విశాలాంధ్ర- అనంతపురం : జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఈ వేడుకలకు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఏ.ఆర్ అదనపు ఎస్పీ ప్రసంగించారు. ఏసు క్రీస్తు ప్రేమకు ప్రతిరూపమన్నారు. ఆయన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడన్నారు. ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా చేసుకోవాలని సూచించారు. ఇతరుల పట్ల ప్రేమతో స్నేహభావంగా ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సేవాభావం, ప్రేమ, మానవత్వం కలిగి ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి, చర్చి ఫాదర్ వినోద్ కుమార్ , ఆర్ ఐ లు రాముడు, బాబు, పోలీసు అధికారుల సంఘం ర కార్యకర్గసభ్యులు జాఫర్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు గాండ్ల హరినాథ్, తేజ్ పాల్ , శ్రీనివాసులునాయుడు, నాగరాజు, మసూద్ వలీ, తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి…
ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యంగా ఉండేందుకు తన వంతు కృషిని సల్పడమే నా లక్ష్యము అని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పోతుకుంట రోడ్డు లోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను వారు ప్రారంభించారు. అనంతరం డయాలసిస్కు సంబంధించినటువంటి గదులను, పరికరాలను వారు అక్కడి వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. తొలుత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పురస్కరించుకొని, వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డయాలసిస్ గదులను మంత్రితో పాటు బిజెపి జిల్లా అధ్యక్షుడు శేఖర్, టిడిపి నాయకులు కమతం కాటమయ్య పరిసే సుధాకర్లతో కూడా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో డయాలసిస్ సెంటర్లను 50 కి పైగా ఉన్నాయని, ప్రజలందరికీ అనారోగ్య సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలోని ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల వద్ద గల అనారోగ్య విషయాలను తెలుసుకొని, సంబంధిత వైద్యులకు తెలిపి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న వారందరికీ కూడా పేరుపేరునా వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని ఆప్యాయతతో పలికి, వైద్య సేవలు అందించాలన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఫిర్యాదులు అందరాదని వారు సూచించారు. గతంలో డయాలసిస్ రోగులు చాలా దూరం వెళ్లే వారిని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా, ధర్మారంలోనే డయాలసిస్ ఉండే విధంగా చేయడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు వారు తెలియజేశారు. వైద్యులందరూ సేవాభావంతో కూడిన విధులను నిర్వర్తించినప్పుడే ప్రజల వద్ద మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ స్టేట్ మోడల్ ఆఫీసర్ నిర్మల గ్లోరీ, సత్య సాయి జిల్లా డీఎంహెచ్వో పైరోజు బేగం, డిసిఐహెచ్ఎస్ తిపేంద్ర నాయక్, అనంతపురం డి సి హెచ్ ఎస్ పాల్ రవి కుమార్, ఆరోగ్య ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి,స్థానిక ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి, డాక్టర్ వివేక్, ఏవో ఉదయ్ కుమార్, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గేయానంద్, స్థానిక బిజెపి నాయకులు డోరా రాజారెడ్డి, జింకా చంద్రశేఖర్, షాకే ఓబులేష్, శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు
ధర్మవరంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై అవగాహన..
మంత్రి సత్తి కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా గృహ వినియోగదారులు అతి తక్కువ విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తుంది అని, ఇంటి పై కప్పుపై కనీసం 10 చ.మీ/100 చ.అ స్థలంలో 1 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడం ద్వారా తమ విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోవచ్చు అని అన్నారు.ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసి, ప్రజలకు లబ్ది కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది” అన్నారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సౌరశక్తి వినియోగం పెరిగి, విద్యుత్ బిల్లు తగ్గించే అవకాశాలు ఉంటాయన్నారు. సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థల ద్వారా అందరూ పర్యావరణ అనుకూలమైన శక్తిని ఉపయోగించి, విద్యుత్ వృథాను తగ్గించవచ్చు అని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రజల ప్రయోజనాలు పెరుగుతాయని, ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్, టిడిపి నాయకులు చిగిచెర్ల ఓబిరెడ్డి, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల కొనుగోలుకు తప్పనిసరిగా రైతులకు రసీదు ఇవ్వాలి..
