అభిమానులకు సెలబ్రిటీ జంట ప్రత్యేకంగా మెసేజ్!
తెలుగు చిత్రసీమలో అత్యంత క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (విరోష్) ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా, మంచు కొండల సాక్షిగా వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు ,కొడవ (రష్మిక స్వస్థలం) సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్‌పై పడింది. అయితే, ఇంతటి భారీ వేడుక నేపథ్యంలో ఈ జంట ఒక కీలకమైన మరియు కఠినమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా స్టార్ హీరోల పెళ్లి వేడుకలంటే అభిమానులు వేల సంఖ్యలో తరలిరావడం సహజం. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో విజయ్-రష్మిక దంపతులు ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు.ఈ రిసెప్షన్ కేవలం ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే, ఇన్విటేషన్ లేని వారు దయచేసి వేదిక వద్దకు రావొద్దని ప్రత్యేకంగా మెసేజ్ చేసింది. ఈ నిర్ణయం వెనుక అభిమానుల పట్ల ఉన్న బాధ్యత కూడా కనిపిస్తోంది. వేల సంఖ్యలో జనం గుమికూడితే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని, అలాగే తాజ్ కృష్ణ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించి సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని ముందస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. రిసెప్షన్ రోజున హోటల్ పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఉండబోతోంది. గేట్ల వద్ద ఇన్విటేషన్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఎటువంటి మినహాయింపులు ఉండవని మేనేజ్‌మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది.


