ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాను ఒంటరిగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరలైంది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వైరల్ పోస్ట్‌పై సల్మాన్ ఖాన్ స్పందించారు. ఆ మెసేజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఆ పోస్ట్‌ను హైలైట్ చేస్తూ పతాక శీర్షికలుగా మార్చడంతో తన తల్లి కంగారుపడిందని అన్నారు. ‘నేను నా గురించి మాట్లాడలేదు. అయినా… ఇంత పెద్ద కుటుంబం, ఎంతోమంది స్నేహితులు ఉన్నప్ప్పుడు నేను ఎలా ఒంటరివాడిని అవుతాను? మీ అందరి ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉంటే నేను ఒక్కడినే అనే భావన నాలో ఎందుకు వస్తుంది. మీరంతా నాతో ఉంటున్పప్ప్పుడు అలా అనుకుంటే నేను కృతజ్ఞత లేనివాడిని అవుతాను. నా కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలనిపించిందంతే. దాన్ని మీరంతా హైలైట్ చేశారు. కనీసం ఫొటో కూడా పెట్టకుండానే మీరు దీన్ని బ్రేకింగ్ న్యూస్ చేసేశారు. మా అమ్మ కూడా నన్ను ‘ఏమైంది నాన్న?’ అని అడుగుతోంది. ప్లీజ్… రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స’ అని సల్మాన్ వివరించారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన షర్ట్‌లెస్ ఫొటోను షేర్ చేస్తూ ఒంటరితనం గురించి ఒక నోట్ రాశారు. అది క్షణాల్లో వైరల్ అయింది.