వ్యవసాయ సంచాలకుల అధికారి కృష్ణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ప్రతి ఎరువులు అమ్మకాలు చేసే దుకాణదారులు రైతులకు కొనుగోలు చేసుకున్న ఎరువుల కు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య, వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని పలు ఎరువుల దుకాణములను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సాయిరాం సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో విత్తనాల స్టాక్ వివరాలు సోర్స్ సర్టిఫికెట్లను పరిశీలించారు. దుకాణంలో నిల్వ ఉంచిన వరి విత్తనాల నుండి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపడం జరిగిందని వారు తెలిపారు. విత్తన డీలర్లు తప్పనిసరిగా సర్టిఫికెట్ కలిగిన అధికృత విత్తన సరఫరాదారుల నుండి కొనుగోలు చేయవలసినదిగా వారు ఆదేశించారు. రైతుల నుండి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. గత కొన్ని నెలల కిందట నాసిరకపు ఎరువులు అమ్ముతున్నారన్న విషయంపై వారు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక నిరంతరంగా రైతులకు మేలు కలిగే విధంగా ఎరువుల దుకాణాలు పై ఆకస్మిక తనిఖీలు తప్పవని తెలిపారు.
విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
ధర్మవరం : మండల పరిధిలోని కునుతూరు గ్రామంలో 11 కె.వి 3 ఫేష్ సబ్ స్టేషన్ ను ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సబ్ స్టేషన్ ప్రారంభంతో కునుతురు తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఒరవడిని అందించే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ సదుపాయం ప్రజలకు మరింత వసతులు మంచి సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, రూరల్ మండల కన్వీనర్ మహేష్ చౌదరి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయండి..
మంత్రిని కోరిన న్యాయవాదులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో న్యాయవాదులుగా విధులు నిర్వర్తిస్తున్న మాకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరుతూ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు పలువురు లాయర్లు వినతి పత్రాన్ని స్థానిక ఆర్డిఓ కార్యక్రమములో భాగంగా విచ్చేసిన మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పలు సమస్యలను మంత్రి దృష్టికి న్యాయవాదులు తీసుకొని వెళ్లారు. తదుపరి మంత్రిని ఘనంగా శాలువాతో సన్మానించారు. తదుపరి మంత్రి మాట్లాడుతూ ఇల్లు లేని న్యాయవాదుల అందరికీ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ తప్పక నిర్వహిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంశాల అశోక్ కుమార్, కంశాల కిషోర్ కుమార్, ఢిల్లీ రవీంద్ర, కృష్ణమోహన్, అతావుల్లా తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
బోరు కు మోటర్ ఏర్పాటు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి సచివాలయం దగ్గర నీటి వసతి లేకపోవడంతో ఇటీవల ప్రభుత్వం వారు బోర్ వేశారు కాని మోటర్ వేయకపోవడంతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చూచనల మేరకు గ్రామస్తులు మంగళవారం కొత్త మోటర్ బిగించారు. ఈ సందర్బంగా సచివాలయం దగ్గరకు వివిధ కారణాలతో వచ్చే ప్రజలకు, మరియు సిబ్బంది కి నీటి ఇబ్బందులు తొలగిపోయాయి. ఈ సందర్బంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరి రాజ,యల్లంపల్లి భరత్ కుమార్, పాలేటి రవి పాలేటి కొండయ్య మంచాల పెద్ద కొండయ్య మంచాల మాలకొండ రాయుడు మంచాల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు
కేజీబీవీ విద్యార్థినులకు యూటీఎఫ్ మోడల్ పేపర్స్ వితరణ
యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయచంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన పదవ తరగతి మోడల్ పేపర్లను త్యాగరాజు దంపతులు తమ దివంగత కూతురు భారతి జ్ఞాపకార్థం ధర్మవరంలోని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి చదువుతున్న 40 మంది బాలికలకు మోడల్ పేపర్స్, ఎగ్జామ్స్ అట్టలు, పెన్నులు ను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు యు టి ఎస్ మోడల్ పేపర్స్ ను బాగా చదివి మంచి మార్కుల తో ఉత్తీర్ణత సాధించి , మీ తల్లి తండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు వా. యుటిఎఫ్ సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది మోడల్ పేపర్ల ప్రచురణ నిర్వహిస్తున్నదని, మోడల్ పేపర్ల రూపకల్పనలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రూపొందించబడి, అతి తక్కువ ధరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు ఉండే విధంగా, 100 రోజుల ప్రణాళికకు అనుకూలంగా తయారుచేసి అందించడం జరుగుతున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఎస్ ఓ. చంద్ర కళ, యోగ గురువు నారాయణ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్తు చార్జీల పెంపుపై వై.ఎస్.ఆర్.సి.పి.పోరుబాట…
విశాలాంధ్ర – చోడవరం ( అనకాపల్లి జిల్లా) : డిసెంబర్ 25, విద్యుత్ చార్జీల పెంపు పై వై.ఎస్.ఆర్.సి.పి పోరుబాట, కూటమి సర్కార్ పై నిరసన స్వరం పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ బుధవారం వైసీపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ మాజీ సి.ఎం., వై.ఎస్.ఆర్.సి.పి అధ్యక్షులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు డిసెంబర్ 27 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్దకు ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టి మరియు కరెంట్ చార్జీలు తగ్గించ వలసింది గా ఎలక్ట్రికల్ అధికారులకు కలిసి వినతిపత్రం అందజెయవలసిందిగా కోరారు. వైసిపి ఎం.పీ.పీ.లు, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ లకు, ఎంపీటీసీలకు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కలిసి కట్టుగా వెళ్లి విద్యుత్ పెంపుదలపై పోరుబాటను జయప్రదం చేయాల్సిందిగా కోరారు.
గోవాడ సుగర్స్ లో క్రషింగ్ శుభారంభం .…
– లక్ష టన్నులు గానుగాట లక్ష్యం ….
విశాలాంధ్ర – చోడవరం ( అనకాపల్లి జిల్లా) : డిసెంబర్ 25, ది. చోడవరం సహకార చక్కర కర్మాగారం (గోవాడ) లో 2024-25 క్రషింగ్ సీజన్ కు గాను బుధవారం ఉదయం గం. 9.30ని.లకు చెరకు గానుగాటను ఎం.డి. వి. ఎస్.నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.డి. వి.ఎస్.నాయుడు మాట్లాడుతూ గత సంవత్సరం 14,447 రైతుల దగ్గర అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని, ఈ యేడాది 13,000 మంది సబ్య రైతులు దగ్గర చెరకు చెరుకు సరఫరా అగ్రిమెంట్ తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ యేడాది చెరకు మద్దతు ధర టన్ను కు రూ.3,151లు గా నిర్ణయించామన్నారు. గత ఏడాది చెరుకు సరఫరా చేసిన సభ్య రైతులకు 6 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఫ్యాక్టరీకి రావాల్సిన ఆదాయం సుమారు రూ. 9 కోట్ల వరకు ఉందని అన్నారు. అలాగే తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల ఫ్యాక్టరీ ప్రాంతాల నుంచి చెరుకు వస్తుందని తెలియజేశారు. ఈ సంవత్సరం వరి పంట రైతులకు తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలతో పలు ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం చెరకు వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ ఏడాది చెరకు క్రషింగ్ లక్ష్యం లక్ష టన్నులు కాగా, ప్రతి ఏడాది 50,000 టన్నులు చొప్పున క్రషింగ్ సామర్ధ్యాన్ని పెంచుకుంటూ వెళతామని తెలియజేశారు. కార్మికులకు, కర్షకులకు బకాయిలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది క్రషింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు కార్మికులు, కర్షకులు సహకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిడిఓ కె. రామం, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఫీల్డ్ ఇన్స్పెక్టర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు