Homeఆంధ్రప్రదేశ్సమసమాజం కోసం పోరాటం చేద్దాం

సమసమాజం కోసం పోరాటం చేద్దాం

- Advertisement -


. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి

విశాలాంధ్ర-తిరుపతి : దేశంలో సామ్రాజ్యవాద, మతోన్మాద శక్తులకు చరమగీతం పాడి సమసమాజ కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదరర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు సుఖదేవ్, భగత్ సింగ్, శివరాం రాజ్ గురు 95వ వర్ధంతి వేడుకలు సోమవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుట్టా హరినాథరెడ్డి మాట్లాడుతూ… భగత్ సింగ్ వర్ధంతిని సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. బ్రిటీషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉరికంబం ఎక్కారన్నారు. సామ్రాజ్యవాదం, మతమౌడ్యం, దారిద్ర్యం లేని మంచి సమాజం కోసం భగత్ సింగ్ పోరాటం చేశారన్నారు. నేడు ఆర్ఎస్ఎస్, బీజేపీ వారు భగత్ సింగ్ వారసులు అని చెప్పుకోవడం బాధాకరమన్నారు. ఆర్ఎస్ఎస్ వారు సామ్రాజ్యవాద అడుగులకు మడుగులు ఒత్తి, స్వాతంత్ర్య పోరాటానికి ద్రోహం చేశారని హరినాధరెడ్డి ఆరోపించారు. అలాంటి వారు భగత్ సింగ్ వారసులమని ఎలా చెప్పుకుంటున్నారో వారే సమాధానం చెప్పాలన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష,సహజ వనరుల దోపిడీ కోసం ప్రజాస్వామ్య దేశాలపై అక్రమంగా దండెత్తి.. నిర్ధాక్ష్యణంగా దేశాధ్యక్షులను హతమార్చి, ప్రభుత్వాలను కూలదోసి… దేశ అధ్యక్షులను బందీలుగా తీసుకుపోతున్న రాక్షస క్రీడ నేడు ప్రపంచంలో జరుగుతోందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం ఈ రాక్షస క్రీడ నిర్వహిస్తోందన్నారు. తరతరాలుగా లౌకిక విధానం పాటిస్తూ.. అలీన విదేశాంగ విధానానికి నాయకత్వం వహించిన మన దేశానికి తలవంపులు తెచ్చే విధంగా అమెరికా, ఇజ్రాయిల్ కు బాసటగా నిలబడి.. యుధ్ధం ఖండించలేని దుస్థితిలో భారత ప్రభుత్వం ఉందని హరినాథరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు మనం అందరం సిగ్గుపడాలన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో మత మౌడ్యాన్ని పెంచి పోషిస్తోందన్నారు. బీజేపీ విధానాలతో భారత సమాజం వెనక్కు నడుస్తోందన్నారు. ఆకలి సూచిలో 107వ స్థానంలో భారతదేశం ఉందంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 5శాతానికి దారిద్య్రం తగ్గిందని పాలకులు చెబుతున్నా… సుమారు 85కోట్లు మందికి ఎందుకు రేషన్ కార్డులు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రభుత్వ బడుల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని గరికపాటి నరసింహారావు అవహేళన చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వమే ఓ పథకం ప్రకారం ఇది చేస్తోందని హరినాధరెడ్డి ఆరోపించారు. గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పెంచలయ్య, కె.రాధాకృష్ణ, నదియా, ప్రజా సంఘాల నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, పద్నాభరెడ్డి, బండి చలపతి, ఉదయ్, ప్రవీణ్, వినయ్, రామకృష్ణ, రామచంద్రయ్య, శివ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు