లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది.
వర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థినులు తాజాగా విడుదల చేసిన వీడియోలో కీలక ఆరోపణలు చేశారు. యాజమాన్యం తమపై ఒత్తిడి తీసుకొచ్చి,తమకు అనుకూలంగా మాట్లాడేలా వీడియో రికార్డు చేయించిందని వారు పేర్కొన్నారు. ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ ప్రకారమే తాము మాట్లాడామని తెలిపారు.
తమ అనుమతి లేకుండానే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారని విద్యార్థినులు ఆరోపించారు. అయితే వర్సిటీ యాజమాన్యం తొలుత విడుదల చేసిన వీడియోలో.. తమ గదిలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదని,సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న విషయాలు అవాస్తవాలని విద్యార్థినులు పేర్కొన్నట్లు ఉంది. ఈ రెండు వీడియోల నేపథ్యంలో ఘటనపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
10 రోజుల పాటు తరగతులు నిలిపివేత..
ఇదిలా ఉండగా.. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాటి ఈ వ్యవహారంపై స్పందించారు.వర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులను ఆమె ఖండించారు.విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.సెప్టెంబరు 28 నుంచి 10 రోజుల పాటు తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మిడ్ టర్మ్ పరీక్షలను కూడా వాయిదా వేసింది.పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు విద్యార్థులు సహకరించాలని కోరింది.
ప్లంబర్‌పై అత్యాచారం ఆరోపణలతో ఆందోళనలు..
సెలవుల సమయంలో క్యాంపస్‌లోనే ఉండే విద్యార్థులు హాస్టళ్లలోనే ఉండాలని సూచించింది.అత్యవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని, ఆందోళనల్లో పాల్గొనకుండా ఉండాలని స్పష్టం చేసింది.వర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థినిపై ప్లంబర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది.అయితే ఈ ఆరోపణలను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ తీవ్రంగా ఖండించింది. అవి పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.ఈ పరిణామాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు బాలికల హాస్టల్ వద్దకు చేరుకుని నిరసనలు చేపట్టారు.ఆందోళనల సమయంలో వర్సిటీ ఆస్తులు ధ్వంసమైనట్లు సమాచారం. దిల్లీ-అమృత్సర్ రహదారిని దిగ్బంధించిన విద్యార్థులు నినాదాలు చేశారు.ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు క్యాంపస్‌లో భద్రతను పెంచారు. మొత్తం వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వర్సిటీ అధికారులు విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు.


