Saturday, January 11, 2025
Home Blog Page 69

పెచ్చరిల్లిన మతహింస

0

ఇది బీజేపీ దుష్టపాలన ఫలితం

. ప్రతిఘటనకు అభ్యుదయశక్తుల ఐక్యత అనివార్యం
. 10న నిరసనలు, డిమాండ్స్‌ డే
. జాతీయ సమితి తీర్మానాలు వెల్లడిరచిన డి.రాజా

న్యూదిల్లీ : బీజేపీ దుష్టపరిపాలన ఫలితమే దేశంలో మతహింస పెచ్చరిల్లడానికి కారణమని భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) నిశితంగా విమర్శించింది. దేశంలో, ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న మత ఉద్రిక్తతలను ప్రతిఘటించేందుకు ప్రగతిశీల, అభ్యుదయశక్తులు అనివార్యంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నవంబరు 28, 29, 30 తేదీలలో న్యూదిల్లీ సీపీిఐ కేంద్ర కార్యాలయం అజయ్‌భవన్‌లో పార్టీ జాతీయసమితి సమావేశాలు జరిగాయి. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ప్రకాశ్‌ బాబు అధ్యక్షతన మూడురోజులు జరిగిన సమావేశంలో చేసిన తీర్మానాలను పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సోమవారం పత్రికాగోష్టిలో విడుదల చేశారు. దేశ రాజకీయ, ఆర్థిక పరిణామాలతోపాటు వచ్చే ఏడాది జరిగే సీపీఐ జాతీయ మహాసభలకు సంబంధించిన మార్గదర్శకాలపై డి.రాజా సమావేశాల్లో నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ఈ నివేదికపై వివరణాత్మక చర్చ జరిగింది. ఉత్తరప్రదేశ్‌ సంభల్‌లో తలెత్తిన మతహింస గురించి ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దిల్లీలో నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం
దిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నిర్మాణ కార్యకలాపాలపై ఆ నగరంలో నిషేధం విధించారు. ఈ కారణంగా నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారు ఉద్యోగాలు, వేతన నష్టాలకు గురవుతున్నారు. అందువల్ల నిర్మాణ కార్మికులకు తగిన ఆర్థిక సహాయం చేయాలని పార్టీ జాతీయ సమితి డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసింది. మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాల్లో ఎలాంటి మార్పూలేదు. ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 60,000 మందికిపైగా ప్రజలు శరణార్థ శిబిరాల్లో తలదాచుకున్నారు. మణిపూర్‌లో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తున్నది. అందువల్ల మణిపూర్‌ ప్రభుత్వం రాజీనామా చేయాలని సమావేశం తీర్మానించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) పథకం అమలులో ఎన్నో లొసుగులు, లోపాలు ఉన్నాయి. ఈ పథకం కింద ఉన్న అర్హులైనవారిజాబితా నుండి లక్షలాదిమంది కార్మికుల పేర్లు తొలగించారు. ఆధార్‌కార్టుల్లో తలెత్తిన సమస్యల వల్ల వేలాదిమంది కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు. ఈ లొసుగులన్నింటినీ సరిద్దాలి. ఈ పథకం కింద కార్మికులకు రోజుకు ఒక్కొక్కరికీ రూ.700 వంతున ఏడాదికి కనీసం 200 రోజులు పని ఇవ్వాలని సమావేశం తీర్మానం చేసింది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై మతహింస
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల చెలరేగుతున్న హింసాత్మక ఘటనల పట్ల సీపీఐ జాతీయ సమితి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేషం రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వే ఈ విధమైన చర్యలు కేవలం లౌకిక సూత్రాలతోపాటు సమానత్వం, న్యాయాలను ఉల్లంఘించడం మాత్రమేకాదు… బంగ్లాదేశ్‌ భిన్నమత సమాజ సహజీవన స్థిరత్వానికీ, మతసామరస్యతకూ పెద్ద బెడదగా మారుతుంది. అందువల్ల బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఆసరాగా చేసుకుని మనదేశంలో నిరసనల ముసుగులో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు మతోన్మాదశక్తులు లేదా అధికారపార్టీ చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా అన్ని ప్రగతిశీల, అభ్యుదయ, లౌకికవాద శక్తులు వ్యతిరేకించాలని సమావేశం మరో తీర్మానంలో పిలుపు ఇచ్చింది. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఏవిధమైన మతఘర్షణలు జరగకుండా చూడాలని, అప్రమత్తంగా వ్యవహరించి వాటిని నివారించాలని సమావేశం కోరింది. అదేవిధంగా, దేశంలో ప్రాజెక్టుల నిర్మాణాల కారణంగా నష్టపోయే ప్రజలకు పునరావాసం కల్పించాలని, ఉత్తరాఖండ్‌లో క్రూర జంతువుల బారినపడి తీవ్రంగా నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని సమావేశం తీర్మానాలు చేసింది.
సీపీఐ శతాబ్ది సంవత్సర వేడుకలు
భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) శతాబ్ది సంవత్సర వేడుకల లోగోను డి.రాజా జాతీయ సమితి సమావేశాలలో ఆవిష్కరించారు. వంద సంవత్సరాల క్రితం పార్టీ వ్యవస్థాపక మహాసభలు జరిగిన ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో తిరిగి అదేరోజున అంటే ఈనెల 26వ తేదీన సమావేశం నిర్వహించాలని జాతీయ సమితి నిర్ణయించింది.
కాన్పూర్‌ సమావేశం ద్వారా పార్టీ శతాబ్ది సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 2025 డిసెంబరు 26వ తేదీన సీపీఐ శతాబ్ది సంవత్సర వేడుకల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ, బహిరంగసభ నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.

బియ్యం మాఫియాకుబిగుస్తున్న ఉచ్చు

0

. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీలో సుదీర్ఘ చర్చ
. సిట్‌ ఏర్పాటుతో సమగ్ర విచారణకు నిర్ణయం
. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, వివిధ అంశాల పైనా చర్చ

విశాలాంధ్ర బ్యూరో -అమరావతి : కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాను ప్రభుత్వం తీవ్రమైన అంశంగా పరిగణిస్తోంది. దీనిపై సిట్‌ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉండవల్లి నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య రెండు గంటల పాటు కొనసాగిన భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చినప్పటికీ, ముఖ్యంగా కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి ప్రజా పంపిణీ బియ్యం స్మగ్లింగ్‌ అవుతున్న నౌకను పవన్‌ కల్యాణ్‌ స్వయంగా సీజ్‌ చేయించిన విషయం తెలిసిందే. దీనిపై తన దృష్టికి తీసుకొచ్చిన విషయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చిన పవన్‌ కల్యాణ్‌ సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో గత ఐదేళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ముప్పు వాటిల్లేలా ఈ స్మగ్లింగ్‌ సాగిందని ఆయనకు పవన్‌ వివరించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేసి రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని తెలిపారు. గత మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచే రూ.48,537 కోట్ల విలువ చేసే బియ్యం ఎగుమతి కావడం మాఫియా విపరీత ధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు. రేషన్‌ మాఫియాకు కళ్లెం వేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని, తన పర్యటన సమయం లోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి రూ.కోట్లు కూడబెడు తున్నారని, రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులోనే గత ప్రభుత్వ హయాంలో బియ్యం ఎగుమతులు పెద్దఎ త్తున జరిగాయని, వీటన్నింటిపై సమగ్ర విచారణ ద్వారా వాస్తవాలు బయటకు తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మంగళవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారికంగా ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా రాజకీయ పరిణామాలతో పాటు దిల్లీ పరిణామాల పైనా, నామినేటెడ్‌ పదవుల నాలుగో జాబితా విడుదల పైనా ఇద్దరు నేతలూ చర్చించినట్లు సమాచారం. అలాగే ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, రాజధాని అమరావతిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపైనా చర్చించారు. డిసెంబరు 15వ తేదీ నుంచి అమరావతి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు.
ఇక నామినేటెడ్‌ పోస్టుల విషయంలో త్వరలో నాలుగో జాబితా విడుదలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా కొందరి పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మూడు జాబితాల విషయంలో ఎటువంటి వివాదాలకు తావు లేకపోవడంతో నాలుగు జాబితా సైతం కష్టపడి పని చేసిన వారికి పదవులు కేటాయించాలని నేతలిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

