Thursday, January 9, 2025
Home Blog Page 94

హోరెత్తిన ‘ఇంటి’ పోరు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు, ధర్నాలు

గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి
నిర్మాణ సామాగ్రి ధరలు దృష్ట్యా రూ.5 లక్షలకు పెంచాలి
సీపీఐ, వ్య.కా.సం అధ్వర్యాన సామూహిక అర్జీలు సమర్పించిన పేదలు
జనంతో పోటెత్తిన గ్రామ… వార్డు సచివాలయాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుమేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అర్జీల సమర్పణ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాజకీయపార్టీల కతీతంగా పేదలు, బడుగు బలహీన, మధ్యతరగతి వర్గాలు పెద్దసంఖ్యలో కదలివచ్చారు. గ్రామ/వార్డు సచివాలయాలు వేలాదిమంది అర్జీదారులతో పోటెత్తాయి. ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌లు ధర్నాలతో దద్దరిల్లాయి. భారీ ప్రదర్శనలతో రహదారులు కిక్కిరిశాయి. గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలం నివాసానికి ఏమాత్రం సరిపోదని, ఆ లబ్ధిదారులందరికీ కూటమి ప్రభుత్వం గతంలో వేసిన లే ఔట్లను మార్పు చేసి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇవ్వాలని సీపీఐ, వ్యవయసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌, ఇనుము, ఇటుక, కంకర, ఇసుక తదితర ముడిసామాగ్రి ధరలు పెరిగినందున కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షలకు అదనంగా మరో లక్ష కలిపి రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు.
నివాసయోగ్యమైన భూములివ్వాలి: ముప్పాళ్ల
అర్హులైన పేదలందరికీ నివాసయోగ్య మైన ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని ద్వారకా నగర పరిసర ప్రాంతాల్లోని పేదలందరూ స్థానిక సచివాలయంలో అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముప్పాళ్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. జగన్‌ కొండల్లో, వాగుల్లో, పల్లపు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నించారని, అక్కడ నీరు, రోడ్డు తదితర సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం పొరపాట్లు చేయవద్దని ముప్పాళ్ల విజ్ఞప్తి చేశారు. సీపీఐ మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్‌బాబు, పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పేదల నివాసకల్పనకు ఎందాకైనా పోరాడతాం: జల్లి విల్సన్‌
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ నివాస సౌకర్యం కల్పించేందుకు ఎందాకైనా పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు జల్లి విల్సన్‌ స్పష్టం చేశారు. చీరాల నియోజకవర్గంలోని ఓడరేవు, దేవాంగపూరి కాలనీల్లో జల్లి విల్సన్‌ స్థానిక నాయకులతో కలిసి సచివాలయూల వద్ద లబ్ధిదారులతో అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా విల్సన్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం శుభపరిణామ మన్నారు. అర్హులకు నివాసయోగ్యంగా ఉండే స్థలాలు గుర్తించి గృహనిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు బత్తుల శామ్యూల్‌, చీరాల నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి చిరమల ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గంలో సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగనకొండ అధ్వర్యంలో గ్రామసచివాలయాల్లో అర్జీలు సమర్పించారు.
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి: అక్కినేని వనజ
ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు గణనీయంగా పెరిగినందున ప్రభుత్వం ఇస్తానన్న రూ.4 లక్షలను రూ.5 లక్షలకు పెంపు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి సచివాలయంలో ఇళ్ల స్థలాల అర్జీల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని వనజ కోరారు. అర్జీల సమర్పణ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి పుల్లూరి సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ సచివాలయాల్లో పేదలు అర్జీలు సమర్పించారు.
కర్నూలు కలెక్టరేట్‌ కిటకిట…
ఎన్నికల సమయంలో పేదలకు నివాసస్థలం ఇస్తానన్న హామీని ప్రభుత్వం నిలుపుకోవాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి .గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత సీఆర్‌ భవన్‌ నుండి కలెక్టరేట్‌ వరకు వేలాది మంది పేదలు, సీపీఐ ప్రజాసంఘాల నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కర్నూలు రహదారులు కిలోమీటర్ల పొడవునా అర్జీదారులతో కిటకిటలాడాయి. మహిళలు, చంటిపిల్లలతో పెద్దఎత్తున తరలిరావడంతో కలెక్టరేట్‌ కిక్కిరిసిపోయింది. ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు, ఎస్‌.మునెప్ప తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 200కు పైగా సచివాలయాల్లో అర్జీలు అందజేశారు.
పేదలందరికీ ఇళ్లస్థలాలు:
సీహెచ్‌ కోటేశ్వరరావు
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామ సచివాలయం వద్ద అర్జీలు అందజేశారు. ఇళ్ల స్థలాల కోసం అర్జీలతో పేదలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఉప్పే నరసింహారావు, మండల, జిల్లా నాయకులు ముఖ్య దేశాయ, లావూరు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల సాకారం
చేయాలి: జంగాల
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు పేదల సొంతింటి కల సాకారం చేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లాలో చేపట్టిన అర్జీలు అందజేసే కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా సచివాలయాల్లో అర్జీలు అందజేసేందుకు లబ్ధిదారులు కదిలివచ్చారు. గుంటూరు నగరంలోని 8వ డివిజన్‌ సచివాలయం వద్ద జంగాల అజయ్‌కుమార్‌, ఇతర సచివాలయాలలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలలోని 36 సచివాలయాల్లో మొదటి రోజు అర్జీలు అందజేశారు.
ఎన్నికల హామీ వెంటనే
అమలు చేయాలి: కేవీవీ ప్రసాద్‌
కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీ వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామ సచివాలయం కార్యదర్శికి ఇళ్లస్థలాల అర్జీలు అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కట్టవరపు విజయరావు, సీపీఐ సహాయ కార్యదర్శి చాగంటిపాటి వెంకటేశ్వరవు, గొంది శోభనా చలపతిరావు, వెంగళ్ల శివయ్య, తాటి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రచార ఆర్భాటంగా
మార్చవద్దు: డేగా ప్రభాకర్‌
పేదలకు ఇస్తానన్న ఇంటిస్థలం హామీ గత ప్రభుత్వం వలే ప్రచార ఆర్భాటంగా మార్చవద్దని, తక్షణమే అమలుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. సీపీఐ16వ డివిజన్‌ అరుంధతి పేట సచివాలయం వద్ద ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలసి డివిజన్‌ కార్యదర్శి కొల్లూరి సుధారాణి అధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌, ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
డోన్‌లో జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె.రామాంజనేయులు, కోడుమూరులో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌, విశాఖలో ఎం.పైడిరాజు, సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో సీపీఐ జిల్లా కార్యదర్శి మీసాల మేమయ్య యాదవ్‌, అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామ సచివాలయం వద్ద జిల్లా సీపీఐ కార్యదర్శి సి.జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంతాన పరిమితి ఎత్తివేత

