తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజులపై ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని మొత్తం 160 ఇంజినీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజులను ఖరారు చేస్తూ విద్యాశాఖ గురువారం జీవో నంబర్ 6 జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం 33 ఇంజినీరింగ్ కాలేజీలలో ట్యూషన్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండగా,మరో రెండు కళాశాలల్లో ఫీజు రూ.లక్షగా నిర్ణయించారు. ఈ ఫీజులు 2025 నుంచి 2028 వరకు ఉండే బ్లాక్ పీరియడ్‌కు వర్తిస్తాయి. గత బ్లాక్ పీరియడ్‌లో కూడా రూ.లక్షకు పైగా ఫీజు ఉన్న కళాశాలల సంఖ్య 33గానే ఉండటం గమనార్హం. అయితే అప్పట్లో రూ.లక్ష ఫీజు ఉన్న కళాశాలలు 7 ఉండగా, ఈసారి అవి 2కి తగ్గాయి.
కమిటీ సూచనలకు ప్రభుత్వం ఆమోదం.. జీవో జారీ
ఇంజినీరింగ్ కాలేజీలలో అత్యధిక ట్యూషన్ ఫీజు సీబీఐటీకి నిర్ణయించారు. అక్కడ ఫీజు రూ.1.83 లక్షలుగా ఖరారు చేశారు.రూ.1.75 లక్షల ఫీజుతో వాసవి ఇంజినీరింగ్ కాలేజీ రెండో స్థానంలో నిలిచింది.
తెలంగాణ అడ్మిషన్లు మరియు ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) మొత్తం 19 కాలేజీలలో ఇప్పటివరకు ఉన్న ట్యూషన్ ఫీజులను తగ్గించాలని సూచించింది.అంతేకాకుండా మరో 70 కాలేజీలకు ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా కొనసాగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కమిటీ సూచనలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఈ జీవో జారీ చేసింది.ప్రస్తుతం కనీస ట్యూషన్ ఫీజు రూ.45 వేలుగా నిర్ణయించగా, రాష్ట్రంలోని 21 కాలేజీలకు అదే కనీస రుసుమును అమలు చేయనున్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు
ప్రభుత్వం తాజాగా ఖరారు చేసిన ఈ ట్యూషన్ ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం అయిన 2025-26 నుంచే అమల్లోకి వస్తాయి.మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్ అంటే 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్థులకు ఈ ఫీజులు వర్తిస్తాయి.ఒకసారి చేరిన విద్యార్థులు నాలుగేళ్లపాటు అదే ఫీజు నిర్మాణం ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.ఈసారి మొత్తం 19 ఇంజినీరింగ్ కాలేజీలలో ఫీజులను తగ్గించారు. అంటే గత విద్యా సంవత్సరం 2024-25 వరకు అమల్లో ఉన్న ఫీజులపై టీఏఎఫ్‌ఆర్‌సీ కోత విధించింది.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు
గత ఆగస్టులో ఎప్‌సెట్ కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థుల నుంచి పాత ఫీజులనే కాలేజీలు వసూలు చేశాయి.కొత్త ఫీజులు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఒకవేళ ఫీజు తగ్గితే, ఆ తేడా మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని అప్పట్లో సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.ఇప్పుడు 19 కాలేజీలలో ఫీజులు తగ్గిన నేపథ్యంలో, అక్కడ స్వయంగా ఫీజు చెల్లించిన విద్యార్థులకు సంబంధిత కళాశాలలు ఆ వ్యత్యాసాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.


