ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం ఈనెల మూడవ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఈనెల మూడో తేదీ మంగళవారం నుండి ఈనెల 31వ తేదీ వరకు సచివాలయ సిబ్బందితో కలిసి ధర్మవరం నియోజకవర్గం లో ఁగ్రీవెన్స్ డేఁ ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా, 3వ తేదీ మంగళవారం కార్యక్రమం తాడిమర్రిలో ప్రారంభమవుతుంది అని తెలిపారు.గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు తమ సమస్యలను, అవగాహన దారితీసే అంశాలను సులభంగా రిజిస్టర్ చేసుకోగలుగుతారు అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించడానికి మంత్రి, సంబంధిత అధికారులు నిబద్ధతతో పని చేస్తా రన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వారి సమస్యలకు సమగ్ర పరిష్కారాలు అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఉంటుంది అని అన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తెలియజేయాలని తెలిపారు.
ఈనెల మూడవ తేదీ నుండి గ్రీవెన్స్ డే కార్యక్రమాలు ప్రారంభం
ఆకట్టుకున్న నాట్య ప్రదర్శన
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు పోలా ఫంక్షన్ హాల్ లో జిల్లా రచయితల సంఘం వారి కవి సమ్మేళనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ వారి శిష్య బృందం ఆలపించిన నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చేనేత కష్టాల గురించి, వృద్ధాప్యపు విలువలు గురించి బాబు బాలాజీ రామ లాలిత్య పాటలు రాసి గానం చేసిన వైనం అందరినీ ముగ్ధుల్ని చేసింది. అనంతరం కవి రచయితలు జయసింహ, డాక్టర్ సత్య నిర్ధారణ, జాబిలి చాంద్ బాషా, రెడ్ క్రాస్ సంస్థ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా నృత్యం చేసిన చిన్నారులకు గురువులకు మెమెంటోలు అందించి, ఘనంగా సత్కరించారు. అనంతరం బాబు బాలాజీ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలను తెలియజేశారు.
ఘనంగా కవిత సమ్మేళన ఉత్సవ వేడుకలు..
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు పోలా ఫంక్షన్ హాల్ నందు శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్బాషా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కవితా సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు. వివిధ రాష్ట్రాల నుండి కవులు, కళాకారులు హాజరయ్యారు. తదుపరి నాగులాదేవి అనేటువంటి శ్రీకృష్ణదేవరాల యొక్క ప్రేమ కథ చారిత్రక నవలను అందరూ ఆవిష్కరించారు. రాయలు మహిళల పట్ల చూపిన ఆదరణ ప్రజల పట్ల చూపిన సేవాభావము సాహిత్యం చేసిన కృషిని వారు కొనియాడారు. అనంతరం ఆంధ్రప్రభ ఎడిటర్ శర్మ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ధర్మవరంలో కవిత్వం విజయవంతం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గం అధ్యక్షులు జయసింహ కార్యదర్శి సత్య నిర్ధారణ వారి నేతలు వారి యొక్క అధ్యక్షతన రెండు సభలు జరిగి వందమంది కవులు కవిత గానాన్ని వినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ కవిత్వం అనేటువంటిది సామాజిక జాగ్రత్త, సామాజిక చైతన్యం చేయడంలో ఒక మంచి సాధనము అని తెలిపారు. మెరుగైన సమాజం కోసం పాటుపడే సాహిత్యం ఆ సాహిత్యం లోని ముఖ్యమైనటువంటిది కవిత్వము అని తెలిపారు. అనంతరం పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహించారు. కవులందరినీ ఘనంగా సత్కరించారు. తదుపరి బాలాజీ లలితా కళారూత్యము యొక్క ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చేనేత, వృద్ధుల అంశంపై, కవిత గోష్టి నిర్వహణ అందరిని ఆకట్టుకుంది. రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్, యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర మాట్లాడుతూ భారత దేశంలో ఇటువంటి వైవిద్య కార్యక్రమాన్ని ముందుకొచ్చిన జిల్లా రచయితల సంఘం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం కవులు రచయితలు జయసింహ, డాక్టర్ సత్య నిర్ధారణ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాలు వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి సిఐ కె పాపు నాయుడు
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : డిసెంబర్ 2, చోడవరం ప్రొబేషనరీ డ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలో గల 22 మద్యం దుకాణాలు వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సి.ఐ కె.పాపునాయుడు తెలియజేశారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ చోడవరం సర్కిల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 22 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు ప్రతి దుకాణం వద్ద సీ.సీ కెమెరా ఏర్పాటు చేయాలని దుకాణదారులకు నోటీసులు ఇస్తున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద ధరల పట్టిక ఉంచాలని, డిజిటల్ పేమెంట్లు అంగీకరించాలని తెలియజేశారు. గత నెలలో 22 కేసులు నమోదు చేశామన్నారు. నవంబర్ నెలలో మద్యం అమ్మకాలు రూ. 11 కోట్ల 16 లక్షలు వచ్చాయని, దీనిలో బీర్ల అమ్మకం 15 684 కేసులు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎం. శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ మధ్య గొడవ.. గినియాలో వంద మంది మృతి
గినియాలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవ వందమందికి పైగా అభిమానుల ప్రాణాలు తీసింది. స్టేడియంతో పాటు సిటీ మొత్తం ఉద్రిక్తంగా మారింది. మ్యాచ్ రిఫరీ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ అభిమానులు మైదానంలోకి చొరబడి గొడవపడ్డారు. రెండు జట్ల అభిమానులు చొచ్చుకు రావడంతో స్టేడియం కాస్తా రణరంగంగా మారింది. తొక్కిసలాట, కొట్లాటలతో చాలామంది అభిమానులు చనిపోయారు. మైదానంలో, స్టేడియం ఆవరణలో కిందపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అందులో చాలామంది అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు. పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలోని రెండో అతిపెద్ద నగరం జెరెకోర్ లో ఆదివారం చోటుచేసుకుందీ ఘోరం.