విద్యుత్‌ ఒప్పందాల రద్దు కోసంఅసెంబ్లీని సమావేశపర్చండి

0

. సెకీతో ఒప్పందంతో ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల భారం
. విలువైన భూములు అదానీకి దోచిపెట్టిన జగన్‌
. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ప్రజల పక్షాన నిలుస్తారా?… తేల్చుకోవాలి
. రైతులు, వలంటీర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఆదానీతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలని, దాని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చి… సభలో తీర్మానించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, పి.హరనాథరెడ్డితో కలిసి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ ఒప్పందాల రద్దుపై తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్‌ మన్నెం నాగేశ్వరరావు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని రామకృష్ణ వెల్లడిరచారు. విద్యుత్‌ ఒప్పందాలతోపాటు వివిధ అంశాలపై అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పాలనను చక్కదిద్దుతామని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆ లేఖలో మన్నెం నాగేశ్వరరావు ప్రశ్నించారని పేర్కొన్నారు. ఈ లేఖపైన ప్రభుత్వం స్పందించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదానీతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలు, ఇతర అంశాలను ఏ మాత్రం టచ్‌ చేయకుండా కేవలం మాజీ సీఎం జగన్‌పై రూ.1750 కోట్ల అవినీతి ఆరోపణలపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. విద్యుత్‌ ఒప్పందాల్లో అవినీతి జరిగిందన్న దానిపై ఎవరున్నప్పటికీ..తప్పకుండా విచారణ జరిపించాల్సిందేనని చెప్పారు. రాబోయే 25 ఏళ్లలో రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలపైన రూ.లక్షా 10 వేల కోట్ల భారం పడబోతుంటే… దానిని టచ్‌ చేయవద్దని ఎవరైనా చెప్పారా? అని యనమలను సూటిగా ప్రశ్నించారు. అంటే ఈ భారాన్ని ప్రజలు భరించేందుకు సిద్ధంగా ఉన్నారని, మీరు భావిస్తున్నారా? అని నిలదీశారు.గత జగన్‌ ప్రభుత్వ హయాంలో సెకీ ద్వారా జరిగిన విద్యుత్‌ ఒప్పందాల్లో ప్రజలపై భారం పడిరదని, పైపెచ్చు విద్యుదుత్పత్తి అంతా రాజస్థాన్‌లోనే కొనసాగడం వల్ల.. ఆ రాష్ట్రానికే అన్ని విధాలా లాభం జరుగుతోందన్నారు. దాదాపు 14వేల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చాయని, భూములిచ్చిన వారికి 30 ఏళ్లపాటు ప్రయోజనాలు కల్పిస్తున్నారని, రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8వేల కోట్లు పన్నుల రూపంలో ఆదాయం వస్తోందని చెప్పారు. అటు రాజస్థాన్‌కు అన్ని ప్రయోజనాలు కల్పిస్తూ, భారం మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై వేయడం దుర్మార్గమన్నారు. ఎన్టీపీఎస్‌ ద్వారా గుజరాత్‌ ప్రభుత్వం రూ.1.99 పైసలకు కొనుగోలు చేసిందని, సెకీ నుంచి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 2.49 పైసలకు కుదుర్చుకుందని, ఒక యూనిట్‌కు అదనంగా 50 పైసలు నిర్ధారించి, 25 ఏళ్లపాటు ప్రజలపై పెనుభారం మోపనున్నారని చెప్పారు. కృష్ణపట్నం పోర్టును నవయుగ నుంచి తప్పించి, బెదిరించి జగన్‌ హయాంలో ఆదానీకి అప్పగించారని గుర్తుచేశారు. గంగవరం పోర్టునూ ప్రభుత్వానికి రావాల్సి ఉండగా, అతి తక్కువ ధరకు ఆదానికి జగన్‌ వేలాది ఎకరాల భూములు దోచిపెట్టారని మండిపడ్డారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున, విద్యుత్‌ ఒప్పందాల్ని రద్దు చేసుకునేందుకుగాను ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, అందులో 164 మంది అధికార కూటమి ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు. బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మాట్లాడుతూ ఆదానీకి, బీజేపీకి సంబంధంలేదంటూ చేసిన వ్యాఖ్యల్ని రామకృష్ణ తప్పుపట్టారు. ఇవాళ నరేంద్ర మోదీ, అమిత్‌షా లేకపోతే ఆదానీ లేడని నొక్కిచెప్పారు. నేడు ఆదానీ విద్యుత్‌ ఒప్పందాల అవినీతిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అమెరికాలో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) దర్యాప్తు పూర్తయ్యాకనే నివేదికను సమర్పించారని గుర్తుచేశారు. ఆ నివేదికలో ఆదానీ రూ.2100 కోట్లు 4 రాష్ట్రాలలో లంచాలుగా ముట్టజెప్పారని, అందులో రూ.1750 కోట్లను ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇచ్చినట్లుగా నివేదించారని వివరించారు. జగన్‌ సైతం ఈనాడు, ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల చొప్పున పరువు నష్టం వేసి ఊరుకున్నారని, ఈ వార్తను ఆ రెండు పేపర్లే రాశాయా? అని ప్రశ్నించారు. దేశ, విదేశాల్లో ఉన్న మీడియా సంస్థలు జగన్‌పై కథనాలు రాశాయని, వాటిపైనా కూడా పరువు నష్టం వేయాలికదా అని అన్నారు. రాష్ట్రంలో ఆదానీకి భయపడే రాజకీయం నడుస్తోందని, ఆదానీకి సరెండర్‌ అవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజల పక్షాన నిలబడతారా?, లేక ఆదానీకి దోచిపెడతారా? తేల్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పరిపాలన నిష్పక్షపాతంగా జరగడంలేదని, కాకినాడ పోర్టుకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెళ్లి అక్కడి షిప్‌ను సీజ్‌ చేయమని ఆదేశించడం చాలా సంతోషమన్నారు. కొంతకాలంగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నదని, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. అదే సమయంలో గంగవరం పోర్టులోనూ ఇదే కొనసాగుతున్నదనీ, అక్కడికి పవన్‌ కల్యాణ్‌ ఎందుకు వెళ్లలేకపోతున్నారని, అది ఆదానీదనే వెనక్కి జంకుతున్నారా? అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు అరబిందోది కాబట్టే చర్యలకు ఉపక్రమించినట్లున్నదనీ, దీని వలన పాలన నిష్పక్షపాతంగా లేదనేదీ తేటతెల్లమవుతుందని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, తుఫాన్లతో ఇబ్బందులకు గురవుతున్న రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. కనీసం రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు అవసరమైన టార్పాయిన్లు ఇవ్వడం లేదని, ధాన్యం వర్షంతో తడచి ముద్దవుతోందని చెప్పారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, ఈ అంశాలపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసి విన్నవిస్తామన్నారు. మేనిఫెస్టోలో రైతులకు హామీ ఇచ్చిన రూ.20వేలు ఇవ్వలేదని, కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు రూ.10వేలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక పరిస్థితుల రీత్యా..అంత ఇవ్వలేకపోతే ప్రస్తుతానికి రూ.5వేల గౌరవ వేతనం ఇచ్చి వలంటీర్లను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. వలంటీర్ల విషయంలో రాజకీయం తగదని, సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రామకృష్ణ కోరారు.

విచారణ ఎందుకింత జాప్యం?

0

. రెండు వారాల్లో సీబీఐ, ఈడీ కేసుల పూర్తి వివరాలివ్వండి
. జగన్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీం ఆదేశాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందజేయాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లను సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్‌ రూపంలో ఇవ్వడంతో పాటు దిగువ కోర్టులో ఉన్న డిశ్చార్జ్‌ పిటిషన్ల వివరాలు కూడా వాటితో పొందుపర్చాలని ధర్మాసనం సూచించింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండిరగ్‌ పిటిషన్ల వివరాలన్నింటితో అఫిడ విట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు గతంలో పిటిషన్‌ వేశారు. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్నారు. దీనిపై విచారణను న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం చేపట్టింది. వాదనల సందర్భ ంగా రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు రెండు పక్షాల న్యాయవా దులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. విచా రణ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతోం దని ధర్మాసనం ప్రశ్నించింది. డిశ్చార్జ్‌, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండిరగే కారణమని న్యాయ వాదులు చెప్పారు. పెండిరగ్‌లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తా మని ధర్మానం చెప్పింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్‌ కోర్టు, పెండిరగ్‌ కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.
సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు
వైసీపీ సోషల్‌ మీడియా పూర్వ కన్వీనర్‌ సజ్జల భార్గవరెడ్డి పిటిషన్‌ను స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. విజ్ఞప్తులు ఏమైనా ఉంటే హైకోర్టు ముందే చెప్పుకోవాలని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులపై నమోదయిన కేసుల్లో తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని ఇటీవల భార్గవరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం నిరాకరించింది. భార్గవరెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కపిల్‌ సిబల్‌ చెప్పగా, చట్టాలు ఎప్పటివనేది కాదని, మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలు చూడాలని లూథ్రా వాదించారు. ఈ వ్యవహారంలో భార్గవరెడ్డి కీలక సూత్రధారి అని, ప్రస్తుత దర్యాప్తునకు కూడా సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టు ముందు చాలా విషయాలు గోప్యంగా ఉంచారన్నారు. దుర్భాషలు ఉపయోగించే ఎవరైనా చట్టపరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేస్తూ, హైకోర్టును ఆశ్రయించేందుకు ధర్మాసనం రెండు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది.

