విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని శ్రీ గవి మఠం సంస్థానంలో( దేవాలయంలో) మంగళవారం శ్రీ గణపతి పూజ, వరుణ జపం, వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకం, పూర్ణాహుతి పూజ కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి పూజతో కార్యక్రమాలను ప్రారంభించి, వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు. అనంతరం సహస్ర ఘటాభిషేకం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి, దేవదాయ శాఖ అధికారిణి రాణి, ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.


