-ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు నుంచి చిన్మయనగర్, జేఎన్టీయూ మీదుగా అనంతపురం నగరానికి వెళ్లే మార్గంలో పండమేరు వాగుపై నిర్మిస్తున్న లో-లెవెల్ కాజ్‌వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం కాజ్ వే నిర్మాణ పనులను నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. పండమేరు వాగుపై సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో నిత్యం రాకపోకలు సాగించే అన్ని వర్గాల వారికి ఆటంకంగా ఉండేది అన్నారు. ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. ఈ కాజ్‌వే నిర్మాణానికి మొత్తం రూ.4 కోట్ల వ్యయం అంచనా కాగా, ప్రస్తుతం జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి రూ.2 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో పనులను వేగవంతం చేసి, నాణ్యతతో కూడిన రహదారి సౌకర్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో పీఆర్ డీఈఈ లక్ష్మీనారాయణ, జేఈఈ కిషోర్, డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, కాంట్రాక్టర్ రవి, మండల కన్వీనర్ పంపు కొండప్ప, గోనిపట్ల శీనా తదితరులు పాల్గొన్నారు.


