కృష్ణానది నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు
కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 2,57,059 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా, శ్రీశైలం జలాశయానికి 2,11,331 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 874.70 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండటానికి మరో 10 అడుగుల మేర నీరు చేరాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 162.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రానున్న రెండు, మూడు రోజుల్లో నీటి నిల్వ 200 టీఎంసీలను దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు జలవిద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 21,189 క్యూసెక్కుల నీటిని వినియోగించి 7.319 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 9,603 క్యూసెక్కుల నీటితో 1.684 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తి అనంతరం 30,792 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు వెలిగోడుకు 4,000 క్యూసెక్కులు విడుదల చేయగా, శనివారం గోరకల్లు జలాశయానికి మరో 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైలానికి పోటెత్తిన వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం
- Advertisement -
RELATED ARTICLES