. ఇద్దరికి మించినా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు
. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు మారుస్తూ చట్ట సవరణ
. మంత్రి నారాయణ

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లభిస్తోంది. దీనికి సంబంధించి గతంలో ఉన్న చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ చట్టాల సవరణ బిల్లు 2024ను అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును నాలుగు రోజుల క్రితమే మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. తాజాగా ఈ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. కాగా, 1960 దశకంలో జనాభా నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ పథకాలు ప్రవేశపెట్టాయి. కుటుంబ నియంత్రణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో భాగంగా పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అనర్హులుగా చేస్తూ చట్టంలో సవరణలు చేశారు. 1955 మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్టంలోని సెక్షన్‌ 21 బి, 1965 మున్సిపాల్టీల చట్టంలోని సెక్షన్‌ 13బిలను చొప్పిస్తూ ఏపీ మున్సిపల్‌ శాసనాల సవరణ బిల్లు 1994ను తీసుకొచ్చారు. 1994లో జరిగిన ఈ సవరణల ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిఉన్న వారు పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతూ వస్తుంది. అయితే మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలతో సంతానోత్పత్తి సామర్ధ్యం రేటు బాగా తగ్గిపో యింది. 2001లో 2.6 నుంచి 1.5కు తగ్గింది. జనన, మరణాల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ బాగా వెనుకబడిపోయింది. తద్వారా జనాభా వృద్ధిరేటు బాగా తగ్గిపోయింది. ఇదే సమయంలో వృద్ధుల జనాభా రేటు ఎక్కువగా ఉంది. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చింది. దీని ప్రకారం గతంలో ఆయా చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్‌లను తొలగిస్తూ ఏపీ మున్సిపల్‌ శాసనాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.

అత్యాచారాలపై మాటలయుద్ధం

. పరస్పర విమర్శలతో హోరెత్తిన మండలి
. వైసీపీ సభ్యులపై హోంమంత్రి ఆగ్రహం
. మంత్రి తీరుకు నిరసనగా వైసీపీ వాకౌట్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై సాగుతున్న అత్యాచారాలు, హత్యల అంశంపై శాసనమండలి దద్దరిల్లింది. మండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ సభ్యులు పరస్పర విమర్శల దాడికి దిగారు. మంత్రులు జవాబులిచ్చే సమయంలో వైసీపీ సభ్యులు అడ్డు తగులుతూ… ఉప ప్రశ్నలు వేశారు. అలాగే వైసీపీ సభ్యులు మాట్లాడుతున్న ప్పుడు కూటమి సభ్యులు అడ్డుతగిలారు. హోంమంత్రి అడిగిన ప్రశ్నలకు సమా ధానాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారని వైసీపీ అభ్యంతరం తెలిపింది. తొలుత మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు అంశంపై వైసీపీ సభ్యులు వరుదు కల్యాణి, టి.కల్పలత, చంద్రగిరి ఏసురత్నం ప్రశ్నలు అడిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, మహిళలు, ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దిశ చట్టాన్ని, యాప్‌ను నిర్వీర్యం చేయడంపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యత: హోంమంత్రి అనిత
ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ… మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ హయాంలో క్రైమ్‌ రేటు తగ్గిందని, అత్యాచార ఘటన లను రాజకీయ చేయొద్దని సూచించారు. నిర్భయ చట్టాన్ని పక్కన పెట్టి గత ప్రభు త్వంలో దిశ చట్టం తెచ్చారని, మహిళలపై అత్యాచారాలు జరిగినా పట్టించుకోలేదని, ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని గుర్తించడానికి సమయం పట్టిందన్నారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారని, అసలు దిశ చట్టం ఉందా.? గంజాయిపై ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా ?, అంటూ వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. జగన్‌ తల్లి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా ఉంటామని ఆమె వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా వైసీపీ సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి…నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, బాధ్యతాయుత హోంమంత్రి అనిత సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు హోం మంత్రి స్పష్టంగా సమాధానం ఇవ్వని కారణంగా… ఆ ప్రశ్న వరకు సభ్యులు వాకౌట్‌ చేశారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ మంత్రి మాటలను బొత్స వక్రీకరించారన్నారు. అనంతరం కర్నూలుజిల్లాలో కృష్ణానదిపై వంతెన నిర్మాణ అంశంపై సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నలకు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లేదని బదులిచ్చారు. అంగన్‌వాడీ భవనాలు, బాలల సంజీవని పథకం అంశాలపై సభ్యులు వంకా రవీంద్రకుమార్‌, టి.కల్పలత అడిగిన ప్రశ్నలకు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,977 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని, జనవరి, 2024 నుంచి ఇప్పటి వరకు రూ.32.64 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మూత్రశాలలు లేకుండా 2,941 అద్దె భవనాలున్నాయని, సాధ్యమైన చోట్ల మరుగు దొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని, అన్ని వసతులున్న వేరే భవనాలకు వాటిని మార్చుతున్నట్లు వివరించారు. గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గృహ విద్యుత్‌ వినియోదారులపై అదనపు భారం అంశంపై సభ్యులు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వివరణ ఇచ్చారు. 2019` 2024 మధ్య కాలంలో గృహ వినియోగదారులపై టారిఫ్‌ నిమిత్తం మొత్తం రూ.1769.92 కోట్ల అదనపు భారం ఉందని, దాంతోపాటు ట్రూ ఆప్‌ ఎఫ్‌పీసీఏ చార్జీల నిమిత్తం రూ.5,851.82 కోట్లను విధించారన్నారు. ఇమామ్‌, మౌజమ్‌లకు గౌరవ వేతనంపై సభ్యులు ఇసాక్‌ బాషా, మహ్మద్‌ రుహుల్లా అడిగిన ప్రశ్నలకు మైనార్టీశాఖ మంత్రి ఫరూక్‌ అబ్దులా సమాధానమిస్తూ, ఇమామ్‌, మౌజమ్‌ లకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉందన్నారు. కాగా వైసీపీ సభ్యులు తమ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని నిరసనకు దిగారు. దీంతో రాత పూర్వకంగా పంపాలని మంత్రికి చైర్మన్‌ సూచించారు. జాబ్‌ క్యాలెండర్‌, కార్పొరేషన్లు, ప్రభుత్వ శాఖల నుండి నిధుల మళ్లింపు, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాలు, రాష్ట్రంలో వయోజన విద్యా కేంద్రాలు అనే నాలుగు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పినట్లుగా శాసన మండలి చైర్మన్‌ ప్రకటించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన అనేక బిల్లులను మండలి ఆమోదించినట్లు వెల్లడిరచారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సవరణ బిల్లు, ఏపీ విద్యుత్‌ రెండో సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ తాత్కాలిక బిల్లులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం శాసనమండలిని మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.

రాజోనాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారా?

. రెండు వారాల్లో తెలియజేయండి
. రాష్ట్రపతిని కోరిన సుప్రీం

న్యూదిల్లీ: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్‌ సింగ్‌ రాజోనా క్షమాభిక్ష అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. అతడి పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని ఆమె కార్యదర్శిని ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోగా నిర్ణయం తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం రాష్ట్రపతిని అభ్యర్థించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. సిక్కులకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా 1995లో చండీగఢ్‌ సచివాలయం ముందు జరిగిన పేలుడులో అప్పటి పంజాబ్‌ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌తో పాటు మరో 16 మంది మరణించారు. ఈ పేలుడులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్‌ సింగ్‌ రాజోనా ప్రమేయం ఉన్నట్లు రుజువు కావడంతో 2007లో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. రెండు దశాబ్దాలకు పైగా రాజోనా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ 2012లో రాజోనా కేంద్రాన్ని ఆశ్రయించాడు. అప్పటినుంచి అతడి పిటిషన్‌ పెండిరగ్‌లోనే ఉంది. తన మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించాలని కోరుతూ 2020లో రాజోనా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం… మరణశిక్షను జీవితఖైదుగా మార్చలేమని గతేడాది మే నెలలో తేల్చిచెప్పింది. అయితే, అతడి క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.

ప్రచారానికి తెర

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికలకు అంతా సిద్ధం

ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. నవంబరు 20న మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు జార్ఖండ్‌లో రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. 288 స్థానాలకుగాను మొత్తం 4,136 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అందుకే 1,00,186 పోలింగ్‌ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ఎదురు దెబ్బ తగలడం… ఎంవీఏ కూటమి పుంజుకున్న నేపథ్యంలో మహారాష్ట్రలో అధికార, విపక్ష కూటములు ఈసారి హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నెలబెట్టింది. విపక్ష కూటమి మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) లో కాంగ్రెస్‌, ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన (యూబీటీ) శరద్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఉన్నాయి. కాంగ్రెస్‌ 101 మంది అభ్యర్థులను బరిలో నిలపగా… శివసేన (యూబీటీ)95 మందిని, ఎన్సీపీ (ఎస్పీ) 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటు కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా, ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.
జార్ఖండ్‌లో…
జార్ఖండ్‌లోని 38 నియోజకవర్గాల్లో వవంబరు 20న పోలింగ్‌ జరగనుంది. 38 నియోజకవర్గాల్లో 522 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్‌కు ఈసీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ని కలు జరగనున్న దృష్ట్యా భారీగా బలగా లను మోహరిస్తోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉండగా… వాటిలో తొలి విడతలో ఈనెల 13న 43 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 43 స్థానాలకు 683 మంది అభ్యర్థులు పోటీపడగా… 66.18 శాతం పోలింగ్‌ నమోదైంది. జార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘట్‌ బంధన్‌గా పోటీ చేస్తుండగా, బీజేపీ, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌, జేడీయూ, లోక్‌జన్‌ శక్తి రామ్‌ విలాస్‌ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి.

కార్పొరేట్ల అమానవీయత

0

గినీ జార్జి

పనిచేసే చోట విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కార్పొరేట్‌ యజమానులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. 26ఏళ్ల యువతి అన్నా సెబాస్టియిన్‌ పెరయిల్‌ పనిఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ విషయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. తోటి పనివాళ్లు, ఉద్యోగులు తీవ్రంగా స్పందించారు. అన్నా సెబాస్టియిన్‌ పెరయిల్‌ సీఏ పరీక్షలు 2023లో పాస్‌ అయిన తర్వాత ఉద్యోగం కోసం వెదికారు. ఆమె డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. 2024 మార్చిలో ఈవై ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరారు. నాలుగునెలలపాటు ఉద్యోగం చేసిన తర్వాత జులై 20న ఫ్యాక్టరీలో పనిచేసిన అనంతరం ఇంటికి తిరిగివచ్చారు. అయితే ఆలస్యంగా ఇంటికివచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. అన్నా తల్లి అగస్టిన్‌ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా(ఈవై) చైర్మన్‌కి ఒక లేఖ రాశారు. మితిమీరిన పనితో తీవ్ర ఒత్తిడికిగురై తన కుమార్తె చనిపోయారని సంస్థ నుంచి కనీసం ఒక్కరు కూడా అన్నా అంత్యక్రియలకు హాజరు కాలేదని ఆ లేఖలో నిరసన తెలియజేశారు. ఆ లేఖ వైరల్‌ అయింది. కార్మికులలో, ప్రజలలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
ఈ విధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పెద్దగా పట్టించుకోకపోవడం అనే సంస్కృతిని పెట్టుబడిదారులు చిరకాలంగా పెంపొందించారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పెద్దగా ఆందోళన ఏమీ జరగకుండా నియంత్రించడం, తక్కిన కార్మికులను, ఉద్యోగులను బెదిరించడం పెట్టుబడిదారులకు బాగా అలవాటైంది. పనిగంటలను పెంచి ఒత్తిడికి గురిచేయడమనేది సర్వసాధారణమైనది. ఇలాంటి పరిస్థితులను కల్పించడం ఏ మాత్రం సరైన విధానం కాదు. అయినప్పటికీ యాజమాన్యం అదనంగా కొన్ని గంటలు పనిచేయించడానికి వెనుకాడడంలేదు. నిర్ణీత గడువు లోపల ఇంటికి వెళ్లడానికి ఆటంకాలు కల్పిస్తారు. ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం కోసం ఉన్నతస్థాయి యాజమాన్యం కావాలనే మధ్య, దిగువ మేనేజిమెంటు సిబ్బందికి స్వేచ్ఛనిస్తారు. ఏ విధంగానైనా లక్ష్యం నెరవేరేట్లు చేయాలని ఆజ్ఞాపిస్తారు. పనిచేసేచోట దుష్ప్రవర్తన, హింసించడం వంటి చర్యలకు పాల్పడతారు. ఇవన్నీ లోలోపల అణిగిపోయేట్లు చూస్తారు. వీటిని పరిశీలించే అధికారులకు తెలియకుండా జాగ్రత్తపడతారు. ఇటీవల ఎకనామిక్‌ టైమ్స్‌లో వాణిజ్య బాధ్యత, సుస్థిరతపైన సమాచారాన్ని ప్రచురించారు. 1062 లిస్టెడ్‌ కంపెనీలకు 940 కంపెనీలు తమ ఉద్యోగులలో అనారోగ్యం, అభద్రత ఏమీలేవని ప్రకటించాయి. అయితే తమకు జరుగుతున్న ఇబ్బందులను, కలుగుతున్న అసౌకర్యాలను ఉద్యోగులు బైటకు చెప్పడంలేదని నిపుణులు తెలియజేశారు. అంతేకాదు, కంపెనీలలో జరిగే వాటి విషయంలో ఏ మాత్రం పారదర్శకత ఉండదు. ఈ విషయాలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తాయి. పని ప్రదేశాలలో ఒత్తిడి, ఆందోళన ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. లేఆఫ్‌లు, కార్మికుల పట్ల సానుభూతి ఉండటంలేదనేది ఆందోళన. పనిగంటల అక్రమాలు, పని సమతుల్యత లేకపోవడం, కులం, ప్రాంతం, మతం లాంటి వివక్షత, మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడం తదితర ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి.
లేఆఫ్‌ల భయం:
గత రెండు సంవత్సరాల కాలంలో లక్షన్నరమంది ఉద్యోగులు లే ఆఫ్‌లను ఎదుర్కొన్నారు. అనేక పత్రికల్లో ఈ సమాచారం ప్రచురణ అయింది. దేశంలోఉన్న ఉద్యోగ ధోరణులు పత్రికా వ్యాసాలలో వస్తూనే ఉన్నాయి. నిర్దిష్టమైన పరిశ్రమలలో పరిస్థితి వెల్లడికావడం, ప్రభుత్వ కార్మిక గణాంకాల ద్వారా లేఆఫ్‌ల పరిస్థితి తెలుస్తుంది. లేఆఫ్‌లకు ఆందోళన చెందుతూ అన్ని ఇబ్బందులను సర్దుకుపోతూ ఉన్నారు. వివిధ ఫ్యాక్టరీలు, కంపెనీలలో అక్రమ కార్యకలాపాలను బైటకు పొక్కకుండా కార్మికులు చూడకపోతే చాలా ఎక్కువగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నారు. ఫ్యాక్టరీలలో యూనియన్లు ఏర్పాటుకాకుండా యాజమాన్యం రకరకాల ఎత్తుగడలు వేస్తాయి. కొంతమంది కార్మికులను తొలగించినప్పటికీ ఇతర కార్మికులు ఏమాత్రం సానుభూతిని తెలియజేయడంలేదు. అందుకు యాజమాన్యం ఆటంకపరుస్తుంది. యాజమాన్యం తీసుకున్న ఇలాంటి చర్యలను నిలిపివేయడానికి కార్మికులు ఉమ్మడిగా ఆందోళనచేయడం లేదా ఇతర విధాలైన చర్యలు చేపట్టడానికి ముందుకు రావడంలేదు. అంతేకాదు, సమతుల్యమైన కార్మిక జీవనం, ఉద్యోగుల సంక్షేమం లాంటివి యాజమాన్యం పట్టించుకోదు. ప్రతి కార్మికుడు ఇతర కార్మికుల పట్ల సంఫీుభావం తెలియజేయడానికి కూడా రకరకాల ఆటంకాలు కల్పిస్తారు.
ఎనిమిది గంటల పని:
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 8గంటల పని విధానాన్ని నిర్ణయించారు. వారానికి 40గంటల పనిదినాలుగా నిర్ధారించారు. ఇది చట్టబద్దమైన నిర్ణయం. రోజులో ఎనిమిదిగంటల పని, మరో ఎనిమిది గంటల విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించారు. అయితే ప్రస్తుతం పెట్టుబడిదారులు కార్పొరేట్ల అనుకూల నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టాలను మార్పు చేస్తోంది. రోజులో కనీసం 9గంటల నుంచి 12 గంటల వరకు పనిచేయాలని వారంలో 45గంటలు పనిచేయాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన కార్మిక చట్టాలను సవరించారు. కులం, ప్రాంతం, మతం, వివక్ష దేశంలో చాలా ఎక్కువగా ఉంది. కులం అనేది పనిప్రదేశాల్లో అత్యధికంగా కనిపిస్త్తోంది. అణగారిన వర్గాల కార్మికుల పట్ల వివక్ష గాఢంగా ఉంది. వీరికి అవకాశాలు తగ్గుతాయి. అంతేకాదు, పనిచేసేచోట వీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. ఎక్కువగా ప్రయోజనంలేని ప్రాంతాల కార్మికులు సైతం వివక్షను ఎదుర్కోవలసివస్తుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా మానసిక ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. కులం, ప్రాంతం ఆధారంగా ఉండే కార్మికులు సమైక్యంగా ఉండరు. తరచుగా విభేదాలను ఎదుర్కొంటారు. భారతదేశంలో భిన్నమైన వర్గాలకు చెందిన ప్రజలలో ఇప్పటికీ మతం తదితరవాటి ఆధారంగా వివక్ష పెరుగుతోంది.
భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై బహిరంగంగా చర్చించడానికి వెనుకాడతారు. ఒత్తిడి, మానసిక ఆందోళన ఉన్నప్పటికీ వాటిని బైటపెట్టరు. మానసిక అనారోగ్యంపై సమాజంలో అదొక రుగ్మతగా గుసగుసలాడుతుంటారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారాన్నికూడా చూపలేరు. కులం, ప్రాంతం, మతం లాంటివాటిని తొలగించడానికి ప్రభుత్వం ఇంతవరకు గణనీయమైన చర్యలను చేపట్టనేలేదు.

సేవ్‌ ది హౌజ్‌

0

చింతపట్ల సుదర్శన్‌

అరుగు మీద మంచి నిద్రలో ఉన్న డాగీకి మనుషుల అలికిడి వినిపించి మెలకువ వచ్చింది. ఈ డాంకీ ఇంకా రాలేదు ఎక్కడ న్యూస్‌ పేపర్లు నవుల్తూ ఉండిపోయిందో అనుకుంటూ ఇంటి లోపలికి తొంగిచూసింది. లోపల ఓ పీచు గడ్డంవాడు, ఓ పిల్లి మీసాలోడూ, ఓ బట్ట గుండోడు ఉన్నారు. ఎవరు వీళ్లు? ఎందుకు ఈ కొంపలోకి జొరబడ్డారు? పెద్దగా అరిస్తే అటునుంచటే పారిపోతారా లేదా దుడ్డుకర్ర ఏదైనా తీసుకుని మీదికి వస్తారా? చూస్తే ‘అన్‌ సోషల్‌ ఎలిమెంట్స్‌’ లాగున్నారు. ఎందుకైనా మంచిది డాంకీ వచ్చేదాకా ఆగుదాం అనుకున్న డాగీకి అరుగు ఎక్కుతున్న డాంకీ కనిపించింది. వచ్చావా! వందేళ్లు నీకు అందామనుకుంది కాని అది అత్యాశపరులైన మనుషులకే కాని తమకు కాదుకదా అని గుర్తొచ్చి, రారా డాంకీ భాయ్‌ నీ కోసమే వెయిటింగిక్కడ అంది. ఏమిటి సంగతి ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే తప్ప గుర్తు చెయ్యవు కదా నన్ను, పైగా వెయిటింగు కూడానా? అంది డాంకీ. పంచ్‌లు పంచుకునే టైం కాదిది. ఎమర్జెన్సీ! లోపల ముగ్గురు మనుషులున్నారు. ముగ్గురా? ముగ్గురు మూర్ఖులా, ముగ్గురు బైరాగులా, మాయల మరాటీలా లేక ఊళ్లల్లోకి వచ్చి ‘రీల్సు’ చేస్తున్న అఘోరాలా? అంది డాంకీ గోడకు వీపు ఆనించి ‘సిట్టింగ్‌’ వెయ్యబోతూ. ప్రతిదీ ‘లైట్‌’ తీసుకోడం అంత మంచిది కాదు. లోపల ముగ్గురు దొంగనాయాళ్లున్నారు. మన ఈ కూలిన కొంప మన స్వంతం. మన కొంపలోకి వచ్చిన పరాయి ముష్కరులను చూస్తూ ఊరుకుందామా? ఏమైనా చేద్దామా? ఐసీ! మ్యాటర్‌ సీరియస్‌ అన్నమాట. ఇంతకీ లోపల ఏం చేస్తున్నట్టు వాళ్లు పేకాడుతున్నారా? గంజాయి, దమ్ము కొడుతున్నారా? మెళ్లల్లో కండువాలు ఉన్నయా? ఏ పార్టీ కార్యకర్తలో గమనించావా? అంది డాంకీ. సరిగ్గా చూడలేదు కానీ, అన్ని పార్టీల్లోనూ కార్యకర్తలుగా ఇలాంటి వారే కనబడతారు. ప్రజాస్వామ్యాన్ని పీచుగడ్డంవాళ్లూ, పిల్లి మీసాల వాళ్లూ, బట్ట గుండోళ్లే కద కాపాడాల్సింది. వీళ్లు కాక ప్రభుత్వ అధికారుల మీద రాళ్లు రువ్వగలిగిన వాళ్లు, కార్లు ధ్వంసం చేయగలిగిన వాళ్లు ఎవరుంటారు చెప్పు. ఇక వీళ్లు ఏం చేస్తున్నారో చూసి చెప్తా అంది డాగీ లోపలికి దృష్టి సారించి. చూడకుండానే నేను చెప్పనా ఇక్కడెక్కడో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఓటుకు ఇంత అని అమ్ముకుని ఆ డబ్బుతో మందు తెచ్చుకుని ‘మజా’ చేసుకుంటున్నారు అంతేకదా! ఎగ్జాట్లీ ఎలా చెప్పగలిగావు అంది డాగీ. ఏముంది! ప్రజాస్వామ్యం ఇప్పుడు సూపర్‌ మార్కెట్‌ సరుకు అయింది కదా. వేలు మీద చుక్క పెట్టించుకోవడం అనే పెట్టుబడి కాని పెట్టుబడితో డబ్బు సంపాదిస్తున్నారు ఓటర్లు. ఎలాగూ గెలిచినవాడు ఊడబొడిచేది ఏమీ ఉండదని, ఓడినవాడు, గెలిచినవాడు ఒకళ్లనొకళ్లు బూతులు తిట్టుకుంటూ మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా, కాలక్షేపం చేస్తారని తెలిసిందే కద అంది డాంకీ. కాలక్షేపం, దుష్ప్రచారం సరే గెలిచిన వారయితే ప్రజల నెత్తిన ‘అప్పు తట్ట’ బోర్లించి రాజ భోగాలయితే అనుభవిస్తారు కదా! అనుభవిస్తారు కానయితే అవి రాజభోగాలు కావు మంత్రి భోగాలు, ఎంపీ, ఎంఎల్‌ఏ భోగాలే. సొమ్మొకడిది సోకొకడిది అనే కదా అంది డాంకీ.
ఓటుకు నోటూ, మందూ పుచ్చుకునే వాళ్లు కొందరయితే, క్యూల్లో నిలబడి, చెమటోడ్చి ఓటు వెయ్యడం అవసరమా అనుకునే వాళ్లు కొందరు. ప్రజల్ని మతం పేరా, కులం పేరా విభజించి, విడదీసి వీరంగం ఆడేస్తున్నారు నాయకులు అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. వచ్చావా బ్రో! రారా! ఇక్కడ ఓ పెద్ద సమస్య వచ్చిపడిరది అంది డాగీ. సమస్యా! అది లేకుండా భూ ప్రపంచమే ఉండదులే! మణిపూర్‌ సమస్య మళ్లీ భగ్గుమన్నది. పాపం మూడేళ్ల పసివాడి తల, చేతులు నరికేశారుట, వాడి కుటుంబం మొత్తాన్ని శవాలుగా మార్చేర్ట. అయినా ఆనాడూ ఈనాడూ చీమ కుట్టనే లేదు మన సర్కారును. అన్ని సమస్యల్నీ ‘లైట్‌’ గా తీసుకోడం అలవాటయ్యి, నాన్చడం అలవాటయ్యి, రైతుల సమస్యలయితేనేం, జాతుల సమస్యలయితేనేం, పహిల్వాన్ల సమస్యలయితేనేం అన్ని సమస్యలనీ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండడమే దేశభక్తి అంటున్నారు. సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుందని నమ్మే ఆధ్యాత్మికవేత్తల దేశం మనది మరి అన్నాడబ్బాయి.
దేశం సంగతి నాయకులకు వదిలేద్దాం. దేశాన్నీ, ప్రజల్నీ తాకట్టు పెడతారో, అమ్ముకుంటారో, ప్రజాస్వామ్యం పీకి పిసికేస్తారో వాళ్లకీ, ప్రజలకీ వదిలేద్దాం. ప్రస్తుతం మన ఈ కూలిన గూడును కాపాడుకోవటం, మన తక్షణ కర్తవ్యం అంది డాగీ. అవును. ఈ గంజాయి దమ్ముగాళ్లని తక్షణం తరిమేయకపోతే ఈ చోటును తమ ‘అడ్డా’ గా మార్చుకునే ప్రమాదం ఉంది అంది డాంకీ. అయితే ‘సేవ్‌ ది హౌజ్‌’ మిషన్‌ ప్రారంభించండి. నేను కనపడకుండా వాళ్ల మీద రాళ్ల దాడి చేస్తాను. డాగీ నువ్వు దిక్కులు పిక్కటిల్లేట్టు అరుపు లంకించుకో. వాళ్లిటు వైపు వస్తే, డాంకీ వెనక కాళ్లతో అటకాయిస్తుంది. దొరికితే నుద్దూ ‘పిక్కలు’ వదలకు. రెడీ ‘ఒన్‌ టూ త్రీ’ చెప్పాడు అబ్బాయి.
ఉరేయ్‌ ఈ కుక్క నా పిక్క పట్టిందిరోయ్‌ అని పీచు గడ్డంవాడు, నా తల పగిలిందిరోయ్‌ అని పిల్లి మీసాలోడు, నా నడుం విరిగిందిరోయ్‌ అని బట్ట గుండోడు అరుస్తూ, అరుగు మీది నుంచి కిందికి దొర్లి పారిపోయేరు. సొతంత్రం స్వర్గలోకం అన్నారు. కూలిన కొంపయితేనేం మన కొంపను మనం రక్షించుకోవాలి అంది డాగీ. నా వెనుక కాళ్ల సత్తువ పరీక్షించుకునే ఛాన్సు దక్కింది నాకు అంది డాంకీ. అరుగు దిగి వెళ్లిపోయేడు అబ్బాయి.

మండుతున్న మణిపూర్‌నిశ్చేష్టంగా మోదీ

గత గురువారం నుంచి మణిపూర్‌ మళ్లీ భగ్గుమంటోంది. హింసకు దిగినవారిని కట్టడి చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 50 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను పంపింది. దీనితో మణిపూర్‌లో నియోగించిన కేంద్ర సాయుధ పోలీసుదళాల సంఖ్య అయిదువేలకు చేరింది. సోమవారం నాటికి హింసాత్మక సంఘటనలు మరింత పెచ్చరిల్లాయి. మెయితీ వర్గానికి చెందిన రెండేళ్ల బాలుడి తల లేని మొండెం, ఆ బాలుడి నాయనమ్మ అర్థ నగ్న మృతదేహం బరాక్‌ నదిలో తేలుతూ కనిపించాయి. మెయితీలు, కుకీల మధ్య ఘర్షణల్లో మరో ఆరుగురు మరణించారంటున్నారు. భద్రతా దళాలకు కుకీ ఆందోళన కారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పరిస్థితి విషమించిన తరవాత మణిపూర్‌లోని చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేశారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యా సంస్థలను మంగళవారం దాకా మూసేశారు. ఈ లోగా మణిపూర్‌లో అధికారంలో ఉన్న ఎన్‌.డి.ఎ. ప్రభుత్వానికి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ నాయకుడు కోన్రాడ్‌ సంగ్మా మద్దతు ఉపసంహరించారు. అయితే ఎన్‌.డి.ఎ. ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేదు. మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అసమర్థత, తన బాధ్యతను పూర్తిగా విస్మరించిన మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనత వల్ల గత 19 నెలలుగా మణిపూర్‌ అగ్నిగుండంగా మారింది. మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి మోదీ సర్కారు ఇంతవరకు చేసింది ఏమీలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉదాహరణ ప్రాయంగా ఒక్కసారి మణిపూర్‌ వెళ్లివచ్చారు. కానీ ఆయన ఘర్షణ పడ్తున్న మెయితీ, కుకీల ప్రతినిధులతోగానీ, సామాన్య ప్రజలతోగానీ సంప్రదింపులు జరపనేలేదు. కనీసం బాధితులను పరామర్శించిన పాపాన కూడా పోలేెదు. అతిథిగృహంలో కూర్చుని కొంతమంది ఉన్నతాధికారులను పిలిపించి పరిస్థితిని సమీక్షించాననిపించుకుని దిల్లీ వెళ్లిపోయారు. ప్రధానమంత్రి మోదీ అయితే దేశదేశాలూ తిరుగుతున్నారు కానీ 2023 మే మూడు నుంచి మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా ఆ రాష్ట్రాన్ని సందర్శించాలన్న ఆలోచనే ఆయనకు రాలేదు. ఈ లోగా డజన్ల కొద్దీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అనేక విదేశీయాత్రలు చేసి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన విదేశీ యాత్రల్లోనే ఉన్నారు. మణిపూర్‌లో అంటుకున్న అగ్గిని ఆర్పేయడానికి మోదీ చేసిందేమీ లేకపోయినా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నిలిపివేయిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న అమిత్‌ షా మణిపూర్‌లో పరిస్థితి విషమించిందని తెలిసి ప్రచారం మధ్యలోనే నిలిపివేసి దిల్లీ పరుగెత్తారు. అక్కడా ఆయన చేసిందల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించడమే. హింస చెలరేగుతున్న ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేయడానికి అమిత్‌ షా కూడా చేసింది, చేస్తున్నది ఏమీలేదు. మణిపూర్‌ మండిపోతుంటే ఇంత ఘోరంగా నిష్క్రియాపరత్వం ప్రదర్శించడం మోదీకి, అమిత్‌ షాకే చెల్లింది. అక్కడి గవర్నర్‌ హింస చెలరేగిన వెంటనే పరిస్థితిని కట్టడి చేయాలని అమిత్‌ షాకే కాక రాష్ట్రపతికి కూడా మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను తొలగించాలని ఎంతమంది చెప్తున్నా మోదీ ప్రభుత్వ చెవికెక్కడం లేదు.
డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉంటే ఏ రాష్ట్రమైనా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని, శాంతి భద్రతలు సుస్థిరంగా ఉంటాయని ఊదరగొడ్తున్న మోదీ ప్రభుత్వం మణిపూర్‌ను మాత్రం పట్టించుకోవడంలేదు. నిజానికి అక్కడ అధికారం సంపాదించడానికి మెయితీ, కుకీ జాతుల మధ్య తంపులు పెట్టిందే మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం. జాతి కలహాలు ఇప్పుడు అక్కడ పెద్ద భూతంలా తయారయ్యాయి. గత 19 నెలల కాలంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది మహిళలమీద అత్యాచారాలు జరిగాయి. మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఇదంతా ఏదో పరాయి దేశంలోనో, మనకు సంబంధంలేని వ్యవహారంగానో మాత్రమే మోదీ సర్కారు భావిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించడానికి లేదా రాజకీయ పరిష్కారం కనుగొనడానికి కానీ చేసిందేమీలేదు. భిన్న జాతుల వారి మధ్య విద్వేషంనింపి అధికారం మాత్రం సంపాదించింది. సామాజిక-రాజకీయ విభేదాలకు ఆజ్యం పోసింది. మణిపూర్‌లో కొనసాగుతున్న విధ్వంసం మునుపెన్నడూ లేనిదని, ఈ చిచ్చును చల్లార్చడానికి రాజకీయ, పరిపాలనాపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు చెవిని ఇల్లుకట్టుకుని చెప్తున్నా మోదీ ప్రభుత్వంలో చలనంలేదు. మెయితీ మద్దతుదార్లు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం పెడ్తున్నారు. కర్ఫ్యూ ఉల్లంఘించి మెయితీ ఉద్యమకారులు ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. సోమవారం నాటికి బయటపడ్డ ఏడు మృతదేహాలు కూడా అంతకు ముందు కుకీలు అపహరించుకువెళ్లిన వారివేనంటున్నారు. ఇంఫాల్‌ లోయలోని అయిదు జిల్లాల్లో మెయితీల ప్రభావం ఎక్కువ. ఆందోళనకారులు ఎన్నికల అధికారి కార్యాలయాన్ని కూడా ఆక్రమించారు. ఇంటర్నెట్‌ సదుపాయం నిలిపివేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న ప్రభుత్వ ఆలోచన కేవలం భ్రమే. దీనివల్ల అందవలసిన సమాచారం అందకుండా పోతోంది. ఇది అదనపు సమస్యలకు దారి తీస్తోంది. మణిపూర్‌లో హింసాకాండ చెలరేగుతుంటేనే బీజేపీకి ప్రయోజనం అన్న ఆరోపణలూ వస్తున్నాయి. కనీసం వీటిని ఖండిరచడానికైనా మోదీ ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదు. మణిపూర్‌లోని వివిధ పక్షాలతో సంప్రదించాలని, ఆ తరవాత దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఏం జరుగుతోందో వివరించి పరిస్థితి అదుపు చేయడానికి ఏం చేయాలో నిర్ణయించాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నవంబర్‌ 25న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే లోగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే పరిస్థితి సానుకూలంగా మారుతుంది. ఈ సూచననూ మోదీ సర్కారు ఖాతరు చేయడంలేదు. ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా విమర్శిస్తాయి. కానీ మణిపూర్‌లో అసమర్థ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను తొలగించి రాష్ట్రపతి పాలన విధిóంచాలని ప్రతిపక్షాలు కోరుతున్నా మోదీ ప్రభుత్వం మౌనమే సమాధానం అన్నట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిందల్లా పౌరుల మీద జరిగిన మూడు కేసుల దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడమే. కేంద్రం తీసుకున్న మరో చర్య ఏమిటంటే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎ.ఎఫ్‌.ఎస్‌.పి.ఎ.) మళ్లీ అమలు చేయడమే. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. శనివారం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ చెందిన ఇంటిమీద కూడా దాడి చేశారు. ఒక ఎమ్మెల్యే అయితే తన ఇంటి చుట్టూ బంకర్లు నిర్మించుకు కూర్చున్నారు. తీవ్ర దాడులు ఎదుర్కుంటున్న మెయితీలు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది.

