రిహాబిలిటేషన్ సెంటర్, మెడికల్ క్యాంప్ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీపీ.
విశాలాంధ్ర – కడియం : ప్రజలందరూ భయభ్రాంతులకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని, అలాగే అధికారుల సూచనలు, జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ పేర్కొన్నారు. మంథా తుఫాను రీత్యా ముందస్తు చర్యగా నిరాశ్రయ ప్రజల కొరకు కడియం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఏర్పాటు చేయబడిన రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాట్లును మరియు మెడికల్ క్యాంప్ ఏర్పాట్లను మండల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ముంపు ప్రాంతాలలో మరియు పాత ఇళ్లలో నివాసం వుండే వారికి ముందస్తు జాగ్రతగా పునరావాసం కల్పించేందుకు మండల కేంద్రమైన కడియం హైస్కూల్ లో రీహాబిలిటేషన్ సెంటర్ మరియు మెడికల్ క్యాంపులను అధికారులతో చర్చించి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలో ప్రమాదకర ప్రదేశాలలో ఉన్న ప్రజలు కడియం హై స్కూల్ కు రావడానికి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో కడియం ఎంపీడీఓ రమేష్, తహసీల్దార్ సునీల్ కుమార్, ఉపసర్పంచ్ వెలుగుబంటి నాని, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ , రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


