-శ్రీ శ్రీ శ్రీ విజయానంద తీర్థ స్వామీజీ
విశాలాంధ్ర-రాప్తాడు : సమాజంలో ఇతరుల పట్ల సేవాగుణం అలవర్చుకున్న ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులేనని, దత్త పీఠం ఆధ్వర్యంలో రాష్ట్ర, దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాలతో ప్రతి ఒక్క ప్రాంతంలో విద్యా, వైద్య ఇతర రంగాల పట్ల శ్రద్ధ చూపుతున్నామని మైసూరు దత్త పీఠం శ్రీ విజయానంద తీర్థ స్వామీజీ అన్నారు.
రాప్తాడు మండలంలో జయలక్ష్మిపురం (బొమ్మేపర్తి)లో ఉన్న క్షేత్రంలో శనివారం ఉదయం గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆదేశాల మేరకు ఎం.ఆర్.చంద్రశేఖర్ కృషితో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చెన్నై శంకర్ నేత్రాలయ, శంకర్ నేత్రాలయ యూఎస్ఏ, పుట్టపర్తికి చెందిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ సమన్వయంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తుండగా స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్వామీజీ మాట్లాడుతూ
నిరుపేదలకు, అవసరార్థులకు నిస్వార్థ సేవ అందించే లక్ష్యంతో అధునాతన ఉచిత కంటి వైద్య శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన జయలక్ష్మీపురం ఆశ్రమంలోని ‘శ్రీ జయలక్ష్మి మాత ఉచిత వైద్యశాల’ అనే నూతన ఆసుపత్రి భవనంలో కంటి ఆపరేషన్ల శిబిరం జరుగుతుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల పల్లె ప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులోకి రావాలనే గణపతి సచ్చిదానంద స్వామీజీ భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించడం జరిగిందన్నారు.
గతంలో కూడా ఇక్కడ సుమారు 1,100 మందికి పైగా పరీక్షలు నిర్వహించి, 230 మందికి విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేశారని ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈ రెండో భారీ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 16వ తేదీ నుంచి 25 వరకు జరుగుతున్న ప్రస్తుత శిబిరంలో ఇప్పటి వరకు 470 మందికి పైగా బయటి రోగులు పరీక్షలు నిర్వహించగా సుమారు 95 మంది రోగులకు క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సల కోసం ఎంపిక చేశారన్నారు. కార్యక్రమంలో ప్రత్యక్ష దైవం శిరిడి సాయి సినిమా షిరిడి సాయిబాబా పాత్రధారి మచ్చా రామలింగారెడ్డి స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. జయలక్ష్మిపురం ట్రస్టు సభ్యులు శర్మ, కాశీనాథ్ నాయుడు, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.


