అత్యుత్తమ వైద్య సేవలకు తక్షణ చర్యలు
వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పీఆర్టీ స్ట్రీట్‌కు చెందిన గుడిపాటి శ్రీరామ్ ఐదున్నరేళ్ల కుమారుడు లక్ష్మణ్ వినికిడి సమస్యతో బాధపడుతున్న విషయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకురాగా, మంత్రి అత్యంత మానవీయ దృక్పథంతో వెంటనే స్పందించి చిన్నారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు చేపట్టారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా అవసరమైన వైద్య సహాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్, తన కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబును ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు బాధిత కుటుంబాన్ని స్వయంగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం చిన్నారి లక్ష్మణ్‌ను మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడకు తరలించే ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. రైలు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు వైద్య చికిత్సకు సంబంధించిన అన్ని సమన్వయ చర్యలను పూర్తి చేసి, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసి విజయవాడకు పంపించారు. ఇదే సమయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడలోని ప్రముఖ రాయుడు ఈఎన్‌టీ ఆసుపత్రి వైద్యులు డా. రాయుడు తో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి, చిన్నారి లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. చిన్నారికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించి, అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని తెలిపారు.
దీంతో కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.


