లోనూ భూమి కంపించిందని సమాచారం. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి.
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం బాదల్ పై కాల్పులు..
పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం జరిగింది. ఆలయ కాపలాదారుడిగా సేవ చేస్తున్న బాదల్ సమీపంలోకి నడుచుకుంటూ వచ్చిన ఓ వృద్ధుడు సడెన్ గా తుపాకీ తీసి కాల్పులకు ప్రయత్నించాడు. వృద్ధుడి అనుమానాస్పద కదలికలతో అప్రమత్తమైన బాదల్ అనుచరుడు ఎదురు వెళ్లి అడ్డుకున్నాడు. ఇంతలో తుపాకీ పేలింది. అయితే, బుల్లెట్ ఎవరికీ తాకలేదు. వృద్ధుడి నుంచి తుపాకీని బలవంతంగా స్వాధీనం చేసుకున్న బాదల్ అనుచరులు.. ఆ వృద్ధుడిని పోలీసులకు అప్పగించారు. బాదల్ కు అత్యంత సమీపానికి వచ్చి కాల్పులు జరపగా.. బాదల్ కు కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్ బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పులు చేశారంటూ అకాల్ తక్త్ నిర్ధారించింది. పార్టీ చీఫ్ గా బాదల్ ను తప్పించడంతో పాటు స్వర్ణదేవాలయంలో సేవాదార్ (కాపలాదారు) గా, సేవకుడిగా పనిచేయాలని శిక్ష విధించింది. ఈ ఆదేశాలతో మంగళవారం సుఖ్ బీర్ సింగ్ శిక్ష అనుభవించారు. కాలు ప్రాక్చర్ అయినప్పటికీ చక్రాల కుర్చీలోనే ఉదయం ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని కిచెన్ లో పాత్రలు శుభ్రం చేశారు. టాయిలెట్లు కడిగారు. చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్లు రాసిన పలకను మెడలో వేసుకుని ఆలయ ద్వారం వద్ద కాపలాదారు విధులు నిర్వహించారు. ద్వారం వద్ద బాదల్ చక్రాల కుర్చీలో కూర్చుని చేతిలో బల్లెం పట్టుకుని ఉండగా ఓ వృద్ధుడు ఆయన సమీపంలోకి వచ్చాడు. తన దుస్తుల్లో దాచిన తుపాకీని తీస్తుండగా బాదల్ అనుచరుడు గమనించి ఎదురువెళ్లాడు. వృద్ధుడి చేతులను గట్టిగా పట్టుకుని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇంతలో తుపాకీ పేలింది. అయితే, బుల్లెట్ మాత్రం ఎవరికీ తాకలేదు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న మిగతా అనుచరులు వచ్చి తుపాకీ లాక్కుని వృద్ధుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడిని నారైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేశాయి.
రైతుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించిన ఉపరాష్ట్రపతి
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆందోళనతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యసభలో మంగళవారం ఈమేరకు కేంద్ర వ్యవసాయ మంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ాదేశం మారుతుండడం తొలిసారి చూస్తున్నా.. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కలలు కనడం కాకుండా దానిని లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా.. దేశం ఉన్నత శిఖరాలవైపు పయనిస్తోంది. అయితే, రైతులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైకెక్కి తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. దేశంలో రైతు మాత్రమే అసహాయుడిగా మిగిలిపోతున్నాడు. అసలేం జరుగుతోంది?్ణ అంటూ మంత్రిని ధన్ ఖడ్ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు ఏంటి.. వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నామని ధన్ ఖడ్ నిలదీశారు. రైతులు గతేడాది ఆందోళన చేశారు.. ఈ ఏడాది ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఉపరాష్ట్రపతి ప్రశ్నలకు చౌహాన్ మౌనాన్ని ఆశ్రయించారు. గత పదిహేనేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ హైకమాండ్ కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని వ్యవసాయ శాఖను అప్పగించిన విషయం తెలిసిందే.
అదానీ ముడుపులపై జేపీసీ విచారణ
. ఇండియా ఐక్య సంఘటన డిమాండ్
. పార్లమెంటు వెలుపల ఎంపీల ఆందోళన
న్యూదిల్లీ : అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై ఉభయసభల్లో చర్చించాలని, దీనిపై జేపీసీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో ఇండియా ఐక్యసంఘటన నేతలు, ఎంపీలు ఆందోళన చేపట్టారు. అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై సభ లోపల ఆందోళన చేస్తే వాయిదా వేస్తున్నందున సభ వెలుపల ఆందోళనకు దిగామని ‘ఇండియా’ నేతలు వెల్లడిరచారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణకు చేరుకున్న ఇండియా ఐక్యసంఘటన పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన తెలిపారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఆప్ నేత సంజయ్ సింగ్, ఆర్జేడీ నేత మీసా భారతి, శివసేన (యూబీటీ) నేత అరవింద్ సావంత్ సహా అనేకమంది ఎంపీలు పార్లమెంట్ ముందు ఆందోళన చేశారు. మోదీ, అదానీ ఇద్దరూ ఒక్కటే (‘మోదీ-అదానీ ఆర్ వన్!) అని రాసిన బ్యానర్ పట్టుకుని నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతపట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించాలంటూ నినదించారు. ఇక సమావేశాలు ప్రారంభమయ్యాక సభలోనూ వారు ఆందోళన కొనసాగించారు. అదానీ వ్యవహారంపై ఆరు రోజులుగా ఉభయసభలు దద్దరిల్లుతున్న సంగతి విదితమే. అదానీ వ్యవహారంపై నిగ్గుతేల్చాలని ప్రతిపక్షపార్టీ ఎంపీలు చర్చకు పట్టుబడుతున్నా… కేంద్ర ప్రభుత్వం మాత్రం మొగ్గుచూపడం లేదు. కాగా రాహుల్‌గాంధీ పార్లమెంటు వద్ద నిరసన తెలిపిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి… ‘అదానీ కోట్ల రూపాయల నుంచి ఎవరు ప్రయోజనం పొందుతారు? మోదీజీ’ అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వ పాలనకు అదానీ వ్యవహారం ఓ స్పష్టమైన సంకేతం. వారి విధానాలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఏది ఏమైనా అదానీ అభియోగాలపై ప్రభుత్వం స్పందించాలని ఈరోజు పార్లమెంటు సమావేశాలకు వెళ్లబోయే ముందే మేము నిరసన చేశాం’ అని అన్నారు.
ఇక ‘అదానీ కుంభకోణం, మణిపూర్, సంభల్ వంటి ఘటనలపై సభలో చర్చ జరగాలని పట్టుబట్టాం. దానికోసం 267 నోటీసులు ఇచ్చాం. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మా ప్రయత్నాలు మేం చేశాం. కానీ సభ జరగడం లేదు. అందుకే ప్రజానుకూల సమస్యలను లేవనెత్తడానికి మేము నిరసన చేశాం’ అని సీపీఐ ఎంపీ పి.సంతోష్‌కుమార్ మీడియాకు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రచ్చ కొనసాగుతూ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. అయితే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్‌సభలో, రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి. రాజ్యాంగంపై లోక్‌సభలో ఈ నెల 13, 14 తేదీల్లోనూ, రాజ్యసభలో ఈ నెల 16, 17 తేదీల్లోనూ చర్చించేందుకు అంగీకారం కుదిరింది. పార్లమెంటు కార్యకలాపాలు మంగళవారం నుంచి సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయి.
