జిల్లా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాల మంజురు లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఇందుకు జిల్లా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ లో ఉన్న డి.పి.ఆర్.సి భవనంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పథకాలకు సంబంధించి రుణాల మంజూరులో కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పురోగతి సాధించాలని, ఈ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. కొద్ది రోజుల కింద నగరంలోని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం ప్రాంగణంలో ప్రధానమంత్రి సూర్యఘర్ మేళా నిర్వహించడం జరిగిందని, అలాగే కలెక్టరేట్లో పిఎమ్ఈజీపి, స్టాండప్ ఇండియా, తదితర పథకాల కింద రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు లబ్ధిదారులకు రుణాలు అందించడం జరిగిందని, ఇందులో బాగా పనిచేసిన బ్యాంకర్లను, ఎల్డీఎంని అభినందించారు. మెప్మా కింద ఎస్.హెచ్.జి బ్యాంకు లింకేజ్ కి సంబంధించి జిల్లాకు 2,010 ఎస్.హెచ్.జిలకు బ్యాంకు లింకేజ్ చేయాలని లక్ష్యం విధించగా, అందులో గత సెప్టెంబర్ వరకు 1,005 ఎస్.హెచ్.జిలకు బ్యాంకు లింకేజ్ చేయాల్సి ఉండగా, 1,441 బ్యాంకు లింకేజ్ చేయడం జరిగిందని, 143.38 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాది కేటాయించిన లక్ష్యానికి మించి మరింత ముందుకు వెళ్లి బ్యాంకు లింకేజీలు చేపట్టాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం కింద గతేడాది 30 శాతం, ఈ ఏడాది ఇప్పటివరకు 40 శాతం మాత్రమే రుణాలు ఇవ్వడం జరిగిందని, కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హులైన లబ్ధిదారులకు ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ఆయా పథకాల లక్ష్యాలను చేరుకునేందుకు నిత్యం సమీక్ష నిర్వహించాలని ఎల్డీఎం, జిల్లా అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ పథకాలు మొదలయ్యే అవకాశం ఉందని, జిల్లా అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం బాగా ఉంటే పథకాల గ్రౌండింగ్ మరింత పెరుగుతుందన్నారు. ఎల్డీఎం, డిఆర్డిఏ పిడి, మెప్మా పీడీలు బ్యాంకర్లతో 7 రోజుల్లోగా సమావేశాలు నిర్వహించి కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేసేలా చూడాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ఏడు మండలాలను కరువు మండలాలుగా డిక్లేర్ చేయడం జరిగిందని, ఆయా మండలాల్లో ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయడం చేయాలని, కొత్త రుణాలను ఇవ్వాలన్నారు. రుణం తిరిగి చెల్లించడం చేయకపోయినా కొత్త రుణాలు ఇవ్వవచ్చన్నారు. హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకునేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు 35 వేల రూపాయల చొప్పున రుణాలు అందజేయాలని డిఆర్డిఏ పిడికి సూచించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు 90 శాతం పూర్తయి ఉన్న రెండు గ్రామ పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేయాలని, జిల్లాలో 577 గ్రామ పంచాయతీలు ఉండగా, ఆయా పంచాయతీలలో అన్ని ప్రభుత్వ పథకాల లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి మండలం నుంచి మూడు గ్రామ పంచాయతీలు చొప్పున జిల్లాలో 100 వరకు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుని ముందుగా ప్రభుత్వ పథకాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయా పథకాల కింద కేటాయించిన లక్ష్యాలను సమన్వయంతో పనిచేయడం ద్వారా వాటిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకొని, పథకాల అమలులో పురోగతి తీసుకువచ్చేలా అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎల్.డి.ఎం నర్సింగ్ రావు, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, నాబార్డు ఏజిఎం అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, జిల్లా పరిశ్రమల శాఖ జెడ్ఎం శ్రీధర్, ఫిషరీష్ డిడి శ్రీనివాసనాయక్, డీపీఓ నాగరాజునాయుడు, ఎస్సి కార్పొరేషన్ ఈడీ సారయ్య, మెప్మా పిడి విశ్వజ్యోతి, వివిధ బ్యాంక్ సీఈఓలు, మేనేజర్లు, బ్యాంకర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.