విశాలాంధ్ర – రాజాం : రాజాం పట్టణంలోని చీపురుపల్లి రోడ్డులో గల శ్రీ గురజాడ పాఠశాలలో శుక్రవారం ఫైర్ & సేఫ్టీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజాం అగ్నిమాపక మరియు విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పైలా అశోక్ తో పాటు రాజాం ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాలలు మరియు ఇళ్లలో సంభవించే అగ్నిప్రమాదాల కారణాలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కలిగే ప్రమాదాలు, ఎల్‌పీజీ గ్యాస్ భద్రతా చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, అగ్నిప్రమాద సమయంలో సురక్షితంగా బయటపడే విధానాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.అగ్నిప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో ముఖ్యమని, చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని ఫైర్ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సతీష్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


