Thursday, December 5, 2024
Homeజిల్లాలునెల్లూరుకేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన ఎంపీ వేమిరెడ్డి

కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన ఎంపీ వేమిరెడ్డి

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కీలకం కానున్న మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ పరిశ్రమ ఏర్పాటుకు త్వరిగతిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ కు విన్నవించారు. గురువారం రాజ్‌ నాథ్‌ సింగ్‌ను కలిసిన ఎంపీ వేమిరెడ్డి.మిథాని పరిశ్రమ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. రూ.3982.00 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు అయ్యే ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 10 వేలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు.కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని మిథాని పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం గ్రామం వద్ద 110 ఎకరాలు కేటాయిస్తూ 2017లో ఉత్తర్వులు ఇచ్చింది. 2019 అక్టోబర్‌లో మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ కు కాకుండా మిథాని, నాల్కో జాయింట్‌ వెంచర్‌ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ కు భూ బదిలీ చేయాలని నిర్ణయించారు. దాంతో ఏపీఐఐసీ 2020లో 110 ఎకరాల భూ బదిలీ పూర్తి చేసింది. అనంతరం ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ కాంపౌండ్ వాల్‌ను నిర్మించింది. అలాగే కనిగిరి రిజర్వాయర్‌ నుంచి నీటిని అందించేందుకు నీటిపారుదల శాఖ సుముఖత వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు కూడా మంజూరయ్యాయి. కానీ పనులు ముందుకు సాగలేదు.వీటన్నింటినీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ వేమిరెడ్డి.. త్వరితగతిన పరిశ్రమ నిర్మాణ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమకు సంబంధించి చాలా అనుమతులు పూర్తయినా ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగడం లేదని, గత నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి లేదని వివరించారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతిపాదిత పరిశ్రమ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌పరిశ్రమ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు