దొంగలు కూడా ట్రెండు మారుస్తున్నారు.. నిన్నామొన్నటి దాకా బంగారం. వెండిపై కన్నేసిన దొంగలు.. ఇప్పుడు గ్యాస్ బండపై కన్నేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు దొంగిలిస్తున్నారు. మన పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడులో ఇప్పటికే ఇలాంటి చోరీలు జరగ్గా.. తాజాగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోనే గ్యాస్ సిలిండర్ చోరీ జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ ఇంటి ఆవరణలోకి రాత్రి సమయంలో ప్రవేశించిన దొంగలు.. కాంపౌండ్‌లో పెట్టిన గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిపోయారు. ఇంట్లోని వ్యక్తులు ఇంటికి తాళం వేసి పనిమీద బయటకు వెళ్లారు. అయితే ఇంటి కాంపౌండ్ లోపల గ్యాస్ సిలిండర్ అలాగే ఉండిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన దొంగలు.. గ్యాస్ సిలిండర్ చోరీ చేశారు.
గ్యాస్ సిలిండర్లకు ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉందో తెలిసిన సంగతే. ప్రభుత్వాలు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ..గ్యాస్ సిలిండర్ బుకింగ్ జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ చేస్తే లైన్ కలవకపోవటం, కలిసినా గ్యాస్ బుక్ కాకపోవటం, ఓటీపీ రాకపోవటం వంటి సమస్యలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొంతమంది గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. మరికొందరు మీసేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
అయితే వినియోగదారులు ఆందోళనకు గురికావద్దని అధికారులు కోరుతున్నారు. గ్యాస్ సిలిండర్లు దొరకవనే ఆందోళనతో ఎక్కువ మంది వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తూ ఉండటంతో సర్వర్ బిజీగా ఉంటోందన్నారు. ఫలితంగానే బుకింగ్‌కు సంబంధించిన సందేశాలు రావడం లేదని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ జరిగి 25 రోజులు పూర్తైతే.. ఏజెన్సీల వద్దకు వెళ్లే ఆన్‌లైన్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.


