మహా కుంభమేళాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్తే ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్‌ని వివాహం చేసుకోవడంతో వివాదం నెలకొంది. ఈ వివాహంపై కొందరు ‘‘లవ్ జిహాద్‘‘ ఆరోపణలు చేయడంతో వివాదం మరింత వేడెక్కింది. ముఖ్యంగా మోనాలిసాను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పెళ్లి ప్రేమతో జరిగినది కాదని, ‘‘లవ్ జిహాద్ లో భాగమని ఆయన ఆరోపించారు. మోనాలిసాను తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకువచ్చానని, ఆమె జీవితాన్ని మార్చేందుకు ఎంతో కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే ఈ వివాహంపై మోనాలిసా తండ్రి జైసింగ్ భోస్లే సంచలన ఆరోపణలు చేయడం మరోసారి చర్చకు దారి తీసింది. తన కుమార్తె ‘‘లవ్ జిహాద్ కు గురైందని ఆయన ఆరోపించారు. తన కుమార్తెను మోసపూరితంగా ప్రేమలో పడేసి వివాహం చేసుకున్నారని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, తన కుమార్తెను సురక్షితంగా తిరిగి మధ్యప్రదేశ్‌కు తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ని కోరినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తన కుమార్తె జీవితాన్ని మోసం చేసి దెబ్బతీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


