బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం, సినిమా టికెట్ ధరలను మాత్రం ఆకాశానికెత్తుతున్నదని ధర్మవరం బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జి సాకే వినయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రైతు రోజువారీ కష్టానికి తగిన కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని ప్రభుత్వం, ఎరువుల కొరతతో రైతులు ఆత్మహత్యలకు దారి తీస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం చర్యలు ఎందుకు చేపట్టడం లేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అదే తెల్లవారుజామున 1 గంటకు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చి, ఒక్కో టికెట్‌ను 1000 రూపాయలకు వసూలు చేసేందుకు మార్గం కల్పించడం, మరి సాధారణ ప్రజల ప్రయోజనమా లేక వ్యాపార వర్గాలకోసమా? అని ప్రశ్నించారు. ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్, 1955 ప్రకారం రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, యూరియా మాఫియాల దందాకు ప్రభుత్వం కళ్ళు మూసుకుందన్నారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019 ప్రకారం వినియోగదారుల హక్కులు రక్షించాల్సి ఉన్నప్పటికీ, సినిమా టికెట్ దోపిడీపై చర్యలు లేకపోవడం అశోభనీయమని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (జీవన హక్కు) రైతులు, సాధారణ ప్రజలకు సమానంగా వర్తిస్తాయని, ఇవి నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన, ఉద్యమాత్మక చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు. మీరు ప్రజల కోసం వచ్చారన్నారు, కానీ మీ సినిమా ఓ.జీ కోసం ప్రజల జేబులు కోసే అమరికలకు అనుమతులు ఇవ్వడం ఆందోళన కలిగించే అంశం కాదా? రైతులకు ఎం ఎస్ పి అమలు చేయకుండా, సినిమా వ్యాపారానికి టికెట్ ధరలు పెంచడం ప్రజాస్వామ్య పద్ధతేనా? అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని నిలదీశారు. ముఖ్యంగా రైతులకు తక్షణం అమలు చేయాలని, యూరియా మాఫియాలను అరికట్టి ఎరువుల సరఫరా నిర్ధారించాలని, సినిమా టికెట్ దోపిడీపై చర్యలు తీసుకుని వినియోగదారుల హక్కులు రక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ సమస్యలను పక్కన పెడితే, బహుజన సమాజ్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమాలు, ధర్నాలు, బహిష్కరణలు, అవసరమైతే న్యాయపరమైన చర్యలు కూడా చేపడతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ బత్తలపల్లి ఇంచార్జి అమర్నాథ్, ధర్మవరం కార్యదర్శులు కొండా, బాలాజీ నాయక్, శ్రీ సత్యసాయి జిల్లా రైతు సంఘం నాయకులు నారిగొల్ల కుళ్లాయప్ప, బిఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రైతు బతుకుబండి ఆగిపోతోంది… కానీ ఓ.జీ టికెట్ 1000 రూపాయలు?
- Advertisement -
RELATED ARTICLES