తిలా పాపంతలా పిడికెడు
బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వ ఊతం
అధికారులకు, ప్రజాప్రతినిధులకు నెలవారీ మామూళ్లు
పేదలకు సన్నబియ్యంతోనే మాఫియాకు కళ్లెం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం తీవ్ర చర్చనీయాంసంగా మారింది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా కాకినాడ పోర్టుకు వెళ్లి… భారీ ఎత్తున జరుగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేయడం, సీజ్డ్ ద షిప్ అంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ వ్యవహారం ఎక్కడకు దారి తీస్తుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఒకే పార్టీకి చెందిన వారు అంటూ ఉండరు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ప్రమేయం, మద్దతు లేకుండా కాకినాడ పోర్టు వరకూ వివిధ ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో పీడీఎస్ బియ్యం రావడం అసాధ్యం. చాలా ప్రాంతాల్లో అధికార, విపక్ష నేతలకు 60:40, 70:30 నిష్పత్తిలో వాటాలు ఇవ్వడం బహిరంగ రహస్యం. అలానే పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు నెలవారీ చెల్లింపులు జరుగుతున్నందున పీడీఎస్ బియ్యం (రేషన్) లారీలకు లారీలు కాకినాడ పోర్టు వరకూ తనిఖీలకు చిక్కకుండా వెళుతున్నాయి. ఈ వ్యాపారం ద్వారా దిగువ స్థాయిలో లక్షల్లో, ఎగువ స్థాయిలో కోట్లలో ఆదాయం వస్తుండటంతో జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులనూ సంతృప్తి పరుస్తున్నారు. కాకపోతే గత ప్రభుత్వంలో తెరముందు వైసీపీ నేతలు ఉంటే… ఇప్పుడు కూటమి నేతలు వచ్చారు. రాజకీయంగా పార్టీలు వేరైనప్పటికీ ఈ అక్రమ వ్యాపారంలో అయా పార్టీల నేతలు అందరూ సిండికేట్‌గానే ముందుకు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలంటే కొనుగోలు(కిందిస్థాయిలోనే) వద్ద కట్టడి చేయకుండా చివరి పాయింట్ (ఎగుమతి, కాకినాడ పోర్టు) వద్ద కట్టడి చేయాలని ప్రయత్నించడం అవివేకం…అసంబద్ధం అవుతుంది. రాష్ట్రంలో దాదాపు 80 శాతానికి పైగా ప్రజలు సన్న బియ్యం (సాంబ మసూరి) తినేందుకు అలవాటు పడ్డారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం (దొడ్డు బియ్యం) తినలేక కార్డుదారులే ఎక్కువమంది స్వచ్ఛందంగా ఎండీయూ ఆపరేటర్లకు లేదా ఆయా గ్రామాల్లో బియ్యం కొనుగోలుదారులకు అమ్ముతుంటారు. కేజీకి రూ.10 నుంచి రూ.12 వరకూ ఆయా ప్రాంతాలను బట్టి కార్డుదారులు బియ్యం బదులు డబ్బులు తీసుకుంటుంటారు. ఇక గ్రామం, మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ పాయింట్‌కు ఈ రేషన్ బియ్యం తరలివెళ్లి… అక్కడ నుండి కాకినాడ పోర్టుకు నేరుగా లారీల్లో వెళుతున్నాయి. ఈ మధ్యలో వ్యాపారం చేసే వారందరికీ క్వింటాకు రూ.200 నుంచి రూ.400 వరకూ గిట్టుబాటు అవుతుంటుంది. రేషన్ బియ్యాన్ని ప్రజలే (20 శాతం మినహా) తినకుండా అమ్ముకుంటారు అనేది కింది నుండి పైస్థాయి అధికారుల వరకూ, గ్రామస్థాయి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకూ తెలిసిన విషయమే. అందుకే గత ఎన్నికలకు ముందు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్‌మోహనరెడ్డి హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని ఆయన విస్మరించారు. నాడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొడాలి నాని తాము సన్నబియ్యం హామీ ఇవ్వలేదని, నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పి… రేషన్ బియ్యంలో నూక శాతం తగ్గించి ఒక పట్టు పట్టి (సన్నం చేసి) షార్టెక్స్ పేరుతో కార్డుదారులకు పంపిణీ చేస్తూ వచ్చారు. రేషన్ బియ్యం (దొడ్డు)ను ఒక పట్టు (మర ఆడిస్తే) పడితే అవి సన్నబియ్యంగా కనిపిస్తాయి. కానీ సాంబ మసూరి బియ్యం అయిపోవు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వమైనా కార్డుదారులు తినే బియ్యం రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తే అసలు స్టార్టింగ్ పాయింట్ వద్దే పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోళ్లు నిలిచిపోతాయి. కార్డుదారులు ఎవరూ పీడీఎస్ బియ్యాన్ని విక్రయించరు. దీంతో గ్రామ, మండలస్థాయి నుంచే పీడీపీస్ బియ్యం కొనుగోలు, అమ్మకాలు నిలిచిపోతాయి. తద్వారా కాకినాడ పోర్టుకు ఒక్క పీడీఎస్ బియ్యం లారీ కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. వాస్తవానికి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో తప్పిదం అందరిదీ ఉంది. తినే బియ్యం ఇవ్వకపోవడం పాలకుల తప్పయితే… ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చిన బియ్యాన్ని వ్యాపారికి విక్రయించడం కార్డుదారుల తప్పు. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని గ్రామ, మండల స్థాయిలో కొనుగోలు చేయడం, కాకినాడ పోర్టుకు తరలించడం, అక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేయడం వ్యాపారులు చేస్తున్న పొరపాటు. వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, నేతల తప్పు. అందుకే పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టుకు వెళ్లి అక్రమ బియ్యం స్మగ్లింగ్‌పై నానా యాగీ చేస్తున్నా ప్రజల నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు. ఈ అక్రమ వ్యాపారం పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఉంటే కేంద్రం ద్వారా సరఫరా అయి నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వమే కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి… కార్డుదారులకు తినే బియ్యం (సాంబమసూరి, సన్నబియ్యం) సరఫరా చేయాలన్నది ప్రజల అభిప్రాయంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై9, 10న రాష్ట్రవ్యాప్త నిరసనలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు
విశాలాంధ్ర`విజయవాడ:
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను వ్యతిరేకిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 9, 10 తేదీల్లో నిరసన దినం పాటిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ‘నిరసనలు’ చేపట్టవలసిందిగా సీపీఐ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అదానీ గ్రూపు కంపెనీల అవినీతి, తప్పిదాలు, ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని, అందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులపై పార్లమెంటులో చర్చ జరపాలని, సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం (పీఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరించాలని, అధిక ధరలు అరికట్టాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న దేశవ్యాప్తంగా ‘డిమాండ్స్ డే’ చేపట్టాలని సీపీఐ జాతీయ సమితి పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదయిందన్నారు. విద్యుత్ ఒప్పందాల కోసం అదానీ నాలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.2,100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయన్నారు. ఇందులో అత్యధికభాగం రూ.1,750 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే గత ప్రభుత్వ హయాంలో ముడుపులుగా ముట్టజెప్పినట్లు తెలుస్తోందన్నారు. ఫలితంగా 25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల మేర విద్యుత్ చార్జీల భారం పడుతుందని రామకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అదానీ అవినీతి కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని, గత ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలు రద్దుచేయాలని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అదానీని తక్షణమే అరెస్టు చేయాలని, ఈ అవినీతిపర్వంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేశారు.
బియ్యం అక్రమాలపై సీఐడీ దర్యాప్తు
. ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం కీలక పాలసీలు
. జలజీవన్ మిషన్ పున:ప్రారంభం
. 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం
. పర్యాటక అభివృద్ధికి టూరిజం సర్క్యూట్స్
. తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతిలో వర్కింగ్ సెంటర్లు
. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: కాకినాడ పోర్టు కేంద్రంగా పెద్దఎత్తున సాగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ అంశాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశంలో ప్రస్తావించారు. తన దృష్టికి వచ్చిన అక్రమాలను వెల్లడిరచారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ సీఐడీచే విచారణ జరిపించి బియ్యం మాఫియాను అరికడదామని హామీ ఇచ్చారు. ‘కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్‌ను బలవంతంగా లాక్కున్నారు. పోర్టు లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందోకు అప్పగించారు. ఆస్తులు గుంజుకోవడం రాష్ట్రంలో కొత్త ధోరణి అయింది. ఇంతకుముందు మనం ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా ధ్వంసం చేశారు. వీటన్నింటిపై సీఐడీ విచారణ జరిపిద్దామని మంత్రులతో చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై మంత్రులతో సీఎం చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్ధసారథి మీడియాకు వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికిగాను కొన్ని పాలసీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి నారాయణ, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. అ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ (4.0) 2024-2029కు ఆమోదం అ రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీకి గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, జీసీసీ పాలసీ 4.0 (2024-2029)కు ఆమోదం అ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు ప్రపంచ వ్యాపార రంగంలో కీలకంగా మారాయి. సాంకేతిక వ్యాపార పరిభాషలో వీటిని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అంటారు. కొన్ని కీలక విధుల నిర్వహణకు బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీలు) విదేశాల్లో ఏర్పాటు చేసే కేంద్రాలివి. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్, కో-వర్కింగ్ స్పేస్ వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడళ్లను ఏర్పాటు చేయడం ఈ పాలసీ లక్ష్యమని మంత్రి తెలిపారు. నూతన ఆవిష్కరణలు, గిగ్ ఎకానమీ, వ్యవస్థాపకత, స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున సాంకేతిక ఆధారిత విద్యార్థులను, ప్రతిభావంతులైన వర్కు ఫోర్స్‌ను, సహాయక ప్రభుత్వ విధానాలతో సహా ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందన్నారు. అ స్వర్ణాంధ్ర విజన్
2047లో భాగంగా రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన ‘ఒకే కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం ప్రణాళిక అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
. మౌలిక సదుపాయాలను సత్వరమే సృష్టించడానికి ప్రభుత్వం కో-వర్కింగ్ స్పేస్‌లు, పొరుగు వర్కు స్పేస్‌లను పెద్దఎత్తున ప్రోత్సహించాలని భావిస్తున్నది. ఇందుకు ప్రోత్సాహకాలను పెద్దఎత్తున అందజేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
. కో-వర్కింగ్ స్పేస్ అంటే ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసి… అక్కడే ఐటీ కంపెనీ, షాపింగ్ కాంప్లెక్సు, ఎంటర్‌టైన్‌మెంట్ ఏర్పాటు చేయడం
అ తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి తదితర పెద్ద కేంద్రాల్లో పొరుగు వర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటు, వీటికి అనుబంధంగా గ్రామాల్లో, మండలాల్లో కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటు
అ కనీసం 100 సీట్ల నుండి 10 వేల చదరపు అడుగులతో కో-వర్కింగ్ స్పేస్ సెంటర్లు అభివృద్ది పర్చే వారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ
అ వంద మందికి వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే రూ.2.00 ఆరు మాసాలకు ప్రోత్సాహకంగా ఇవ్వడం
అ ప్రతి సీటుకు రూ.1,000 చొప్పున ఆరు మాసాల్లో ప్రోత్సాహకం అందజేత
అ 5 లక్షల చదరపు అడుగుల ఫ్లోర్ ఏరియా పైబడిన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ
అ ‘‘ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్, అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0, 2024-29 ఆమోదం. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యం
అ 2024 2029 కాలంలో రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యం
అ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) 5 కొత్త సమగ్ర టెక్స్‌టైల్ పార్కుల అభివృద్ధి
అ ఈ పార్కులను మూడు కేటగిరీలుగా విభజించి ఎంఎస్‌ఎంఈలకు 30 శాతం, మధ్య తరహా పార్కులకు 20 శాతం పెట్టుబడి రాయితీ
అ ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ 4.0 (2024-29)కు ఆమోదం, 975 కిలో మీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచస్థాయి సముద్ర తీర రాష్ట్రంగా అభివృద్ది పర్చాలనే లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించామని, ఈ విషయంలో గుజరాత్ ప్రథమ, ద్వితీయ స్థానంలో ఏపీ ఉందని మంత్రి తెలిపారు.
అ రాష్ట్రంలో ఒక మెగా షిప్‌యార్డు ఏర్పాటుకు కృషి
అ గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖకు చెందిన 24 మాసాల కాంట్రాక్టు పీరియడ్ గల కొన్ని తాగునీటి సరఫరా ప్రాజెక్టుల ధరల సర్దుబాటు
అ జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు శ్రీకాకు ళం జిల్లా ఉద్దానం, వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం, కర్నూలు జిల్లా డోన్
అ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాలకు ప్రస్తుత యూనిట్ విలువ, పద్ధతితో కొనసాగించడానికి, పెండిరగ్‌లో ఉన్న గృహాలు పూర్తి చేయాలని నిర్ణయం
అ అర్బన్‌లో 6.41 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1.09 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని నిర్ణయం
అ ఆంధ్రప్రదేశ్ క్రీడల పాలసీ 2024-29 సవరణల ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం
అ పర్యాటక రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడల పాలసీ 2024-29కి ఆమోదం
అ ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-2029 సమగ్ర వెర్షన్ ఆమోదం
అ ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 (2024-29)కి ఆమోదం
అ రాజధాని అమరావతిని ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం
అ రియల్‌టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు కోసం, ఆర్‌ఈఎఫ్‌ఎస్ ఫ్లోటింగ్‌కు అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం
అ ప్రతి సంవత్సరం డిసెంబర్ 15న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ‘ఆత్మర్పణ దినోత్సవం’గా పాటించాలని నిర్ణయం
అ జల్ జీవన్ మిషన్ పున:ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా, రాజధాని నిర్మాణ పనులపై సీఆర్‌డీఏ సమావేశం సోమవారం తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
పోర్టు రాజకీయం!
కాకినాడకే పరిమితమా?
స్టెల్లా షిప్ సీజ్… కెన్‌స్టార్ షిప్ సంగతేంటి?
అదానీ గంగవరం పోర్టు జోలికెళ్లరేం ?
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బియ్యం అక్రమ రవాణా దందా ఆరోపణలకు సంబంధించి కాకినాడ పోర్టులోనే కాకుండా ఇతర పోర్టులనూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలు చేయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా అదానీకి చెందిన గంగవరం పోర్టు ద్వారా కూడా అక్రమ బియ్యం రవాణా కొనసాగుతుందన్న విమర్శలున్నాయి. గంగవరం పోర్టుకు వెళ్లకుండా… కాకినాడ పోర్టునే పట్టుకుని పవన్ హడావుడీ చేయడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్రంలో పరిపాలన నిష్పక్షపాతంగా జరగడం లేదనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నాయి. కాకినాడ పోర్టు పరిశీలనకు వెళ్లిన పవన్… అక్కడి షిప్‌ను సీజ్ చేయాలంటూ అధికారులను ఆదేశించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏపీలోని కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టుల ద్వారాను, గుజరాత్‌లోని కాండ్ల పోర్టు ద్వారా విదేశాలకు పెద్దఎత్తున బియ్యం సరఫరా అవుతోంది. దీనికి ప్రభుత్వ నిఘా వ్యవస్థ లేకపోవడం, ఉన్నతాధికారుల లోపమే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. పోర్టుల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా అలాంటి పరిస్థితులు లేవు. కాకినాడ పోర్టు కేంద్రంగా 1995 నుంచి బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ పోర్టును నమ్ముకొని 30 వేల మంది కార్మికులు బతుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పీడీఎస్ బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలి వెళ్లాయని, వీటి వెనుక ఓ మాజీ ప్రజాప్రతినిధి హస్తముందన్న ఆరోపణలతో పవన్ తనిఖీలకు ప్రాధాన్యత ఏర్పడిరది. అవి నిజమైతే…ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించి, బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టుపై విషప్రచారం వల్ల ఎగుమతులు గుజరాత్‌లోని కాండ్ల పోర్టుకు తరలిపోతున్నాయన్న వాదనలున్నాయి. ఇప్పటికే విశాఖ, గంగవరం పోర్టుకు బియ్యం లారీలు వెళ్లిపోయాయని, కాకినాడ పోర్టు కార్మికులకు పనులు లేకుండా పోతున్నాయని సమాచారం. కాకినాడ పోర్టే కాదు… గంగవరం పోర్టు కేంద్రంగాను అక్రమ రావాణా బియ్యం దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లలేకపోతున్నారని, అది అదానీది కావడమే కారణమా అంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. అన్ని పోర్టుల్లోనూ ఇదే తరహా తనిఖీలు నిర్వహించి… అక్రమ దందాకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను తనిఖీ చేసిన పవన్… ఆ పక్కనే ఉన్న కెన్‌స్టార్ షిప్ దగ్గరకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘కెన్‌స్టార్’ షిప్‌లో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని, అది ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడదంటూ విమర్శలు వచ్చాయి. తన శాఖ కాకపోయినా ప్రాణాలకు తెగించి ప్రజల ఆస్తిని కాపాడటానికి, షిప్‌ను తనిఖీ చేయడం కోసం సముద్రంలోకి వెళ్లిన పవన్‌ను స్వాగతిస్తూనే… ‘కెన్‌స్టార్’ షిప్ వద్దకు ఎందుకు వెళ్లలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ‘స్టెల్లా’లో 36 మంది ట్రాన్స్‌పోర్టర్లు, 35 వేల టన్నుల బియ్యం ఎగుమతి చేయడానికి తెచ్చుకున్నారని తెలిసింది. పక్కనే లంగరేసి ఉన్న ‘కెన్‌స్టార్’లో ఒకే ఎక్స్‌పోర్టర్ 42 వేల టన్నుల బియ్యం నైజీరియాకు ఎగుమతి చేస్తున్నప్పటికీ దాని జోలికి వెళ్లడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇతర పోర్టులపైనా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరముంది.
ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం
సబ్సిడీ మీద పేదలకు అందిస్తున్న రేషను బియ్యం అనేక సంవత్సరాలుగా కాకినాడ పోర్టు నుంచి లక్షల టన్నుల్లో అక్రమ రవాణా అవుతున్నప్పటికీ… ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడే హడావుడీ చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం దారి తప్పి వివిధ పద్ధతుల్లో పోర్టులకు తరలిపోతున్నాయి. ఇవి రేషన్ షాపుల నుంచే నేరుగా వెళ్తున్నాయా? లేక పౌరసరఫరాల శాఖ ద్వారా వెళుతున్నాయా అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఈ అక్రమ రవాణాను శాశ్వతంగా అరికట్టటానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరిచి పూర్తిగా నిఘా పెడితే ఈ అక్రమాలు ఉండవని విపక్షాలు సూచిస్తున్నాయి. బియ్యం విక్రయదారులు, కొనుగోలుదారులు, మధ్యలో ఉన్న బ్రోకర్లు ఎవరనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. రాజకీయ అవసరాల కోసం చారిత్రాత్మక కాకినాడ పోర్టుపై విష ప్రచారం సరికాదని హితవు పలుకుతున్నాయి.
అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ ఐక్యూ13 విడుదల
ముంబయి : అధిక-పనితీరు గల స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ తాజాగా భారతదేశపఅత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 13ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో అమర్చబడిన మొదటి స్మార్ట్‌ఫోన్లలో ఒకటి. ఐక్యూ 13 ధర 12జీబీG256జీబీ వేరియంట్‌కు రూ.54,999 (సమర్థవంతమైనధర: రూ.51,999), 16జీబీG512జీబీ వేరియంట్‌కు రూ.59,999 (సమర్థవంతమైనధర: రూ.56,999). ఇది రెండు సొగసైన రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి: లెజెండ్ మరియు నార్డో గ్రే. అదనంగా, ఐక్యూ 13 ప్రీ-బుకింగ్ డిసెంబర్ 05, మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటుంది. దాని మొదటి విక్రయం డిసెంబర్ 11, 2024 నుండి మధ్యాహ్నం 12 గంటలకు వివో ప్రత్యేకస్టోర్లు, ఐక్యూ ఇ-స్టోర్, అమెజాన్.ఇన్‌లలో ప్రారంభమవుతుంది. ఐక్యూ 13 వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఇతర మెయిన్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ విస్తరణ ఐక్యూ పరికరాలను అనుభవించే, కొనుగోలు చేసే సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది.