ఉద్యానవన పంటల జాగ్రత్తల పై రైతులకు అవగాహన
విశాలాంధ్ర – సీతానగరం: ఉద్యానవన పంటల రైతులు తుపాన్ ప్రభావంతో తీసుకోవలసిన జాగ్రత్తలు పై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించిన ఉద్యానవన శాఖ అధికారిని పి రిని. సోమవారం మండలంలో మిర్తిపాడు, ఉండేశ్వరపురం, సీతానగరం గ్రామాల్లో ఉద్యానవన పంటలు వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రిని మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 2227 ఎకరాల్లో ఉద్యానవన పంటలు అయిన ప్రధానంగా అరటి, కూరగాయలు 700 ఎకరాల సాగు చేస్తున్నారు అని అన్నారు. ఈ తుపాన్ ప్రభావంతో ఈదురు గాలులకు ఎక్కువగా నష్టపోయే అరటి, బొప్పాయి,కూరగాయలు, పూల రైతులకు ఈ తుఫాను ప్రభావం వల్ల నష్టాల బారిన పడకుండా పంటలు కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్ర స్థాయిలో వివరించడం జరిగింది అని అన్నారు. అరటిలో తోటలలో నిల్వ ఉన్న నీటిని వీలైనంత త్వరగా బయటకు వదలి వేయాలి. చెట్లకు వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి.నీటి ముంపులో తోట రెండు రోజులు ఉన్నట్లయితే వీలైనంత త్వరగా నీరు తీసివేసి తోటలను ఆరేలా చేసి చెట్టు ఒక్కింటికి 100 గ్రాములు యూరియా 80 గ్రాములు పొటాషియం ఎరువులను వేసుకోవాలని సూచించారు. అలాగే బొప్పాయి వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలను పంటపై పిచికారి చేయాలన్నారు. ఇక కూరగాయలు పంటలను అక్షింతల పురుగు చిత్త పురుగుల నివారణకు వర్షాలు ఆగిన వెంటనే క్లోరి పైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థియోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి పిచికారి (వంగ, కాకర ఆగాకర) చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి ఎచ్ ఏలు, రైతులు పాల్గొన్నారు.


