విశాలాంధ్ర, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో పిల్లలకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొ.రాహుల్ దేవరాజ్ తెలిపారు.నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ ప్రొ.అమరేశ్వర్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో ఈ ప్రత్యేక శస్త్రచికిత్సలు చేపట్టనున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయి. అవసరాన్ని బట్టి ప్రాధాన్యత కేటాయిస్తూ వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలిస్తారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు.
సంప్రదింపు వివరాలు…
సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు నిమ్స్ లోని సీటీ సర్జరీ కార్యాలయం, మొదటి అంతస్తు, పాత బ్లాక్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్. 040-2348-9025 ఫోన్ నెంబర్ లో సంప్రదించాల్సి ఉంటుంది. గతంలో నిర్వహించిన వైద్య పరీక్షలు, పాత వైద్య నివేదికలు అందుబాటులో ఉంటే తీసుకురాల్సి ఉంటుందని, అర్హత ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండా, నిర్ణీత సమయాల్లో నిమ్స్‌కు నేరుగా వచ్చి సంప్రదించవచ్చని నిమ్స్ డైరెక్టర్ ప్రొ.రాహుల్ దేవరాజ్ తెలిపారు.


