తుపాన్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మండల ప్రత్యేక అధికారి రాంప్రసాద్
విశాలాంధ్ర – సీతానగరం: వాతావరణ శాఖ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి ఏ పి డి రాంప్రసాద్ అన్నారు. శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ స్థాయి అధికారులతో ఎంపిడిఓ ఎమ్ భారతి ఆధ్వర్యంలో తహసిల్దార్ ఏ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి రాంప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ మొంథా’ తుపాన్ రాష్ట్రంపై అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రధానంగా అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామ స్థాయి అధికారులు సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. మండల కంట్రోల్ రూమ్ నెంబర్ 9177096888 పనిచేస్తుంది అని అన్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచన మేరకు మాత్రమే కోతలు కోయాలని అన్నారు. ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ముందస్తు చర్యలలో బాగంగా ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు అక్టోబర్ 27,28 తేదీల్లో సెలవులు ప్రకటించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ సుబ్రమణ్యం, ఏ పి ఓ సత్యవతి, ఎగ్రికల్చేర్ ఏ ఓ గౌరీ దేవి, హౌసింగ్ ఏ ఈ సుబ్రమణ్యం, అర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ ప్రకాష్, అన్ని గ్రామాల పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