అనంతపురం రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఫేష్ వాష్ అండ్ గో ” కార్యక్రమం

విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు “ఫేష్ వాష్ అండ్ గో ” కార్యక్రమం నిర్వహించారు. గార్లదిన్నె మండలం కల్లూరు జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారి-44 పై సోమవారం తెల్లవారుజామున ఫేష్ వాష్ అండ్ గో చేపట్టారు. హైదరాబాద్- బెంగుళూరు ల వైపు వెళ్తున్న లారీలు, బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరోలను డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపించారు. ముఖం కడిగాక టీ తాగమని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డ్రైవర్లకు గుర్తు చేశారు. వాహనాల డ్రైవర్లు నిద్ర మత్తులోకి జారకుండా పూర్తీగా తేరుకుంటే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చనే జిల్లా ఎస్పీ పి.జగదీష్ సంకల్పంతో జిల్లాలో పోలీసులు ప్రధానంగా హైవేలపై ఈకార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికఁ అర్జీలను తక్షణమే పరిష్కరించాలి

జిల్లా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ఁప్రజా సమస్యల పరిష్కార వేదికఁ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ ఏ.మలోల, ఎస్డీసి శిరీష, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 380 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను గడువులోగా తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పిజిఆర్ఎస్ అర్జీలపై నిత్యం మానిటర్ చేస్తూ నాణ్యతగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, ప్రాధాన్యతగా వాటి పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత శనివారం మొట్టమొదటిసారిగా జిల్లాకు రావడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి విశేషమైన ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. ఎస్ఈ ఆర్అండ్బి బాధ్యతగా పనిచేసి హెలిప్యాడ్ బాగా తయారు చేశారని, ఆర్అండ్బి బృందం, సిపిఓ, పోలీస్ చాలా బాగా పని చేశారని, డేటా బేస్, వివరాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేమకల్లులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సమయంలో పెన్షన్ ఇప్పటివరకు ఎంత పూర్తయింది అని అడిగారని, అప్పటికే జిల్లాలో 94 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఈ విషయాన్ని సభలో సైతం తెలియజేశారని, రాష్ట్రంలో అనంతపురం జిల్లా నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారన్నారు. పెన్షన్ల పంపిణీలో బాగా పనిచేసిన డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్యను జిల్లా కలెక్టర్ అభినందించారు. పెన్షన్ల పంపిణీపై జాయింట్ కలెక్టర్ బాగా మానిటర్ చేశారన్నారు. ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలను బాగా నిర్వర్తించారన్నారు. జిల్లా అధికారులు అంతా ఒక ప్రణాళిక పెట్టుకోవాలని, ఏ సమయంలో అడిగిన మనం మంచి స్థానంలో ఉండేలా చూసుకోవాలన్నారు. బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన అంశాలపై ఆయా శాఖల జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులపై అధికారులు ఉత్తమంగా పనిచేయాలని సూచించారు. ఆయా శాఖల జిల్లా అధికారుల మధ్య మంచి సమన్వయం ఉందని, భవిష్యత్తులో నిర్వహించే ఏ కార్యక్రమానికైనా ప్రణాళిక అనేది ముఖ్యమన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అన్ని కార్యక్రమాలు, పథకాలలో జిల్లా ప్రగతి ముందంజలో ఉండాలన్నారు. అన్ని కార్యక్రమాలు, పథకాలలో జిల్లా మొదటి స్థానంలో ఉండాలని, ఇందుకోసం జిల్లా అధికారుల టీం జిల్లా అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ అశోక్ కుమార్, జడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, డీఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, జిల్లా సైనిక్ సంక్షేమ శాఖ అధికారి పి.తిమ్మప్ప, ఎల్డిఎం నర్సింగరావు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, హౌసింగ్ పిడి శైలజ, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జెడి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, డ్వామా పిడి సలిం భాష, హార్టికల్చర్ డిడి నరసింహారావు, ఏపీఎంఐపీ పిడి రఘునాథరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, జిల్లా రిజిస్టర్ భార్గవ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, సర్వే ఏడి రూప్ల నాయక్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, మార్కెటింగ్ ఎడి సత్యనారాయణ చౌదరి, డిసిఓ అరుణకుమారి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, పిజిఆర్ఎస్ తహసిల్దార్ వాణిశ్రీ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

దశాబ్దాల రోడ్డు సమస్యకు పరిష్కారం

-మండల ఇంఛార్జి ధర్మవరపు మురళీ

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని బొమ్మేపర్తి నుండి గొందిరెడ్డిపల్లి వరకు రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న దశాబ్దాల రహదారి సమస్యకు ఎమ్మెల్యే పరిటాల సునీత శాశ్వత పరిష్కారం చూపించారని టీడీపీ మండల ఇంఛార్జి ధర్మవరపు మురళీ అన్నారు. సోమవారం ఆయన ఎంపీడీఓ బుల్లే విజయలక్ష్మి, మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శీనా, గొందిరెడ్డిపల్లి సర్పంచ్ మిడతల శీనయ్య, ఎంపీటీసీ జాఫర్, తెలుగు యువత మండల అధ్యక్షుడు ఆర్.రాజశేఖర్ రెడ్డితో కలిసి రూ.10లక్షలతో బొమ్మేపర్తి నుంచి గొందిరెడ్డిపల్లి వరకు 1600మీటర్ల మట్టి రోడ్డు పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. మురళీ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజలు రాకపోకలు సాగించడానికి టీడీపీ హయాంలో గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ లక్ష్మీనారాయణ, ఈఓఆర్డీ ఆనందప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మాహబూబ్ జాన్, వైస్ సర్పంచ్ అశ్వర్థప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ ఎం.శ్రీనివాసులు, తిరుపతిరెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు కు యిచ్చిన హామీ అములు చేయాలి …

సంక్షేమ బోర్డు లో క్లెయిమ్స్ పరిష్కారించాలి – సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ్

విశాలాంధ్ర-చోడవరం : కూటమి ప్రభుత్వం అధికారం లో వస్తే నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు పునరుద్దరణ చేస్తామన్న హామీ అమలు చేసి, పెండింగ్ లో ఉన్న క్లైములు వెంటనే పరిష్కరించాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు.
స్థానిక వినాయక గుడి వద్ద శ్రీ బాల గణపతి తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షులు కోన నూక రాజు అధ్యక్షతన ఆదివారం రాత్రి జరిపిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలు మందు సంక్షేమ బోర్డు పునరుద్ధరణపై నిర్ధిష్ట హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తామని చెప్పడం మాట మార్చడమేనని ధ్వజమెత్తారు. గతంలో వై.ఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 17 ద్వారా
ఇతర పధకాలు కు దారి మళ్లించే ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాల న్నారు. దారి మళ్ళించిన నిధులను కార్మిక సంక్షేమ బోర్డు ఖాతా లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు రూ.కోటి సొంత నిధులు ఇస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించి కార్మికులు కు సంక్షేమ పధకాలు అమలు చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశం లో నారం మధు ప్రసాద్, బొంతు దేముడు, నౌడు అప్పారావు, గువ్వల కనకరావు, వోలు శ్రీను, నాగిరెడ్డి గోవింద, గువ్వా నాగేశ్వరరావు, ధరిమిశెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 8వ తేదీన ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం..

రోటరీ క్లబ్ ప్రతినిధులు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ, కోశాధికారి వై. సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ జి. పెరుమాళ్ళ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో శిబిరం యొక్క కరపత్రాలను క్లబ్ కమిటీ తో పాటు అందరూ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్బు, శంకర కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ- అనంతపురం జిల్లా వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపునకు దాతలుగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ, కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కోడలు, కుమారుడు దాసరి రమాదేవి, డివి. వెంకటేశులు( చిట్టి )వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగిందన్నారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కంటి వైద్య చికిత్సలు తర్వాత, ఆపరేషన్కు ఎంపికైన వారికి ఉచిత రవాణా, ఉచిత వసతి, ఉచితంగా అద్దాలు పంపిణీ చేయబడునని తెలిపారు. కంటి పరీక్షలు చేసుకునేవారు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు ల యొక్క జిరాక్సులు మూడు, ఫోటోలు, సెల్ నెంబర్ తో కూడిన చిరునామా ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి చూపును కాపాడుకోవాలని తెలిపారు.

డిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన హేమలత

విశాలాంధ్ర, పార్వతీపురం : జిల్లా రెవెన్యూ అధికారిగా కె. హేమలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ను, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబికకు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంలు అందజేశారు.హేమలత గతంలో పార్వతీపురం, పాలకొండ, విజయనగరం రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేశారు. గత ఎన్నికల్లో పార్వతీపురం రిటర్నింగ్ అధికారిగా చక్కగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. హేమలత జిల్లా రెవెన్యూ అధికారిగా నియామకం పట్ల జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. డిఆర్ఓ ను పలువురు రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్ ఉద్యోగులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.