–– పెరిగిన బాధ్యతలతో అనారోగ్యం పాలవుతున్న వైనం
–అధికారులు స్పందించి ఒత్తిడి తగ్గించాలని పలువురు వినతి
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : అనేక బాద్యతల మధ్య నలిగిపోతున్న గ్రామ పాలన వ్యవస్థ వెన్నుముకగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో తీవ్ర మానసిక, శారీరక ఒడిదుడుకులకు గురవుతున్నారని పలువులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పారిశుధ్య పనులు పర్యవేక్షణతో వారి రోజు ప్రారంభం అవుతుంది. చలికాలంలో మంచు పగల మధ్య ప్రయాణం ప్రాణ భయాన్ని తలపించే పరిస్థితులలో విధులు నిర్వహించాల్సి వస్తుంది. పంచాయతీ కార్యదర్శులు ప్రధానబాధ్యతలైన త్రాగునీటి సరఫరా ఇంటి పన్నులు వసూలు, వీధి దీపాలు నిర్వహణ వంటి పనులతో పాటు ప్రస్తుతం గ్రామ సచివాలయాల ద్వారా అమలవుతున్న ప్రతి వివిధ రకములైన సర్వేబాధ్యత కూడా వారి భుజస్కందాలపై మోపబడుతుంది. ఏ శాఖకు చెందిన పని అయినా అది పూర్తి కాకపోతే బాధ్యత మాత్రం పంచాయతీ కార్యదర్శులదే అవుతుంది. ఇదేకాక రెవెన్యూ శాఖకు సంబంధించిన ఎన్నికల విధులలో బి ఎల్ ఓ డ్యూటీలు కూడా పంచాయతీ కార్యదర్శులే నిర్వర్తించాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు మధ్య ఏర్పడి ఒత్తిళ్ళు, పరస్పద ఆరోపణల మధ్య నలిగిపోతున్న వ్యక్తి ఎవరంటే అది పంచాయతీ కార్యదర్శే ననే అభిప్రాయంసర్వత్రా వ్యక్తం అవుతుంది. స్వామిత్వ పథకం అమలు, వీఆర్వో, సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ వంటి వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జరగాల్సిన పనులన్నింటికీ జవాబుదారీగా నిలవాల్సిన పరిస్థితి ఒక్క పంచాయతీ కార్యదర్శి కే ఎదురవుతుంది. పని అడిగేది, పూర్తి పూర్తి చేయమని ఒత్తిడి తెచ్చేది, తప్పిదమైతే బాధ్యున్ని చేసేది కూడా వారినే కావడం గమనార్హం. ఐ వి ఆర్ ఎస్ కాల్స్, పారిశుద్ధ్య డోర్ టు డోర్ కలెక్షన్, రిపోర్టుల సమర్పణ వంటి పనులు అంతరాయం లేకుండా చేయాల్సి వస్తుంది. రిపోర్టుల విషయంలో అయితే చెప్పిన గంటలోనే పూర్తి చేయాలని ఒత్తిడి అధికారుల నుండి వస్తుందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీక్షలు, వీసీలు, గూగుల్ మీట్స్ అంటూ మండల కేంద్రము నందలి కార్యాలయమునకు వెళ్లడం వంటి ఈ నిరంతర పని ఒత్తిడి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఆరోగ్య సమస్యలకు లోనవుతుండగా కొందరు తమ ప్రాణాలను కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. వారు పని చేయమని నివాకరించడం లేదని, కానీ మానవీయ కోణంలో పని భారం తగ్గించేలా ప్రభుత్వంచర్యలు తీసుకోవాలని, పంచాయతీ కార్యదర్శులను నమ్ముకొని వారి కుటుంబాలు జీవిస్తున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి శాఖ పనులకు సంబంధించి అధికారులకు కనిపించే ఒక్క పంచాయతీ కార్యదర్శి కావడంతో అన్ని బాధ్యతలు వారిపైనే మోపబడుతున్నాయనే వాస్తవాన్ని పునః సమీక్షించాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిపని విధులను అదనపు సిబ్బంది నియామకం, మానసిక ఒత్తిడి, తగ్గించే విధానాలను అమలు చేస్తేనే గ్రామ పాలన వ్యవస్థ మరింత సమర్థవంతంగా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


