ట్రంప్ హెచ్చరికల ప్రభావం…
న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా పెట్టిన గడువు నేటితో ముగిసింది. నౌకల రాకపోకలకు వీలుగా హోర్మూజ్‌ని తెరవకపోతే ఇరాన్‌లో వంతెనలు, విద్యుదుత్పత్తి కర్మాగారాలను నామరూపాల్లేకుండా చేస్తామని బెదిరించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ఆందోళనల నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి. ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ జూన్ కాంట్రాక్ట్ 110.58 డాలర్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 1.42 శాతం మేర అధికం. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ మే కాంట్రాక్ట్ 111.90 డాలర్లకు ఎగబాకింది. అయితే… మే నెలలో చమురు ఉత్పత్తిని పెంచుతామని ఒపెక్ ప్లస్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. మార్కెట్లో చమురు ధరల స్థిరత్వం కోసం ఈ చర్యలని పేర్కొన్నాయి.
నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు…
సోమవారం దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 366 పాయింట్లు నష్టపోయి, 72,953 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి, 22,624 వద్ద ఊగిసలాడుతోంది. నిఫ్టీ సూచీలో ట్రెంట్, హిందాల్కో, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్, సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా, మ్యాక్స్ హెల్త్‌కేర్, అదానీ పోర్ట్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అటు ట్రంప్ ప్రకటనలు, ఇటు ఒపెక్ ప్లస్ దేశాల నిర్ణయం సూచీలపై ప్రభావం చూపిస్తోంది.


