విలువలను ఆచరణలో చూపిన మహనీయులు
: జేసీ వై. మేఘ స్వరూప్
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ఈ రోజు భారతదేశం గర్వించదగ్గ మహనీయులు మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి అని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీ 156వ, లాల్ బహుదూర్ శాస్త్రి 121వ జయంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మేఘ స్వరూప్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ గారు సత్యం, అహింస, శాంతి వంటి విలువలను కేవలం బోధించడమే కాకుండా స్వయంగా తన జీవితంలో ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. స్వరాజ్యం కోసం ఆయన చేపట్టిన సత్యాగ్రహం, అహింసా ఉద్యమం ప్రపంచానికి ప్రేరణగా నిలిచిందన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి గారు సాధుస్వభావం, నిజాయితీ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని జేసీ గుర్తుచేశారు. “జై జవాన్ – జై కిసాన్” అనే నినాదంతో సైనికులు, రైతుల కృషిని గుర్తించి దేశం ముందుకు సాగే మార్గాన్ని చూపారని చెప్పారు. వారు చూపిన విలువలు, ఆచరణీయత ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయని జేసీ వివరించారు. అటువంటి ఇరువురి మహనీయులు పాటించిన వాటిలో ఒక్కటైన ఆచరణ లో చూపినా మన జీవితం ధన్యం అయినట్లే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కే ఆర్ సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్. భాస్కర్ రెడ్డి, సీపీవో ఎల్. అప్పల కొండ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి, కలెక్టరేట్ ఏవో ఆలీ, కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ కుమార్, డీటీలుగా శాస్త్రి, పద్మావతి, కలెక్టరేట్ మరియు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.


