ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా తాజాగా సౌదీ అరేబియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో (Saudi Aramco) రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. రాస్ తనురాలోని ఈ కీలక ప్లాంట్‌పై ఇరాన్ తన శక్తివంతమైన షాహెద్-136 డ్రోన్లతో దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
భారీగా చెలరేగిన మంటలు – నిలిచిన ఉత్పత్తి: ఈ డ్రోన్ దాడి కారణంగా రిఫైనరీ వద్ద పెను ప్రమాదం సంభవించింది. చమురు నిల్వలు ఉన్న ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, జరిగిన ఆస్తి మరియు ప్రాణనష్టంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు 10 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్లు దాటింది. ఇప్పుడు తాజా దాడులతో ఈ ధర మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