మార్చురీ మొత్తం నిండిపోవడంతో మృతదేహాలను ఆసుపత్రి వరండాలో వరుసగా పడుకోబెట్టారు. కనుచూపుమేరలో మొత్తం డెడ్ బాడీలే ఉన్నాయని స్థానికుడు ఒకరు చెప్పారు. కనీసం వందమంది చనిపోయి ఉంటారని, గాయపడ్డ వారి సంఖ్య కూడా ఎక్కువేనని వైద్యులు తెలిపారు. కాగా, స్టేడియంలో గొడవకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రణరంగంగా మారిన స్టేడియం నుంచి ప్రాణభయంతో జనం పరుగులు పెట్టడం ఇందులో కనిపిస్తోంది. గినియా సైనిక పాలకుడు మామాడి డౌంబోయా గౌరవార్థం నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నమెంట్ లో ఈ విషాదం చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.
జగన్ అక్రమాస్తుల కేసుల వివరాలు అందించండి
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో సుప్రీంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తులపై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. కేసుల పూర్తి వివరాలు 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని చెప్పింది. సీబీఐ,ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలంది. అనంతర ఈ విచారణను రెండు వారాలు వాయిదా వేసింది..
అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే ముందు.. జో బైడెన్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి వైదొలగే ముందు జోబైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్‌పై ఉన్న అక్రమ ఆయుధ కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ తన కుమారుడిపై ఉన్న కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో తాను జోక్యం చేసుకోబోనని, ఇదే విషయాన్ని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాడే చెప్పానని పేర్కొన్నారు. ఆ మాటకు కట్టుబడి ఉండి తన కుమారుడిని అన్యాయంగా విచారించే సమయంలోనూ మౌనంగానే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా హంటర్‌పై పెట్టిన కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు వివరించారు.
హంటర్‌పై కేసులు ఎందుకంటే?
హంటర్ బైడెన్ 2018లో తుపాకి కొంటూ ఆయుధ డీలర్‌కు ఇచ్చిన ఫారంలో తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే, తన వద్ద అక్రమ ఆయుధం లేదని, తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని తెలిపారు. ఈ రెండు విషయాల్లోనూ ఆయన చెప్పింది అబద్ధమని తేలింది. ఆయన 11 రోజులపాటు అక్రమ ఆయుధం కలిగి ఉండడంతోపాటు కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు కేసు నమోదైంది.
అక్రమ ఆయుధం కేసులో ఈ ఏడాది జూన్‌లో హంటర్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించినా శిక్ష ఖరారు చేయలేదు. అప్పట్లో జో బైడెన్ మాట్లాడుతూ తన కుమారుడి తరపున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగే వేళ కుమారుడికి ఆ కేసుల నుంచి విముక్తి కల్పిస్తూ క్షమాభిక్ష ప్రసాదించడం చర్చనీయాంశమైంది.
కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1200 మంది ఓటర్లను 1500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీఈసీని ఆదేశించింది.
రాయలసీమలో రెండో రాజధాని పెట్టాలి: మాజీ మంత్రి శైలజానాథ్
కర్నూలులో ఏర్పాటు కావాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి, హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని గుర్తు చేశారు. అమరావతికి హైకోర్టును తరలించడం సరికాదని అన్నారు. కర్నూలులో బెంచ్ ను ఏర్పాటు చేయడం రాయలసీమకు అన్యాయం చేయడమేనని చెప్పారు. కడప కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించారని… కడపలో ఉంటే ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజధానిని, హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తున్నందువల్ల… రాయలసీమ ప్రాంతంలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రాంతీయ విభేదాలు తలెత్తి… మళ్లీ వేర్పాటువాదం బలపడే ప్రమాదం ఉందని అన్నారు.
బైడెన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ట్రంప్
ప్రెసిడెంట్ జో బైడెన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష పెట్టారని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బైడెన్ నిర్ణయం పూర్తిగా న్యాయ విరుద్ధమని ఆరోపించారు. క్రిమినల్ కేసుల నుంచి కొడుకును తప్పించేందుకు అమెరికా రాజ్యాంగం కల్పించిన అధికారాలను బైడెన్ దుర్వినియోగపరిచారని మండిపడ్డారు. హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే క్యాపిటల్ హిల్ దాడి కేసులో బందీలను విడుదల చేయలేదేమని నిలదీశారు. తుపాకీ అక్రమంగా కొన్నారని, ఆదాయపన్ను చెల్లింపు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని హంటర్ బైడెన్ పై పోలీసులు గతంలో కేసులు నమోదు చేశారు. విచారణ తర్వాత కోర్టు హంటర్ ను దోషిగా తేల్చింది. అయితే, శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. ఈ కేసులకు సంబంధించి తాను కల్పించుకోబోనని ప్రెసిడెంట్ బైడెన్ గతంలో పేర్కొన్నారు. అయితే, తాజాగా హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో హంటర్ కు శిక్ష పడే అవకాశం లేదు. అధ్యక్ష హోదాలో కొడుకుకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు.