— జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.కె. విశ్వేశ్వర రెడ్డి
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి; రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్‌కు సమీపంలో ఉన్న రాజమహేంద్రి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో దీపావళిని జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం చెబుతోందని, ఆలోపులోనే రాజమండ్రి నగర కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజవోలు, హుక్కుంపేట ప్రజలు కార్పొరేషన్ ఎన్నికలకు సంబందించి కోర్టుకు వెళ్ళారన్న సాకుతో నగర కార్పొరేషన్ ఎన్నికలు జరపక పోవడం విచారకరమన్నారు. రాబోయే పుష్కరాలకు కోట్లాది రూపాయలు ఒక్కో కార్పొరేషన్ విభాగానికి మంజూరవుతాయని, ఆ నిధులతో ఆయా కార్పొరేట్ నియోజక వర్గాల పరిధిలో అభివృద్ది జరుగుతుందన్నారు. రాజవోలు, హుక్కుంపేట ప్రజలు ఎన్నికలను వ్యతిరేకిస్తే, ఆయా కార్పొరేట్ నియోజక వర్గాలకు రావల్సిన నిధులు రావని, దాంతో అభివృద్ధఙ నిలిచి పోతుందని, అందువల్ల ఎన్నికలు వద్దని కోర్టుకు వెళ్ళిన వారికి ప్రజలే గుణ పాఠం చెబుతారన్నారు. అలాగే, ఆ రెండు కార్పొరేట్ సెగ్మెంట్లను మినహాయించి మిగిలిన కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు జరుపుకోవచ్చన్నారు. కార్పొరేటర్లు లేకుండా కార్పొరేషన్ అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అందువల్ల స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందే నగర కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని, ఈ విషయంపై స్పందించకపోతే కార్పోరేషన్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.