కార్పెంటర్స్, పెయింటర్స్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం.. నూతన కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం:: కార్పెంటర్స్ అండ్ పెయింటర్స్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యము అని నూతన కమిటీ వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పెంటర్స్, పెయింటర్స్ యూనియన్ పెద్దలను కలిసి సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో సమస్యలపై తీవ్రంగా చర్చించి సమస్యల పరిష్కారానికి ఐక్యమత్యంతోనే మార్గం సుగమం అవుతుందని తెలిపారు. తదుపరి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో కార్పెంటర్ అధ్యక్షులుగా కే. శివ, ప్రధాన కార్యదర్శిగా కే.నంజుండ చారి, పెయింటర్ అధ్యక్షుడుగా గడ్డం రాజు, కోశాధికారిగా సాయిరాజును ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ఏ సమస్య అయినా ఎదురైనప్పుడు కలిసికట్టుగా చర్చించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్మయంతో, ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.

వ్యాసరచన పోటీలో ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థికి ప్రథమ బహుమతి

విశాలాంధ్ర ధర్మవరం : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 99 వ జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా పట్టణంలోని కాగితాల వీధిలో గల శ్రీ ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇటీవల నిర్వహించడం జరిగింది. పట్టణంలోని 24 పాఠశాలల నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐదు జూనియర్ కళాశాల నుండి నూరు మంది రెండు డిగ్రీ కళాశాల నుండి 35 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయిలో ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుండి టి మమతారెడ్డి ప్రథమ బహుమతిని గెలుపొందడం జరిగిందని జిల్లా జాయింట్ బాలవికాస్ కోఆర్డినేటర్ కరణం ఆదిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ కళాశాల నుండి షేక్ పర్వీన్ తాజ్ ద్వితీయ బహుమతిని, పద్మావతి డిగ్రీ కళాశాల నుండి టీ. అర్సియా ద్వితీయ బహుమతిని గెలుపొందడం జరిగిందని తెలిపారు. త్వరలో వీరందరికీ పుట్టపర్తిలో బహుమతులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి తో పాటు శ్రీ సత్యసాయి సేవా సమితి తరపున జాయింట్ కన్వీనర్ శేషాచారి,కన్వీనర్ నామ ప్రసాద్, జనార్ధన్, ప్రధమ, ద్వితీయ పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.