Homeఆంధ్రప్రదేశ్మచిలీపట్నం పోర్టులో జీఎస్‌ఎల్‌ షిప్‌యార్డు.. స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు

మచిలీపట్నం పోర్టులో జీఎస్‌ఎల్‌ షిప్‌యార్డు.. స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు

- Advertisement -

కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టులో నౌకల నిర్మాణం, మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌ (జీఎస్‌ఎల్‌) స్థానికంగా మానవ వనరులను సిద్ధం చేసుకునే పనిపై దృష్టి సారించింది.ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిలో సాధ్యమైనంత ఎక్కువ మందిని స్థానికంగానే నియమించుకోవాలని సంస్థ నిర్ణయించింది.ఇందులో భాగంగా విద్యార్థులకు ముందుగానే నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతోంది.ఈ మేరకు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల పరిధిలోని ఐటీఐలతో జీఎస్‌ఎల్‌ అనుసంధానం కానుంది.విజయవాడలోని ఐటీఐని హబ్‌గా, గుడివాడతో పాటు మరో ఐటీఐని స్పోక్‌ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.హబ్‌ ఏర్పాటుకు ఐదేళ్లలో రూ.80 కోట్లు, స్పోక్‌ సెంటర్లకు రూ.40 కోట్ల చొప్పున ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

మూడు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
ఈ ఐటీఐల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను కూడా నౌకా నిర్మాణ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దనుంది.జీఎస్‌ఎల్‌ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించడంతో పాటు ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేయనుంది.ఈ శిక్షణ ప్రాజెక్టుకు యాంకర్‌ పరిశ్రమగా జీఎస్‌ఎల్‌ వ్యవహరించనుంది. ఈ అంశంపై ఐటీఐలతో సంస్థ త్వరలో ఒప్పందం చేసుకోనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.మచిలీపట్నంలో ఏర్పాటు చేయనున్న షిప్‌ బిల్డింగ్‌ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జీఎస్‌ఎల్‌ తెలిపింది.రాష్ట్రంలోని యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా సంస్థ పేర్కొంది.

మొదటి దశ పూర్తయ్యే నాటికి..
ప్రాజెక్టు మొదటి దశ పూర్తయ్యే సమయానికి అవసరమైన మానవ వనరులు సిద్ధంగా ఉండేలా జీఎస్‌ఎల్‌ ప్రణాళిక రూపొందించింది.రాబోయే రెండేళ్లలోనే శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.ఈ శిక్షణకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని పీఎం సేతు పథకం కింద, 33 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా.. మిగిలిన 17 శాతం మొత్తాన్ని జీఎస్‌ఎల్‌ భరించేందుకు అంగీకరించింది.

మూడేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల వర్క్‌ ఆర్డర్లు!
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన జీఎస్‌ఎల్‌ భారత నౌకాదళం, భారత కోస్ట్‌గార్డ్‌, విదేశీ సంస్థల కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన యుద్ధ నౌకల రూపకల్పన, నిర్మాణంలో కీలకంగా ఉంది.గోవాలోని వాస్కో-డ-గామాలో ఉన్న ప్రధాన షిప్‌యార్డు ద్వారా ప్రస్తుతం సుమారు రూ.16 వేల కోట్ల విలువైన ఆర్డర్లను సంస్థ పొందింది.మరో రూ.18 వేల కోట్ల విలువైన ఆర్డర్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి.రాబోయే మూడేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన వర్క్‌ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని జీఎస్‌ఎల్‌ ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో పేర్కొంది.పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో పాటు ఆధునిక రక్షణ, వాణిజ్య నౌకల నిర్మాణాన్ని సంస్థ చేపడుతోంది.

ఏపీకి మరింత బలోపేతం కానున్న నౌకా నిర్మాణ రంగం
వార్‌షిప్‌లు, పెట్రోలింగ్‌ వెసల్స్‌, ఫాస్ట్‌ ఇంటర్‌సెప్టర్‌ బోట్లు, నేవల్‌ ఆగ్జిలరీ వెసల్స్‌, వాణిజ్య నౌకల నిర్మాణంతో పాటు నౌకల మరమ్మతు సేవలను కూడా జీఎస్‌ఎల్‌ అందిస్తోంది.దేశంలోని ప్రముఖ రక్షణ నౌకా నిర్మాణ సంస్థల్లో ఒకటైన జీఎస్‌ఎల్‌ ప్రాజెక్టు మచిలీపట్నంలో ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్‌లో నౌకా నిర్మాణం, సముద్ర ఆధారిత తయారీ రంగాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.దీనివల్ల సంబంధిత పరిశ్రమలకు, సరఫరా వ్యవస్థ (సప్లై చైన్‌) అభివృద్ధికి కూడా అవకాశాలు ఏర్పడనున్నాయి.

ఐదేళ్లలో దశలవారీగా ప్రాజెక్టు

కృష్ణా జిల్లాలో ప్రతిపాదించిన షిప్‌యార్డు ప్రాజెక్టును ఐదేళ్లలో దశలవారీగా పూర్తి చేయాలని జీఎస్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగా తొలి దశలో రూ.2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ప్రణాళిక రూపొందించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు