Homeజాతీయంఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: 8 గంటల విచారణ.. ఆరోపణలు ఖండించిన ప్రొఫెసర్

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: 8 గంటల విచారణ.. ఆరోపణలు ఖండించిన ప్రొఫెసర్

- Advertisement -

ఐఐటీ-బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను అధికారులు సుమారు ఎనిమిది గంటల పాటు విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణలో ప్రొఫెసర్ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించినట్లు తెలుస్తోంది. సాహిల్ మృతికి ప్రొఫెసర్ దూళ్ల వేధింపులే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సాహిల్ మృతికి దారితీసిన పరిస్థితులు, విద్యార్థితో ఆయన ప్రవర్తన గురించి క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రొఫెసర్‌ను ప్రశ్నించారు. అయితే, ఆయన అన్ని ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ కేసులో భాగంగా ఐఐటీ-బాంబే డైరెక్టర్ శిరీష్ కెదారేను కూడా త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ 18న జరిగిన పరీక్షలో సాహిల్ మొబైల్ ఫోన్ వాడుతూ పట్టుబడగా, ప్రొఫెసర్ దూళ్ల అతడిని పక్కకు తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. పరీక్షలో సమాధానాల కోసం సాహిల్ చాట్‌జీపీటీని ఉపయోగించినట్లు ఐఐటీ-బాంబే యాజమాన్యం వెల్లడించింది. అయితే, ఈ ఘటనపై అతనిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. మరోవైపు, ప్రొఫెసర్ దూళ్ల తన కుమారుడి పట్ల వివక్ష చూపారని సాహిల్ తండ్రి రవీంద్ర వాకోడే ఆరోపించారు. ఈ కేసులో భాగంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే సాహిల్ తల్లిదండ్రులు, స్నేహితులతో సహా సుమారు 50 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. అయితే, కేవలం తన వృత్తిపరమైన విధులను నిర్వర్తించినందుకే ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఐఐటీ-బాంబే ఫ్యాకల్టీ ఫోరమ్ ఆయనకు మద్దతుగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు