నెల రోజులుగా కొనసాగుతున్న దందా – చర్యలు తీసుకోవడంలేదని ప్రజల ఆరోపణ
విశాలాంధ్ర–గుడిబండ: గుడిబండ మండలంలోని చిగతుర్పి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే చెరువు మట్టిని భారీగా తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం, జేసీబీల సహాయంతో చెరువులో లోతైన గుంతలు తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అధికారులకు సమాచారం అందించినప్పటికీ కేవలం మౌఖిక హెచ్చరికలకే పరిమితమవుతున్నారని, కొద్ది రోజులు పనులు నిలిపివేసి మళ్లీ యథాతథంగా కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సెలవు రోజులు, పర్యవేక్షణ తక్కువగా ఉండే సమయాల్లో తవ్వకాలు అధికంగా జరుగుతున్నాయని చెబుతున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువు మట్టిని తీయాలంటే రుసుం చెల్లించి తహసీల్దార్ కార్యాలయం ద్వారా డీడీ తీసుకోవాలి. అయితే ఈ ప్రక్రియలు పాటించకుండానే మట్టిని తరలిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. చెరువులోని చింత చెట్టు చుట్టుపక్కల మట్టిని తొలగించడం వల్ల చెట్లు కూలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతులు చెరువు మట్టిని తమ పొలాలకు వినియోగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరినా స్పందన రాలేదని చెబుతున్నారు. అదే సమయంలో ఇటుక బట్టీలకు మట్టి తరలింపుపై అనుమతులు ఎలా లభిస్తున్నాయో వివరించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు పెరుగుతున్నాయని, చెరువును పరిరక్షించాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ, రెవెన్యూ శాఖలదేనని గ్రామస్తులు అంటున్నారు. తహసీల్దార్ శ్రీధర్ స్పందిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో మట్టి రవాణా చేయరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వీఆర్ఏలు, వీఆర్వోలు సంఘటన స్థలానికి వెళ్లేలా ఆదేశించామని, నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన నీటిపారుదల శాఖ జెఈ శ్రీనివాసులు చెరువు ఆయకట్టు సంఘం ప్రతినిధులతో కలిసి మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ట్రాక్టర్లు, జేసీబీ యజమానులను హెచ్చరించాలని సూచించినట్లు తెలిపారు. అక్రమ తవ్వకాల వల్ల చెరువు నిర్మాణం దెబ్బతిని భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. వెంటనే కఠిన చర్యలు తీసుకుని చెరువును రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


